AP Electricity Charges : ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచాలని డిస్కామ్ ల ప్రతిపాదన, ప్రజలపై రూ.8,114 కోట్ల భారం!-ap electricity charges hike discoms propose to govt may put 8k crores changes imposed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Electricity Charges : ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచాలని డిస్కామ్ ల ప్రతిపాదన, ప్రజలపై రూ.8,114 కోట్ల భారం!

AP Electricity Charges : ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచాలని డిస్కామ్ ల ప్రతిపాదన, ప్రజలపై రూ.8,114 కోట్ల భారం!

HT Telugu Desk HT Telugu
Oct 19, 2024 06:24 PM IST

AP Electricity Charges : ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వానికి విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలతో దాదాపు రూ.8114 కోట్ల భారం ప్రజలపై పడనుంది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్‌సీ) అక్టోబర్ 18న ఈ ప్రతిపాదనపై వర్చువల్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించింది.

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచాలని డిస్కామ్ ల ప్రతిపాదన, ప్రజలపై రూ.8,114 కోట్ల భారం!
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచాలని డిస్కామ్ ల ప్రతిపాదన, ప్రజలపై రూ.8,114 కోట్ల భారం!

రాష్ట్ర ప్రజ‌ల‌పై ఏకంగారూ.8,114 కోట్లు భారం ప‌డనుంది. ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖ‌ర్చు సర్దుబాటు ఛార్జీలు (ఎఫ్‌పీపీసీఏ) విధానం ద్వారా విద్యుత్ ఛార్జీలను పెంచాలని రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కామ్‌లు) ప్రతిపాదించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత ఎఫ్‌పీపీసీఏ మొత్తం రూ.8,113.60 కోట్లుగా ఉంది. ఈ మొత్తాన్ని విద్యుత్ వినియోగ‌దారుల నుంచి వ‌సూలు చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్‌సీ) అక్టోబర్ 18న ఈ ప్రతిపాదనపై వర్చువల్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించింది. ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి అధ్యక్షత‌న క‌ర్నూలులోని సంస్థ ప్రధాన కార్యాల‌యం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్‌లైన్‌లో జ‌రిగిన ఈ ప‌బ్లిక్ హియ‌రింగ్‌లో కేవ‌లం 14 మంది రాజ‌కీయ‌, వివిధ సంస్థల ప్రతినిధులు, సాధార‌ణ ప్రజ‌లు త‌మ అభ్యంత‌రాల‌ను స్పష్టం చేశారు.

యూనిట్ కు రూ.1.27 అదనపు భారం

2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రతి త్రైమాసికానికి సమర్పించిన ఈ ప్రతిపాదనలు విద్యుత్ చట్టం-2003, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అదనపు విద్యుత్ కొనుగోలు ఖర్చులపై ఆధారపడి ఉన్నాయని డిస్కమ్‌లు స్పష్టం చేశాయి. ఏపీఈఆర్‌సీ ఈ సర్దుబాటులను సమీక్షించి, ఆమోదిస్తుంది. ఆ త‌రువాత వినియోగదారులపై భారం వేస్తుంది. మొత్తం రాష్ట్రంలో సగటు సర్దుబాటు యూనిట్‌కు అద‌నంగా రూ. 1.27గా అంచనా వేసింది.

చారిత్రాత్మకంగా 2013-14 ఆర్థిక సంవ‌త్సరం వరకు త్రైమాసిక ప్రాతిపదికన ఇంధన సర్‌ఛార్జ్ సర్దుబాటు (ఎఫ్ఎస్ఎ) విధించబడింది. ఆ తరువాత ఎఫ్ఎస్ఎ నిబంధనలు రద్దు చేయబడ్డాయి. ఖర్చులు తదుపరి సంవత్సరం వార్షిక ఆదాయ అవసరాలు (ఏఆర్ఆర్‌)లో చేర్చారు. 2020-21 ఆర్థిక సంవ‌త్సరంలో, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (ఏపీటీఈఎల్‌) నుండి వచ్చిన ఆర్డర్‌ను అనుసరించి ఎఫ్‌పీపీసీఏ నిబంధనలు మళ్లీ ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 2021 నుండి ఎఫ్‌పీపీసీఏ త్రైమాసికానికి ఛార్జీ విధించబడుతుంది. 2023 మార్చి నుండి యూనిట్‌కు రూ. 0.40 ఆటోమేటిక్ నెలవారీ చేరుతుంది.

