AP HC On Jagan Security : ' మంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఇవ్వొచ్చు కదా’ - జగన్ భద్రత పిటిషన్ పై హైకోర్టులో విచారణ-ap high court hearing on ys jagan security petition ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Hc On Jagan Security : ' మంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఇవ్వొచ్చు కదా’ - జగన్ భద్రత పిటిషన్ పై హైకోర్టులో విచారణ

AP HC On Jagan Security : ' మంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఇవ్వొచ్చు కదా’ - జగన్ భద్రత పిటిషన్ పై హైకోర్టులో విచారణ

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 07, 2024 05:07 PM IST

AP High Court On YS Jagan Security: తన భద్రత కుదింపుపై వైెఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంపై ధర్మాసనం ప్రశ్నలు సంధించింది.

వైఎస్ జగన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ
వైఎస్ జగన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ

AP High Court On YS Jagan Security: తన భద్రత కుదింపుపై వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.  ఈ సందర్భంగా జగన్ తరపున వాదనలు వినిపిస్తూ…. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కూడా సరిగా పనిచేయడంలేదన్న న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 

అయితే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం నిర్వహణ ఎవరిదని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఇంటెలిజెన్స్‌దని ప్రభుత్వం తరపున న్యాయవాది తెలిపారు.  పిటిషనర్ కు మంచి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం, జామర్‌ ఇవ్వొచ్చు కదా అని  న్యాయమూర్తి అడిగారు. ఇందుకు అడ్వొకేట్ జనరల్ స్పందిస్తూ…. వేరే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ఉందో లేదో తెలుసుకుని చెబుతామన్నారు. 

మధ్యాహ్నాం తర్వతా మరోసారి విచారణ జరిగింది. జగన్‌కు ఉన్న బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం రీప్లేస్‌ చేస్తామని కోర్టుకు సర్కార్ తెలిపింది.  జగన్‌ భద్రతా సిబ్బంది సమాచారం ఇస్తే జామర్‌ ఇస్తామని పేర్కొంజి. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.  తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

సోమవారం  పిటిషన్ వేసిన జగన్….

ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం తనకు ఉన్న జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని కుదించిందని సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. కేంద్ర హోంశాఖ తనకు జడ్ ప్లస్ భద్రత కల్పించిందని, ఏపీలో ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందు 2024 జూన్ 3న తనకు ఏ విధ మైన భద్రత ఉందో దాన్ని పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించాలని పిటిషన్‌లో జగన్ కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, రాష్ట్రస్థాయి -సెక్యూరిటీ రివ్యూ కమిటీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి పిటిషన్‌లో 2019లో తనపై దాడి జరిగిందని.. సీఎం కాకముందే ఉన్నత స్థాయి భద్రత కల్పించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 139 మందితో భద్రత కల్పించారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముందస్తు సమాచారం లేకుండా సెక్యూరిటీని గణనీయంగా తగ్గించారని పేర్కొన్నారు. ప్రస్తుతం భద్రతా విధుల్లో 59 మంది ఉన్నారని తెలిపారు.

ప్రస్తుతం చాలామంది ఎమ్మెల్యేలకు ఉన్న వ్యక్తిగత భద్రతాధికారిల కంటే తనకు తక్కువ భద్రత ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం తనను అంతం చేయాలని చూస్తోందని జగన్ ఆరోపించారు. జడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ లో జగన్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు కల్పించిన పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్లు, కౌంటర్‌ అసాల్ట్‌ టీములు, జామర్‌ను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో జగన్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం తనకు కల్పించిన జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీని ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తగ్గించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని పిటిషన్‌లో జగన్ కోరారు.

తన ఇల్లు, కార్యాలయం వద్ద ఉన్న భద్రతను పూర్తిగా తొలగించారని, ప్రస్తుతం తనకు ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు తనకంటే ఎక్కువ మంది ఇచ్చారని పిటిషన్ లో ప్రస్తావించారు. పోలీసులు కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం ప్రయాణానికి అనుకూలంగా లేదని, అందులో ఏసీ పనిచేయడం లేదన్నారు. వాహనం లేకపోవడంతో ఓ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకోవలసి వచ్చిందన్నారు. తనను భౌతికంగా లేకుండా చేస్తామని అధికార కూటమి నేతలు ప్రకటనలు చేశారని పలు కథనాలకు సంబంధించిన వివరాలను పిటిషన్‌లో పేర్కొన్నారు. జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ పునరుద్ధరించాలని కోరుతూ జూన్‌ 7న కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేశామని, వీటి ఆధారంగా భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని జగన్ హైకోర్టును కోరారు.