Employees Transfers: ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీ వద్దంటున్న ఏపీజేఏసీ, టీచర్ల సర్దుబాటుపై సంఘాల ఆగ్రహం-apjac does not want to transfer employees who will retire within a year ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Employees Transfers: ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీ వద్దంటున్న ఏపీజేఏసీ, టీచర్ల సర్దుబాటుపై సంఘాల ఆగ్రహం

Employees Transfers: ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీ వద్దంటున్న ఏపీజేఏసీ, టీచర్ల సర్దుబాటుపై సంఘాల ఆగ్రహం

HT Telugu Desk HT Telugu
Aug 21, 2024 02:14 PM IST

Employees Transfers: ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగుల‌కు బ‌దిలీల నుండి మినహాయింపు ఇవ్వాల‌ని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు పాఠశాలల హేతుబద్దీకరణ పేరుతో చేపట్టిన ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు సడలించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.

ఉద్యోగుల బదిలీల్లో నిబంధనలు సడలించాలని జేఏసీ డిమాండ్
ఉద్యోగుల బదిలీల్లో నిబంధనలు సడలించాలని జేఏసీ డిమాండ్

Employees Transfers: ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిలోపు రిటైర్ అయ్యే ఉద్యోగుల‌కు బ‌దిలీల నుండి మినహాయింపు ఇవ్వాల‌ని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సంవత్సరం లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు ప్రస్తుత బదిలీలు నుండి మినహయింపు ఇవ్వాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయిస్ స‌ర్వీస్ అసోసియేష‌న్ జాయింట్ క‌మిటీ డిమాండ్ చేసింది.

ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రిన్సిప‌ల్ ఫైనాన్స్‌ సెక్ర‌ట‌రీని క‌లిసిన‌ జేఏసీ చైర్మ‌న్ బొప్పరాజు వెంక‌టేశ్వ‌ర్లు, సెక్ర‌ట‌రీ జన‌ర‌ల్‌ పలిశెట్టి దామోద‌ర‌రావు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల (జీవో నెంబ‌ర్‌ 75ను 2024 ఆగ‌స్టు 17) ఉత్తర్వుల్లో, మార్గదర్శకాలలో "సంవత్సరం లోపు పదవీ విరామం (రిటైర్) పొందే ఉద్యోగులకు ప్రస్తుత బదిలీల నుండి మినహాయింపు" ఇవ్వలేదని, దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటార‌ని పేర్కొన్నారు.

62 ఏళ్ల‌ వయసులో అనేక శారీరక జబ్బులతో (షుగర్, బీపీ, హార్ట్ పేషంట్స్ మొద‌లైన‌) ఉంటారని, అలాంటి వయసులో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుండి బదిలీ చేస్తే తీవ్ర ఇబ్బందులకు గురికావడమే కాకుండా, వారి పెన్షన్ పేపర్లు ఆరు మాసాలు ముందుగా తయారు చేసుకుని పెన్షన్‌కు పంపాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు.

గతంలో 2016వ సంవత్సరంలో నాటి ప్రభుత్వం కూడా సంవత్సరం లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీల నుండి మినహాయింపు (జీవో నెంబ‌ర్ 102ను 2016 జున్ 10న‌) ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారుల‌ను రాష్ట్ర సచివాలయంలో క‌లిసి విజ్ఞప్తి చేశారు.

ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారులు సానుకూలంగా స్పందించి, ఒకటి, రెండు రోజుల్లో ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ నేత‌లు తెలిపారు.

సర్దుబాటు నిబంధనలను సవరించాలి.. ఏపీటీఎఫ్

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో జరుగుతున్న ఉపాధ్యాయుల పని సర్దుబాటులో ఉన్న అసంబద్ధ నిబంధనలను సవరించి క్షేత్రస్థాయిలో అవగాహన తెప్పించి నిర్వహించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జీ.హృదయ రాజు, ఎస్.చిరంజీవి కోరారు.

మిగులు ఉపాధ్యాయుల్లో సీనియర్, జూనియర్ నిర్ణయించే మెరిట్ కం రోస్టర్ విధానం పాటించకపోవడం దారుణ‌మన్నారు. స్కూల్ అసిస్టెంట్‌ల సర్దుబాటు కాకముందే, ఎస్‌జీటీలను ఉన్నత పాఠశాలకు పంపడం, 117 జీవో అమలు కానీ మున్సిపల్ పాఠశాలల్లో కూడా అవే నిబంధనలను పాటించడం స‌రికాద‌న్నారు. కార్పొరేషన్‌ల‌ను రెండు విభాగాలు చేసి వేరు వేరు సీనియారిటీ జాబితాలను తయారు చేయడం దారుణ‌మ‌న్నారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner