AP Politics: రెండు కుటుంబాలు...నాలుగు పార్టీలు...ఏపీలో రాజకీయాలు అంతే-ap politics is in the hands of two families and four parties ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Politics: రెండు కుటుంబాలు...నాలుగు పార్టీలు...ఏపీలో రాజకీయాలు అంతే

AP Politics: రెండు కుటుంబాలు...నాలుగు పార్టీలు...ఏపీలో రాజకీయాలు అంతే

Sarath chandra.B HT Telugu
Jan 22, 2024 01:24 PM IST

AP Politics: ఏపీ రాజకీయాల్లో ఏముంది అంటే..నాలుగు ప్రధాన పార్టీలు రెండు కుటుంబాలు అంతకు మించి ఏమి కనిపించదు.అక్కడ వాళ్ళే ఉంటారు. ఇక్కడ వాళ్లే ఉంటారు.

ఏపీలో రాజకీయాలు రెండు కుటుంబాల చేతుల్లోనే...
ఏపీలో రాజకీయాలు రెండు కుటుంబాల చేతుల్లోనే...

AP Politics: ఏపీలో రాజకీయాల్ని కుటుంబ పార్టీలనే అవకాశాన్నా ప్రధాన పార్టీలు కోల్పోయాయి. అధికార పార్టీ కుటుంబ సభ్యులే ప్రతిపక్షంలోను ఉంటారు. ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న వాళ్లు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లే ఉంటారు. రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నా అందులో చిత్తశుద్ధి ఎంతనేది అందరిలోను సందేహమే.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నాలుగు ప్రధాన పార్టీలు ఇప్పుడు రెండు కుటుంబాలే నడిపిస్తున్నాయి. వీటి గురించి ఇంతకు మించి చెప్పుకోడానికి కూడా ఏమి లేదు. వేర్వేరు పార్టీల్లో ఒకే కుటుంబంలో వారు ఉండటంతో గతంలో కూడా ఉన్నా ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీలను అయా కుటుంబాలే నడిపించే స్థాయికి ఏపీ రాజకీయం చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీలు వరుస క్రమంలో ఉంటాయి. ఇవి కాకుండా వామపక్షాలు, జనసేన కూడా ప్రభావం చూపించే స్థాయిలో ఉన్నాయి. సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన వైఎస్సార్సీపీని జగన్మోహన్ రెడ్డి స్థాపించి సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయనతో పాటు 2019 వరకు వైసీపీతో కలిసి సాగిన షర్మిల రెండేళ్ల క్రితం సొంతంగా తెలంగాణ పార్టీని స్థాపించి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌లో విలీనం చేశారు.

షర్మిల కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అన్నతో సమరానికి సై అంటున్నారు. అన్నా చెల్లెళ్లు చెరో పార్టీని నడిపిస్తున్నారు. జగన్‌ వైసీపీలో ఉంటే షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు భుజానికి ఎత్తుకున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ పార్టీని చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారు. మూడు విడతల్లో దాదాపు 14ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్‌ నుంచి పార్టీ పగ్గాలు దక్కించుకున్న చంద్రబాబుకు ఇప్పుడు టీడీపీ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి తీసుకు రావాలని శ్రమిస్తున్నారు.

ఏపీలో మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని కొద్ది నెలల క్రితం ఎన్టీఆర్‌ కుమార్తె, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చేపట్టారు. రాష్ట్రమంతటా పర్యటనలతో బీజేపీలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు పురందేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ అల్లుడు చంద్రబాబు ఓ పార్టీలో ఉంటే, కుమార్తె మరో పార్టీకి అధ్యక్షత వహిస్తున్నారు.

మొత్తం మీద చూస్తే ఏపీలో రెండు రాజకీయ పార్టీలను వైఎస్సార్‌ వారసులు నడుపుతుంటే, మరో రెండు పార్టీలను ఎన్టీఆర్ కుటుంబీకులు నడుపుతున్నారు. రాష్ట్రంలో మిగిలిన రాజకీయ పార్టీల బలాబలాలు ఎలా ఉన్న రాజకీయాలు మాత్రం రెండు కుటుంబాల నడుమే సాగుతున్నాయి.

వాళ్లలో వాళ్లే విమర్శించుకోవడం, ఒకరిపై ఒకరు పోరాటాలు చేయడం, అంతిమంగా అధికారాన్ని నిలబెట్టుకోవడం తప్ప జనాలకు అంతిమంగా ఒరిగే ప్రయోజనం ఏమిటి, సాధారణ ప్రజల పాత్ర ఏమిటనేది మాత్రం అంతు చిక్కదు. ఎన్నికల్లో ఓట్లకు మాత్రమే ప్రజలు పరిమితం అయ్యే రాజకీయం ఏపీలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

Whats_app_banner