కోవిడ్‌-19 లాక్‌డౌన్ సమయంలో తగ్గిన విద్యుత్ డిమాండ్ కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిస్కమ్‌లు 'ట్రూ-డౌన్'ను కూడా ఏర్పడింది. తరువాతి సంవత్సరాల్లో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గణనీయమైన 'ట్రూ-అప్‌లు' వచ్చాయి. దీనివ‌ల్ల గణనీయమైన ఆర్థిక నష్టాలకు దారితీసింది. ఎఫ్‌పీపీసీఏ ఛార్జీల ఆమోదం లేకుండా, డిస్కమ్‌లు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనివ‌ల్ల 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 75 శాతం నష్టాలను భరించవలసి వస్తుంది.

డిస్కమ్‌లు అన్ని వ‌ర్గాల వినియోదారుల నుండి ఇంధ‌న స‌ర్దుబాటు ఛార్జీల‌ను వ‌సూలు చేయాల‌ని కోరుతున్నాయి. అందులో భాగంగానే గృహ విద్యుత్ వినియోగ‌దారుల నుంచి రూ.2,194 కోట్లు, వ్యవ‌సాయ విద్యుత్ స‌ర్వీసుల‌పై రూ.1,901 కోట్లు, పారిశ్రామిక స‌ర్వీసుల‌పై రూ.2,748 కోట్లు, వాణిజ్య స‌ర్వీసుల‌పై రూ.669 కోట్లు, ఇన్స్టిట్యూష‌న్స్‌పై రూ.547 కోట్లకు పైగా విద్యుత్ భారాలు ప‌డ‌నున్నాయి. అయితే ప్రజ‌ల‌పై భారాలు వేసేందుకు ఏపీఈఆర్‌సీ అనుమ‌తించ‌కుంటే, రూ.8,113.60 కోట్ల‌లో 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం భ‌రించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేద‌ని, ప్రజ‌ల‌పైనే భారాలు మోపేందుకు సిద్ధంగా ఉంద‌ని సీపీఎం రాష్ట్ర కార్యద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు సీహెచ్ బాబురావు విమ‌ర్శించారు.

30 యూనిట్లు లోపు వినియోగించే నిరుపేద‌ల‌పై 67 శాతం, 30 నుంచి 70 యూనిట్ల మ‌ధ్య వినియోగించే వారిపై 42 శాతం ట్రూఅప్ ఛార్జీల‌తో విద్యుత్ బిల్లులు పెర‌గ‌నున్నాయ‌ని అన్నారు. ఇప్పటికే వివిధ కారణాల‌తో ఒక్కో యూనిట్‌పై రూ.1.03 ట్రూఅప్ ఛార్జీలు వ‌సూలు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అద‌నంగా మ‌రోసారి రూ.1.27 భారం వేయ‌డంపై ప్రజ‌ల‌ను న‌మ్మించి మోసం చేయ‌డ‌మేన‌ని విమ‌ర్శించారు. అధికారంలోకి వ‌స్తే నాణ్యమైన విద్యుత్‌తో పాటు విద్యుత్ ఛార్జీలు త‌గ్గిస్తామ‌ని, ఛార్జీలు పెంపు ఉండ‌ద‌ని టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి హామీ ఇచ్చార‌ని, కానీ అధికారంలోకి వ‌చ్చిన వంద రోజుల్లోనే విద్యుత్ బాదుడుకు పూనుకున్నార‌ని ధ్వజ‌మెత్తారు.

బూడిద అమ్మకుని కోట్లు సంపాదించుకుంటూ బూడిద ర‌వాణాకు రూ.252 కోట్లు ప్రతిపాదించార‌ని పేర్కొన్నారు. ఇంట‌ర్ స్టేట్ ట్రాన్స్‌మిష‌న్ ఛార్జీల‌ను 49 శాతం పెంచి రూ.130 కోట్ల భారం వేశార‌న్నారు. సెకీ నుంచి విద్యుత్ యూనిట్ రూ.2.49 అని చెప్పి, ఇత‌ర ఛార్జీల‌తో క‌లిపి రూ.6.02 చేశార‌న్నారు. సెకీ ఒప్పందాల వ‌ల్ల 25 ఏళ్లలో రూ.62 వేల కోట్ల అద‌న‌పు భారం ప‌డుతుంద‌ని చెప్పారు. వ్య‌వ‌సాయానికి రూ.7 వేల కోట్ల వ్య‌యంతో మీట‌ర్లు బిగిస్తున్నార‌ని దీనివ‌ల్ల వినియోగ‌దారుల‌పై భారం ప‌డుతుంద‌ని అన్నారు. హిందుజా సంస్థ‌కు ఏపీఈఆర్‌సీ ఆమోదం లేకుండా రూ.1,234 కోట్లు ఎలా చెల్లిస్తార‌ని, సుప్రీం కోర్టు ఆదేశించిందని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner