YS Viveka Case : అజేయ కల్లం వాంగ్మూలంలో ట్విస్ట్.. CBI తప్పుగా రికార్డు చేసిందంటూ పిటిషన్
YS Viveka Case Updates: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. విచారణలో భాగంగా తన వాంగ్మూలాన్ని సీబీఐ తప్పుగా రికార్డు చేసిందంటూ అజేయ కల్లం హైకోర్టును ఆశ్రయించారు.
Ajeya Kallam CBI Statement: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది వాంగ్మూలాలను సేకరించింది సీబీఐ. వీటన్నింటిని కోర్టుకు కూడా సమర్పించింది. ఇటీవలే ప్రముఖుల స్టేట్ మెంట్లు కూడా బయటికి వచ్చాయి. ఇక షర్మిలను కూడా సాక్షిగా పేర్కొంది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఇదిలా ఉంటే... తాజాగా తెలంగాణ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేసిందని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి జగన్‌ను భారతి పిలిచారని సీబీఐకి తాను చెప్పలేదని స్పష్టం చేశారు. వివేకా హత్య కేసు ఛార్జిషీట్ నుంచి తన వాంగ్మూలాన్ని తొలగించాలని కోర్టును కోరారు. తన వాంగ్మూలానికి సంబంధించి మళ్లీ విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్ లో ప్రస్తావించారు.
ఏప్రిల్ 29, 2023వ తేదీన సీబీఐ తన స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లు అజేయ కల్లం పేర్కొన్నారు. విచారణలో భాగంగా తాను చెప్పింది ఒకటయితే సీబీఐ దాన్ని మార్చి ఛార్జిషీటులో మరోలా పేర్కొందని ఆరోపించారు. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించి తాను ఎవరి వద్దా ప్రస్తావించలేదని... కానీ ఓ పత్రికలో కథనం వచ్చిందని తెలిపారు. అసత్యపూరితైన కథనం రాశారని పిటిషన్ లో పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్ తో పాటు విచారణ అధికారిని ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై త్వరలోనే విచారణ జరగనుంది.
కోర్టుకు ఛార్జీషీట్ - వెలుగులోకి కీలక విషయాలు
Viveka Murder Case : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ కోర్టుకు జూన్ 30వ తేదీన ఛార్జ్ షీట్ సమర్పించింది. ఈ ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు ప్రస్తావించింది సీబీఐ. వివేకా కుమార్తె సునీత దర్యాప్తులో వెల్లడించిన కీలక విషయాలను ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది సీబీఐ. వైఎస్ భారతి 2019 మార్చి 22న... ఇంటికొచ్చి కలుస్తానంటూ తనకు ఫోన్ చేశారని సునీత తెలిపారు. తనకు పనిఉందని చెప్పడంతో ఎక్కువ సమయం తీసుకోనని చెప్పి... భారతి, వైఎస్ విజయమ్మ, సజ్జల రామకృష్ణారెడ్డి, అనిల్ రెడ్డి మా ఇంటికి వచ్చారన్నారు. ఆ సమయంలో భారతి కొంత ఆందోళనకరంగా కనిపించారన్నారు. వివేకా మరణించిన తర్వాత పలకరింపునకు తొలిసారి ఇంటికొచ్చినందుకు అలా బాధగా ఉన్నారని అనుకున్నానన్నారు. అప్పుడు భారతి ఇకపై ఏం చేసిన సజ్జలతో టచ్‌లో ఉండాలని చెప్పారన్నారు. వివేకా హత్యపై మీడియాతో మాట్లాడాలని తనకు సజ్జల చెప్పారన్నారు. మీడియాతో మాట్లాడేటప్పుడు జగనన్నతో పాటు అవినాష్ పేరు కూడా ప్రస్తావించాలని సలహా ఇచ్చారని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత స్పష్టం చేశారు. సునీత ఓ వీడియో రికార్డు చేసి సజ్జలకు పంపిస్తే.. వీడియో కాదు ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే అది తనకు ఇబ్బందిగా అనిపించిందన్నారు సునీత. అవినాష్ అభ్యర్థిత్వాన్ని వివేకా కోరుకోలేదన్నారు. మా రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా వివాదాలు ఉన్నాయని సునీత వాంగ్మూలంలో పేర్కొన్నారు.
ఇక వివేకా హత్య కేసు ఛార్జ్ షీట్ లో ఫొటోలు, గూగుల్ టేకౌట్, లోకేషన్ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వివేకా హత్యకు వైఎస్ అవినాశ్, భాస్కర్ రెడ్డి కుట్ర చేశారని వెల్లడించింది. వివేకా హత్య కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలిపింది. పీఏ కృష్ణారెడ్డిపై కూడా అనుమానాలు ఉన్నాయని, అయితే ఆధారాలు లభించలేదన్నారు. ఆధారాలు చెరిపివేత సమయంలో మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ హత్యలో అతని ప్రమేయం నిర్ధారణ కాలేదన్నారు. వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టు అయిన వారి వివరాలు సేకరిస్తున్నామని సీబీఐ కోర్టుకు తెలిపింది. వైఫై రూటర్స్ నుంచి వివరాల కోసం అమెరికా అధికారులను సంప్రదించామన్నారు. వివేకా లేఖపై నిన్ హైడ్రేన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, వీటి ఫోరెన్సిక్ నివేదిక అందాల్సివుందని సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది.