AP Schools : పాఠశాలల్లో భద్రతా కమిటీలు, కంప్లైంట్ బాక్స్ లు.. 15 రోజుల్లో చర్యలు
విద్యార్థులకు పాఠశాలలు సురక్షితమైన ప్రదేశాలుగా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రణాళికలు వేస్తోంది. పాఠశాలల్లో కమిటీలు, కంప్లైంట్ బాక్స్ లు ఏర్పాటు చేస్తోంది.
ఏపీలోని ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులు, సిబ్బందికి POCSO చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులు, ముఖ్యంగా బాలికల భద్రత కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ సిస్టమ్ ను రూపొందించింది. వేధింపులు, లైంగిక వేధింపుల నుంచి విద్యార్థులను కాపాడేందుకు పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి పోక్సో చట్టం ప్రకారం బాలల రక్షణ, పిల్లల లైంగిక వేధింపుల నివారణపై శిక్షణ ఇస్తున్నారు. 'పిల్లలపై నేరాలు జరుగుతున్నప్పటికీ.. రిపోర్టింగ్ లేకపోవడం ప్రధాన సమస్య అయింది. ఈ సమస్యలను పిల్లలతో చర్చించాలని కోరుకుంటున్నాం. తద్వారా వారు ముందుకు వచ్చి చెబుతారు. వేధింపులను అరికట్టడంలో ఇది చాలా దోహదపడుతుంది.' అని స్కూల్ విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ తెలిపారు. పిల్లలను రక్షించేందుకు పాఠశాల భద్రత మార్గదర్శకాలను సిద్ధం చేశామన్నారు.
సమస్యలను పరిష్కరించడానికి ప్రతి పాఠశాలలో ప్రిన్సిపాల్ నేతృత్వంలో పాఠశాల భద్రతా కమిటీ, child abuse monitoring committee, పాఠశాల ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేశామని సురేశ్ చెప్పారు. 'విద్యార్థులు తమ సమస్యలు, చేదు అనుభవాలు మొదలైన వాటిపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా మేం ప్రతి పాఠశాలలో ప్రత్యేకంగా రూపొందించిన ఫిర్యాదుల పెట్టెను ఉంచుతున్నాం. ఉపాధ్యాయుడు లేదా ఇతర సిబ్బందిపై ఫిర్యాదు చేస్తే విచారణ చేసి తగిన శిక్ష పడేలా చేస్తాం.' అని సురేశ్ అన్నారు.
పిల్లల భద్రతపై హెల్ప్‌లైన్ నంబర్‌లతో కూడిన పోస్టర్‌లను కూడా పాఠశాలల్లో ప్రదర్శించారు. స్థానిక తహసీల్దార్, ఇతర అధికారులతో కూడిన మండల స్థాయి కమిటీ, ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి 15 రోజుల్లోగా సంబంధిత అధికారికి అవసరమైన చర్యలను సిఫారసు చేస్తుంది. పాఠశాల భద్రత, సమస్యలను చర్చించడానికి, తగిన చర్యలను నిర్ణయించడానికి పాఠశాల భద్రతా కమిటీ సభ్యులతో రెగ్యులర్ సమావేశాలు నిర్వహించనున్నారు.
శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ప్రముఖ వ్యక్తులు గుడ్ టచ్-బ్యాడ్ టచ్, లైంగిక వేధింపులు, మానసిక కౌన్సెలింగ్ లాంటి వాటిపై సెషన్‌లను నిర్వహిస్తారు. 'ప్రతి విద్యార్థి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు జారీ చేసిన భద్రత మార్గదర్శకాలను అనుసరించాలి. వివిధ సమస్యలపై ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చర్చించవచ్చు.' అని కమిషనర్ చెప్పారు.
అలాగే, విద్యార్థులు పాఠశాల ఆవరణలో లేదా వెలుపల పొగాకు, డ్రగ్స్ లేదా సంబంధిత పదార్థాల సరఫరాను గమనించినట్లయితే పాఠశాల అధికారులకు తెలిపేందుకు ఫిర్యాదుల పెట్టెను ఉపయోగించవచ్చు. ఏ విధమైన వేధింపులు, చెడు అలవాట్లు లేకుండా, పాఠశాలలను సురక్షితమైన ప్రదేశంగా మార్చడమే ప్రభుత్వం అంతిమ లక్ష్యంగా పెట్టుకుంది.