Papikondalu Tour : ఆహ్లాదభరితం.. ‘పాపికొండల’ పర్యాటకం.!-check here for complete details along with the route maps to papikondalu trip ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Papikondalu Tour : ఆహ్లాదభరితం.. ‘పాపికొండల’ పర్యాటకం.!

Papikondalu Tour : ఆహ్లాదభరితం.. ‘పాపికొండల’ పర్యాటకం.!

HT Telugu Desk HT Telugu
Jan 28, 2024 10:30 AM IST

Papikondalu Tourism : పాపికొండలు… ఇక్కడి ప్రకృతి అందాలను ప్రతి ఒక్కరూ అస్వాదించాల్సిందే…! టూరిజానికి కేరాఫ్ నిలిచే పాపికొండలు ప్రాంతానికి ఎలా వెళ్లాలి..? అక్కడి ప్రత్యేకతలెంటో ఈ కథనంలో చూడండి…..

పాపికొండలు టూర్
పాపికొండలు టూర్

Papikondalu Tour : పాపికొండలు.! ఈ పేరు వినగానే మనసుకి ఒకరకమైన హాయి కలుగుతుంది. మరి స్వయంగా ఈ పర్వత శ్రేణిని దర్శిస్తే ఇంకెంత సుందరభరితంగా ఉంటుందో మీరే ఆలోచించండి.! ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న "పాపికొండలు" విశిష్టత గురించి చదివేద్దాం రండి….

తూర్పు కనుమల్లోని దట్టమైన అడవులతో కూడిన ఒక భారీ పర్వత శ్రేణినే పాపికొండలుగా అభివర్ణించవచ్చు. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడిమధ్యలో ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం 1,012.86 km (391.07 sq mi) విస్తీర్ణంలో వ్యాపించి ఉండటం విశేషం. ఇది అంతరించడానికి చేరువలో ఉన్న వివిధ మొక్కలు, పక్షులు, జంతువులతో కూడిన జీవ వైవిధ్య ప్రదేశం. ఏపీలోని రాజమండ్రి నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఇవి ఉండగా తెలంగాణలోని భధ్రాచలం పట్టణం నుంచి కూడా సుమారు అంతే దూరంలో ఉన్నాయి. గొప్ప విశేషమేమిటంటే ఈ ప్రాంతం జాతీయ వనంగా గుర్తింపు పొందింది. రెండు పర్వత శ్రేణులుగా ఉండే

పాపికొండల మధ్య గోదావరి నదీ ప్రవాహం ఆహ్లాదభరితంగా సాగుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో పాపికొండల అందాలు వర్ణించలేనంత ముచ్చట గొలుపుతాయి. ఈ ప్రాంతంలో సాధారణంగా చెట్లు ఆకు రాల్చవు. ఇది అత్యంత ప్రశాంతమైన,సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడి కొండలు, జల పాతాలు, గ్రామీణ వాతావరణం కారణంగా ఈ ప్రాంతాన్ని ఆంధ్రా కాశ్మీరం అని కూడా పిలుస్తారు. ఈ కొండల్లో నెలవైన దట్టమైన అటవీ ప్రాంతంలో పెద్ద పులులు, చిరుత పులులు, నల్ల పులులు, అడవి దున్నలు జింకలు, దుప్పులు, నక్కలు, తోడేళ్ళు, కొండ చిలువలు, వివిధ రకాల కోతులు, ఎలుగు బంట్లు, ముళ్ళ పందులు, అడవి పందులు, వివిధ రకాల పక్షులు, విష కీటకాలు మొదలైన జంతుజాలం నివాసం ఉంటున్నాయి. అలాగే వేలాది రకాల ఔషధ వృక్షాలు, మొక్కలు సైతం ఉన్నాయి.

ఎలా వెళ్లాలంటే..?

రాజమహేంద్రవరం నుంచి పాపికొండల విహార యాత్ర దేవిపట్నం మండలంలోని పోశమ్మగండి గుడి వరకు రోడ్డు మార్గంలో సాగుతుంది. అక్కడి నుంచి లాంచీలో పూడిపల్లి, సిరివాక, కొల్లూరు మీదుగా పేరంటాళ్లపల్లి ఈశ్వరాలయం వరకు సాగుతుంది. ఈ యాత్రలో గోదావరి చాలా తక్కువ వెడల్పుతో కొండల మధ్య ప్రవహిస్తూ మరింత అందంగా, అత్యంత రమణీయంగా కనిపిస్తుంది.

ఇక తెలంగాణలోని భద్రాచలం నించి అయితే తూర్పు గోదావరి జిల్లాలోని వి.ఆర్‌.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం చేసి పేరంటాలపల్లికి చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పాపికొండల పర్యాటకం విహార యాత్రలకు సుదీర్ఘ విరామం తర్వాత అనుమతించింది. 2019 సెప్టెంబరులో పర్యాటకంలో ఉన్న పడవ మునిగిన దుర్ఘటన తర్వాత 21 నెలల విరామాన్ని ఇచ్చి అనంతరం మళ్లీ అనుమతించింది.

రోడ్డుమార్గంలో అయితే..

పాపికొండల వెనుక భాగానికి పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెం, కన్నాపురం, పోలవరం, శింగన్నపల్లి, వాడపల్లి, చీడూరు మీదుగా కొరుటూరుకు ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. పోలవరం వద్ద నిర్మితమవుతున్న ఇందిరా సాగర్, పోలవరం ప్రాజెక్టు వల్ల ఈ ఘాట్ రోడ్డు మార్గం కనుమరుగు కానుంది. ఇక రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో పురుషోత్త పట్నం చేరి అక్కడి నుంచి లాంచీలో ప్రయాణం మొదలు పెట్టొచ్చు. ఇక్కడ మహిమ గల దేవతగా పేరున్న గండి పోచమ్మ ఆలయం సందర్శన కోసం లాంచి ఆగుతుంది కూడా. త్రిశూలం, బంగారు బుల్లోడు వంటి ప్రముఖ చిత్రాలకు ఇక్కడే చిత్రీకరించడం విశేషం. అయితే ప్రయాణికుల వివరాలను దేవీపట్నం పోలీస్ స్టేషన్ లో తెలియజేయడానికి కూడా లాంచీని ఆపుతారు. ఈ ప్రాంతం దాటిన తర్వాత మొబైల్స్ పని చేయవు. రోడ్డు రవాణా ద్వారా వెళితే మాత్రం అత్యవసర సేవలు అందుబాటులో ఉండవు. ఇక్కడ అల్లూరి సీతా రామరాజు ముట్టడించిన పాత పోలీస్ స్టేషన్ ను చూడవచ్చు. రెండు రోజుల యాత్ర చేసే వారు బస చేయడానికి కొల్లూరులో దిగుతారు. ఇక్కడ విశ్రాంతి కోసం వెదురు గుడిసెలున్నాయి.

నిజంగా చారిత్రాత్మక ప్రదేశం..

పశ్చిమగోదావరి జిల్లాలోని పేరంటాళ్లపల్లి దగ్గర గోదావరి ప్రవాహం చాలా ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది. ఇక్కడ శివలింగం అలంకారం, ఆలయం చుట్టూ ఫల వృక్షాలు, పూల మొక్కలు కనిపిస్తాయి. అమాయక కొండరెడ్ల (గిరిజనులు) అప్యాయత, వారు చూపించే ఆదరణ నవ నాగరిక సమాజానికే తలమానికం. ఇక్కడ "శ్రీరాముని వాకిటం" అనే ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్దంలో రాజమహేంద్రవరం నుంచి ఒక మునీశ్వరుడు లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాళ్లపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు. ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంత వాసులు చెబుతారు. ఈ ప్రాంత గిరిజనులకు విద్యా బుద్ధులు, వైద్య సౌకర్యం కల్పించిన మునీశ్వరుడిని వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఈ శివాలయంలో కొండలపై నుంచి జాలువారే జలపాతం కనిపిస్తుంది. చుట్టూ పనస, పోక చెక్క వంటి అనేక మొక్కలతో ఆ ప్రాంతం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. భద్రాచలం నుంచి పాపికొండల యాత్ర చేసే యాత్రికులు తూర్పు గోదావరి జిల్లా శ్రీరామగిరి గ్రామంలోని శ్రీరామగిరి పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవచ్చు. ఎతైన కొండలు, గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కిన తర్వాత కళ్లు పరవశింపజేసేలా సుమారు 500 సంవత్సరాల కిందట మాతంగి మహర్షి ప్రతిష్ఠించిన శ్రీసీతారామ లక్ష్మణ, ఆంజనేయ సుందర విగ్రహాలను భక్తులు దర్శిస్తూ ఉంటారు. పక్కనే ఎత్తైన రెండు పర్వతాలు వాలి, సుగ్రీవుల గుట్టలు భక్తులకు కను విందు చేస్తాయి. ఈ కొండల నుంచి మరో పర్లాంగు దూరంలో చొక్కనపల్లి గోదావరి రేవులో ఝటాయువు పక్షి పడిపోయిన గుర్తులు కనిపిస్తుంటాయి. అక్కడే శ్రీ రాముడు ఝటాయువుకు పిండ ప్రదానం చేశాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి.

చరిత్ర మరువని దుర్ఘటన..

2019 సెప్టెంబరు నెలలో పోలవరం నుంచి పాపికొండలుకు బయలు దేరిన రాయల్ వశిష్ట పడవ కచులూరు సమీపంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 26 మంది సురక్షితంగా బయటపడగా 45 మంది ప్రయాణికులు చనిపోయారు. చాలా ప్రయత్నాల తర్వాత నెల రోజులకు ధర్మాడి సత్యం నేతృత్వంలోని బృందం మునిగిపోయిన బోట్ ను వెలికితీయటంలో విజయం సాధించింది. ఈ బోటు ప్రమాదం జరిగిన తర్వాత పర్యాటకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అయితే తిరిగి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విహార యాత్రకు అనుమతించాయి. దీంతో 2021 డిసెంబరు 18న పరిమిత సంఖ్యలో బోట్లతో భద్రాచలానికి 60 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రామ చంద్రాపురం మండలం పోచవరం నుంచి పాపికొండల విహార యాత్ర పునః ప్రారంభమైంది.

యాత్ర సజావుగా సాగేందుకు రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల, పర్యాటక శాఖలు సమన్వయంతో పని చేస్తాయి. ప్రతి బోట్‌లో శాటిలైట్ ఫోన్, జీపీఎస్ ట్రాకర్స్‌ అందుబాటులో ఉంచారు. బోటులో చెక్ చేయడానికి రాజమండ్రి నుండి పట్టిసీమ రేవు, పోలవరం రేవు, పురుషోత్తపట్నం రేవు వరకు ఉదయం 7:30 గంటలకు ప్రయాణం ప్రారంభమవుతుంది. పడవలోకి ప్రవేశించిన తర్వాత పర్యాటకులు పోలవరం ప్రాజెక్ట్ సైట్‌ను చూడవచ్చు. ఇది పాపి హిల్స్ పర్యటనలో సివిల్ ఇంజనీరింగ్ అద్భుతం. భద్రాచలం బోట్ పర్యాటకం ద్వారా సందర్శించదగిన చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఈ పర్యాటకానికి రాజమండ్రిలో టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చు. సాధారణ బోట్‌లకు ఒక పూర్తి రోజుకు పిల్లలు, పెద్దలకు ధర బ్యాండ్ రూ. 1,000 నుంచి రూ 1200 వరకు ఉంటుంది. ఎయిర్ కండిషన్డ్ బోట్‌లకు సింగిల్ డే ప్యాకేజీలో అదనపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.