Army Recruitment : కడపలో నవంబర్ 10 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
Indian Army Agniveer Recruitment 2024 : కడపలో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు. నవంబర్ 1 నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.నవంబర్ 15వ తేదీన ర్యాలీ ముగుస్తుందని ప్రకటించారు. ఏర్పాట్లకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కడపలో నవంబర్ 10 నుంచి అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. నవంబర్ 15 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ ర్యాలీలో 13 జిల్లాల అభ్యర్థులకు మాత్రమే పాల్గొనే ఛాన్స్ ఉంటుంది. ఈ ర్యాలీలో కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు బాపట్ల, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరుకానున్నారు.
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహణ ఏర్పాట్లపై రిక్రూట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ పునీతకుమార్, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ అదితి సింగ్, రిక్రూట్‌మెంట్ మెడికల్ ఆఫీసర్ మేజర్ అమర్ దీప్‌కుమార్, డీఆర్వో గంగాధర్‌గౌడ్ చర్చించారు. జిల్లా కేంద్రంలోని నవంబర్ 10 నుంచి 15 వరకు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని విజయవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు.
ఏర్పాట్లకు కలెక్టర్ ఆదేశాలు…
కడప జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ ఆర్మీలో చేరే అభ్యర్థుకు ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఈ ఫిజికల్ టెస్ట్‌కు రాష్ట్రంలోని కర్నూలు, నెల్లూరు, అనంతపురం, కడప, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు హాజరుకానున్నారు. అక్టోబర్ 15 లోపే మౌలిక ఏర్పాట్లను సమకూర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఫిజికల్ టెస్ట్‌కు వచ్చే అభ్యర్థులకు మౌటిక సదుపాయాలను కల్పించడంలో కడప నగర పాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల సమన్వయంతో మైదానంలో రిక్రూట్‌మెంట్ బోర్డు విధివిధానాలకు అనుగుణంగా టెంట్లు, బారికేడ్లు, విద్యుత్, తాగునీరు, టాయిలెట్స్ తదితర మౌలిక ఏర్పాట్లను సమకూర్చాలని అన్నారు. శాంతిభద్రతలు, పారిశుధ్యం తదితర అంశాలపై సంబంధిత అధికారులకు కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు.
ఫిజికల్ టెస్ట్‌లో భాగంగా 1,600 మీటర్ల రన్నింగ్ నిర్వహిస్తారు. రన్నింగ్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇతర ఈవెంట్లు, పరీక్షలు ఉంటాయి. ఈ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అభ్యర్థులు భారీగా హాజరవుతారని అంచనా. రోజుకూ వెయ్యి మంది చొప్పున అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. ఈ ర్యాలీలో ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీ శిక్షణ నిర్వహించనున్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులు పని చేయాల్సి ఉంటుంది. అగ్నివీర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత, ఎనిమిదో తరగతి పాస్ అయిన అభ్యర్థుల కోసం అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.