Pension Distribution: నాడు పెన్షన్ల పంపిణీ కుదరదని బ్యాంకు ఖాతాలకు బదిలీ, నేడు ఉద్యోగులతోనే పంపిణీకి ఆదేశాలు..
Pension Distribution: నాడు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో ఇంటింటి పెన్షన్ల పంపిణీ చేయాలని మొత్తుకున్నా కుదరదని మొండికేసిన అధికారులే నేడు రెండు రోజుల్లో ఇంటింటికి వెళ్లి పంపిణీ పూర్తి చేయాలని పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
Pension Distribution: ఏపీలో గత మూడు నెలలుగా సంక్షేమ పెన్షన్ల చెల్లింపులో తలెత్తిన సమస్యలకు ముగింపు పలికారు. రాజకీయ కారణాలతో లబ్దిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయకుండా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసేలా కొందరు అధికారులు వ్యవహరించారు. అప్పట్లో అధికార పార్టీ ఒత్తిళ్లతోనే ఇలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
గ్రామ, వార్డుసచివాలయ సిబ్బంది ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్లను పంపిణీ చేసేందుకు అవకాశం ఉన్నా బ్యాంకు ఖాతాల్లో వేసి చేతులు దులుపుకున్నారు. దీంతో పెన్షన్ల అందుకోవడంలో చాలామంది ఇబ్బందులకు గురయ్యారు. గతంలో బ్యాంకు ఖాతాల్లో పెన్షన్లు వేయాలని ఆదేశాలు జారీ చేసిన పంచాయితీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ తాజాగా సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
జూలై ఒకటోతేదీన జరిగే పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని గ్రామ, వార్డు సచివాలయ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన వెంటనే ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ల పంపిణీలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫోన్లు స్వాధీనం చేసుకోండి…
ఇప్పటి వరకు లక్షా 9వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని రాజీనామా చేసి కూడా సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేయని వారి సంగతేంటని అధికారులను ప్రశ్నించారు. అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చాలాచోట్ల గ్రామ, వార్డు సచివాలయ భవనాలు ఊరికి దూరంగా, ప్రజలకు ఏవిధంగానూ అందుబాటులో లేకుండా ఉండటంతో అవన్నీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని, అలాంటి వాటిపై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధికారులను కోరారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులందరి సెలవుల మంజూరుపై ఒక కచ్చితమైన విధానాన్ని రూపొందించాలని చెప్పారు. సచివాలయాలు జారీ చేసే సర్టిఫికెట్లు, ఇతర సర్వీసు పత్రాలపై పాత లోగోలు లేకుండా జాగ్రత్త పడాలని ఈ విషయంలో ఎక్కడైనా అలసత్వం వహించినట్టు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే సచివాలయ భవనాల మీద గత ప్రభుత్వ లోగోలు, ఫోటోలు తొలగించి వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని ఉంచాలని సూచించారు.
రాష్ట్రంలో చాలా చోట్ల గ్రామ సచివాలయాలకు, పంచాయితీలకు మధ్య సమన్వయం లేదని మంత్రి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఇతర శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులను సైతం సంప్రదించి అవసరమైతే ఒక కమిటీ వేసుకుని సమన్వయాన్ని సాధించాలని కోరారు.
గ్రామ, వార్డు సచివాలయాల రోజు వారి వ్యవహారాలను పరిశీలించేలా మండల స్థాయిలోనే ఒక అధికారికి బాధ్యతలు అప్పజెప్పే దిశగా కూడా ఆలోచనలు చేయాలని మంత్రి ఆదేశించారు. రక్త హీనత, పోహక ఆహార లోపం, బడి బయటి పిల్లలు, పాఠశాలల్లో మౌలిక వసతులు వంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి పెట్టి పురోగతి సాధించాలని కూడా ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గారు, ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ మైదీన్ గారు, డైరెక్టర్ శివప్రసాద్ గారు రాష్ట్రంలోని సచివాలయాల ప్రస్తుత పరిస్థితి మీద రూపొందించిన సమగ్ర సమాచార నివేదికను మంత్రికి సమర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ డా. అభిశేక్ గౌడ ఇతర అధికారులు పాల్గొన్నారు.
పెన్షన్ల పంపిణీపై తాజా మార్గదర్శకాలు ఇవే…
- పెన్షన్ డిస్బర్సుమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మొత్తం పెన్షన్ల పంపిణీ 1 వ తేదీలోపే పూర్తి చేయాలి. 1వ తేదీన ఇవ్వగా మిగిలిన పెన్షన్స్ 2 వ తేదీలోపు ఎట్టి పరిస్థితుల్లో అందచేయాలి.
- ఒక సచివాలయ ఉద్యోగి తన లాగిన్ లో 50 మంది కంటే ఎక్కువ పెన్షన్స్ ఇచ్చుటకు వీలుండదు.
- స్టాఫ్ వేరే చోట ఉన్నచోట, సిబ్బంది తక్కువగా ఉన్న చోట్ల గవర్నమెంట్ ఉద్యోగులు కానీ వారితో, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్, అంగన్వాడీ , ఆశ వర్కర్స్‌ను కూడా పెన్షన్ పంపిణీకి వినియోగించుకోవచ్చు. వారి లాగిన్స్ మండల ప్రజా పరిషత్ వారి లాగిన్ లో అందుబాటులో ఉంచారు.
- జూలై చివరి తేదీన పంచాయతీ కార్యదర్శి మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ ఇద్దరు కూడా పెన్షన్ అమౌంట్ విత్ డ్రా చేసి సంబంధిత సిబ్బంది కి ముందుగానే ఇవ్వాలని ఆదేశించారు.
- ఏప్రిల్ నెల నుంచి పెరిగిన పెన్షన్ అమౌంట్ 4000కి పాతబకాయిలు కలిపి మొత్తం రూ.7000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.