Chandrababu : విద్యాశాఖలో మున్సిపల్ స్కూల్స్ విలీనం ప్రభుత్వ కుట్ర-chandrababu respond on municipal schools merge in education department ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Chandrababu Respond On Municipal Schools Merge In Education Department

Chandrababu : విద్యాశాఖలో మున్సిపల్ స్కూల్స్ విలీనం ప్రభుత్వ కుట్ర

HT Telugu Desk HT Telugu
Jun 08, 2022 07:29 PM IST

విద్యా శాఖలో మున్సిపల్ స్కూల్స్ విలీనం ప్రభుత్వ కుట్ర అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2115 పురపాలక పాఠశాలల ఆస్తుల కోసమే విలీన ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నాలుగున్నర లక్షల విద్యార్థుల భవిష్యత్ ను పణంగా పెడతారా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు(ఫైల్ ఫొటో)
చంద్రబాబు(ఫైల్ ఫొటో) (HT_PRINT)

ఏపీలో మున్సిపల్ స్కూల్స్ ను విద్యాశాఖ పరిధిలోకి తీసువచ్చి విలీనం చెయ్యాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యాశాఖలో మున్సిపల్ స్కూల్స్ విలీనం వెనక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆయన అన్నారు. నాలుగున్నర లక్షల మంది విద్యార్థులతో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న పురపాలక పాఠశాలలను విలీనం చెయ్యాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న 2115 మున్సిపల్ స్కూల్స్ కు ఉన్న ఆస్తుల కోసమే ప్రభుత్వం విలీన ప్రక్రియకు తెరతీసిందని ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

నిన్న మొన్నటి వరకు ఎయిడెడ్ స్కూల్స్ విలీనం కోసం ప్రయత్న చేసిన ప్రభుత్వం ఇప్పుడు మున్సిపల్ స్కూల్స్ పై పడిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా ఎయిడెడ్ స్కూళ్ల విలీనం ద్వారా ఆస్తులు దక్కించుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని న్యాయ పోరాటం ద్వారా యాజమాన్యాలు అడ్డుపడిన విషయాన్ని ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న మున్సిపల్ స్కూళ్ల ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని.. దానిలో భాగంగానే విలీన ప్రక్రియకు తెరతీసిందని మండిపడ్డారు. 160 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మునిసిపల్ స్కూల్స్ పట్టణ ప్రాంతంలో పేద, బడుగు వర్గాల విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఎంతో కీలకంగా ఉన్నాయని అన్నారు.

ప్రైవేటు స్కూల్స్ నుంచి కూడా మున్సిపల్ స్కూళ్లకు అడ్మిషన్లు వస్తున్నాయని.. కొన్ని పురపాలక పాఠశాలల్లో సీట్లు లేక నో అడ్మిషన్ బోర్డులు పెట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి తెలీదా అని చంద్రబాబు ప్రశ్నించారు. మున్సిపల్ స్కూల్స్ లో పురపాలక సంఘం ద్వారా జీతాలు అందుకుంటున్న నాన్ టీచింగ్ స్టాఫ్ జీతాలు ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. విద్యుత్ బిల్లులు సైతం మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి చెల్లిస్తున్న విషయాన్ని కూడా చంద్రబాబు గుర్తు చేశారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మున్సిపల్ స్కూల్స్ విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలీనం హైకోర్టు ఉమ్మడి సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా జరుగుతుందనే మున్సిపల్ టీచర్ల వాదనను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని విలీన నిర్ణయంపై వెనక్కి తగ్గాలన్నారు.

IPL_Entry_Point

టాపిక్