ఏపీ టెట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చింది. ఎలాంటి పుకార్లు నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది. తాజాగా ఆన్ లైన్ మాక్ టెస్టుల ఆప్షన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇదిలా ఉంటే టెట్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు ఆదివారం(సెప్టెంబర్ 22) నుంచి అందుబాటులోకి రానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు.
అక్టోబర్ 3 నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 20వ తేదీ వరకు పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో 18 రోజుల పాటు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
మరోవైపు పరీక్ష ముగిసిన తర్వాత రోజు అంటే అక్టోబర్ 4 నుంచి వరుసగా ప్రైమరీ 'కీ' లు అందుబాటులోకి వస్తాయి. అక్టోబర్ 5 నుంచి ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఇక అక్టోబర్ 27న టెట్ ఫైనల్ కీ విడుదల చేస్తారు. నవంబర్ 2న ఏపీ టెట్ - 2024 తుది ఫలితాలను ప్రకటిస్తారు.
ఇక టెట్ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు.
మరోవైపు కీలకమైన డీఎస్సీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో…. టెట్ స్కోరు కీలకంగా మారింది. కేవలం స్కోర్ మాత్రమే కాదు… చాలా మంది క్వాలిఫై కావటం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం చాలా మంది ఇంటి వద్దే సన్నద్ధం అవుతున్నప్పటికీ పరీక్షా విధానం, ప్రశ్నాల సరళి, సమయాభావంతో పాటు మరిన్ని విషయాలు తెలియాలంటే మాక్ టెస్టులు రాస్తే చాలా మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా పరీక్షలను రాయటం ద్వారా… అనేక అంశాలు మీకు కలిసివచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు మాక్ టెస్టులు రాసుకునే అవకాశం కల్పించారు.
సంబంధిత కథనం