AP TS Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు-ap telangana rains depression in bay of bengal heavy to moderate rains in many areas ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ts Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు

AP TS Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు

Bandaru Satyaprasad HT Telugu
Jun 25, 2023 09:13 PM IST

AP TS Rains : వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో విస్తరించి ఉన్న ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

AP TS Rains : తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రుతుపవనాలు ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లు ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. రాబోయే మూడు రోజులు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుగా వంపు తిరిగిందని ఉన్నట్లు ఐఎండీ ప్రకటించింది. ఈ ప్రాంతంలోనే అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీలో మూడు రోజు పాటు వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరప్రాంతాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఇది నైరుతి వైపుగా సాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయని విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదివారం ఆసిఫాబాద్, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్‌, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, మూసాపేట్‌, బాచుపల్లి, కేపీహెచ్‌బీ, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, కొంపల్లి, సురారం, షాపూర్‌నగర్‌, చింతల్‌, జగద్గిరిగుట్ట, మల్కాజ్‌గిరి సహా ఇతర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

IPL_Entry_Point