Bjp Strategy : బీజేపీ వ్యూహం అదేనా…. టార్గెట్ టీడీపీ….-bjp concentrates to attract other opposition party leaders to join with them ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Bjp Concentrates To Attract Other Opposition Party Leaders To Join With Them

Bjp Strategy : బీజేపీ వ్యూహం అదేనా…. టార్గెట్ టీడీపీ….

HT Telugu Desk HT Telugu
Aug 28, 2022 12:56 PM IST

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు చాలా అడ్డంకులున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ను దాటుకుని టిఆర్‌ఎస్‌తో కొట్లాడాలి. ఆంధ్రాలో టీడీపీని దాటుకుని వైసీపీని చిత్తు చేయాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదగడానికి దాని వ్యూహాలు దానికున్నాయి. ఇటీవలి కాలంలో ఏపీలో బీజేపీకి చేరువయ్యేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి.

ఇతర పార్టీల నుంచి చేరికలతో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ యోచన
ఇతర పార్టీల నుంచి చేరికలతో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ యోచన

దేశ వ్యాప్తంగా బీజేపీ హవా బలంగా వీస్తున్నా ఏపీలో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ప్రతిపక్ష హోదా కూడా ప్రస్తుతం ఏపీలో బీజేపీకి లేదు. అదే సమయంలో బీజేపీ సొంతంగా ఎదగడానికి చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో బీజేపీ రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంది. జనసేనానితో మిత్రత్వం ఉన్నా దానికి పరిమితులున్నాయి. మరోవైపు ఏపీలో బలమైన రాజకీయ పక్షంగా ఎదగాలంటే బీజేపీ కంటే ముందున్న టీడీపీని దాటుకుని వెళ్లాలి. టీడీపీ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నా ఆ పార్టీ నుంచి సానుకూల సంకేతాలు మాత్రం రావడం లేదు.

మరోవైపు బీజేపీ అగ్రనేతల హైదరాబాాద్‌ పర్యటనలో పలువురు సినీ నటులు వారితో భేటీ అవుతున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా సినీ నటుడు ఎన్టీఆర్‌తో షా భేటీ అయ్యారు. ఎన్టీఆర్‌, అమిత్ షా భేటీ వెనుక ఇటీవల బీజేపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. బీజేపీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఈ భేటీలు, మీటింగులు జరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అమిత్‌ షా తో ఎన్టీఆర్ భేటీ ముగిసిన తర్వాత నడ్డాతో నటుడు నితిన్, క్రీడాకారిణి మిథాలీరాజ్‌ భేటీ అయ్యారు. ఇదంతా కాకతాళీయంగా జరిగినవి కాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి తగిన గుర్తింపు తీసుకువచ్చే నాయకుల్ని పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఇప్పట్నుంచే ఎన్నికలకు సన్నద్ధం కావాలని యోచిస్తున్నారు.

ఏపీలోబీజేపీ-టీడీపీల మధ్య మైత్రి మళ్లీ వికసిస్తుందని ప్రచారం జరుగుతున్నా, అలా జరగకపోవచ్చని కూడా బీజేపీలోని మరో వర్గం విశ్లేషిస్తోంది. ఇప్పటి వరకు ఏపీలో బీజేపీ ఎదగకపోవడానికి తెలుగుదేశం పార్టీతో స్నేహమే కారణమని వారు భావిస్తున్నారు. ఇప్పటికే జనసేనతో బీజేపీకి అవగాహన ఉంది. అయితే రెండు పార్టీలు కలిసి పనిచేయడం లేదు.

టీడీపీ-జనసేన-బీజేపీలు కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వకుండా చూడొచ్చని పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తున్నారు. టీడీపీతో కలిసేందుకు జనసేన నిరాకరిస్తే టీడీపీతో కలిసి సాగేందుకు జనసేన మొగ్గు చూపొచ్చు. ఈ పరిణామాలన్నింటిని బేరీజు వేసుకున్న తర్వాత టీడీపీ నుంచి కీలకమైన నాయకుల్నిబీజేపీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. బీజేపీ-టీడీపీ కలిస్తే బీజేపీకంటే ఎక్కువ లాభం టీడీపీకి ఉంటుందని కాబట్టి బీజేపీ సొంతంగా ఎదిగేందుకు పార్టీని బలోపేతం చేసుకోవడం బెటర్ అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అన్ని కలిసొస్తే వీలైనంత త్వరలో టీడీపీ నుంచి కొందరు నేతల్ని బీజేపీలో చేర్చుకోవడం ద్వారా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించాలనే ఆలోచన కమలనాథుల్లో సీరియస్‌గా సాగుతోందని టాక్.

IPL_Entry_Point