AP High Court Incident : ఏపీ హైకోర్టు ఆన్ లైన్ విచారణ దుర్వినియోగం, నగ్నంగా లాగిన్ అయిన లాయర్!
AP High Court Incident : ఏపీ హైకోర్టు ఆన్ లైన్ విచారణ లాగిన్ ఓ లాయర్ దుర్వినియోగం చేశాడు. డివిజన్ బెంచ్ విచారణ సమయంలో లాయర్ నగ్నంగా లాగిన్ అయ్యాడు. ఈ బెంచ్ లో మహిళా న్యాయమూర్తి ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కరోనా తర్వాత అన్ని రంగాల్లో ఆన్ లైన్ సేవలు పెరిగాయి. కోర్టు విచారణలు సైతం ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. ఇప్పటికీ కొన్ని కేసుల్లో ఈ విధానం కొనసాగుతుంది. ఏపీ హైకోర్టు ఆన్ లైన్ విచారణలో ఒక హేయమైన ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 15న ఓ ధర్మాసనం ముందు జరుగుతున్న విచారణకు కిట్టు అనే ఐడీతో ఆన్ లైన్ లో ఓ వ్యక్తి లాగిన్ అయ్యాడు. ఆ వ్యక్తి తన ల్యాప్ ట్యాప్ లో కెమెరా ఆన్ చేసి నగ్నంగా మంచంపై పడుకున్నాడు. ఈ దృశ్యాలను డివిజన్ బెంచ్ లోని న్యాయమూర్తులు చూసి షాక్ అయ్యారు. ఈ బెంచ్ లో ఓ మహిళా న్యాయమూర్తి సైతం ఉన్నారని సమాచారం. వెంటనే ఆ లాగిన్ ను బ్లాక్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే ఈ లాగిన్ ఎవరిది? ఎందుకు ఇలా చేశారో దర్యాప్తు చేయాలని పోలీసులను న్యాయమూర్తులు ఆదేశించారు.
కోర్టులు లక్ష్యంగా
కరోనా అనంతరం హైకోర్టు ఆన్ లైన్ విచారణలకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది లాయర్లు ఇంటి నుంచే లాగిన్ అయ్యి కేసు వివరాలు కోర్టుకు తెలియజేస్తున్నారు. విచారణకు సంబంధించిన అనేక కేసుల్లో లాయర్లకు కోర్టు అధికారులు ఆన్ లైన్ లాగిన్ ఇస్తుంటారు. ఇలా లాగిన్ ఐడీ పొందిన ఓ లాయర్, ఈ హేయమైన చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. కోర్టులు, న్యాయమూర్తులను కించపరచడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. తీర్పులు తమకు అనుకూలంగా రాకపోతే...న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న ఘటనలూ ఉన్నాయి.
తుళ్లూరు పీఎస్ లో కేసు నమోదు
ఈ నెల 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దుస్సాహసానికి పాల్పడిన లాయర్ ఎవరో తోటి న్యాయవాదులకు తెలుసని సమాచారం. ఆ లాయర్ పై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది. ఏపీ హైకోర్టు విచారణ లాగిన్‌లను దుర్వినియోగం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇతర లాయర్లు కోరుతున్నారు.