AP EAPCET 2023 : ఏపీ ఈఏపీ సెట్ ఇంజినీరింగ్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఫలితాలు విడుదల, 9120 మందికి సీట్లు కేటాయింపు
AP EAPCET 2023 : ఏపీ ఈఏపీ సెట్ ఇంజినీరింగ్ అడ్మిషన్ల ఫైనల్ ఫేజ్ లో 9120 మంది సీట్లు కేటాయించారు. అభ్యర్థులు ఈ నెల 25 లోపు ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు కన్ఫార్మ్ చేసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ అధికారులు తెలిపారు.
AP EAPCET 2023 : ఏపీ ఈఏపీ సెట్ 2023 ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన తుదిదశ అడ్మిషన్ల ప్రక్రియ ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, అడ్మిషన్ల కన్వీనర్ చదలవాడ నాగరాణి గురువారం విడుదల చేశారు. చివరి దశలో 50,378 అభ్యర్థులు ఎంపిక ప్రక్రియను వినియోగించుకోగా, వారిలో 9,120 మందికి వివిధ కళాశాలల్లో సీట్లు కేటాయించారు. మొత్తం 254 కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు 1,21,997 ఉండగా, 94,407 సీట్లను భర్తీ చేశామని నాగరాణి వివరించారు. 26 విశ్వవిద్యాలయ కళాశాలల్లో 7,531 సీట్లకు గాను 5,513 సీట్లు భర్తీ చేశామన్నారు. 222 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 1,10,343 సీట్లు ఉన్నాయని, వీటిలో 85,111 సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. ఆరు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో 4,123 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండగా, 3783 భర్తీ అయ్యాయన్నారు.
ఫస్టియర్ క్లాసులు ప్రారంభం
ఏపీ ఈఏపీ సెట్ 2023లో అర్హత పొందిన అభ్యర్థుల మొత్తం సంఖ్య 1,57,513 కాగా ఫైనల్ ఫేజ్ వరకు నమోదు చేసుకున్న అభ్యర్థులు 1,04,448గా ఉన్నారు. నమోదు చేసుకున్న వారిలో అర్హులైన అభ్యర్థుల సంఖ్య 1,03,856గా ఉంది. ప్రత్యేకించి తుది దశలో నమోదు చేసుకున్న అభ్యర్థులు 1277 మంది ఉన్నారు. ఈ దశలో కళాశాలల మార్పులకు సంబంధించి 20,202 అభ్యర్థనలు నమోదు కాగా, వాటిని కూడా పరిగణన లోకి తీసుకుని అడ్మిషన్ల ప్రక్రియ ముగించామని కన్వీనర్ చదలవాడ నాగరాణ వివరించారు. ఇప్పటికే ఇంజినీరింగ్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం అయినందున 25వ తేదీ లోపు విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో ప్రవేశాలు తీసుకోవాలని సూచించారు.
ఏపీ పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఏపీలోని వ్యాయామ కాలేజీల్లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లకు పీఈసెట్ 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఏపీ పీఈసెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు ఇవాళ్టి(సెప్టెంబర్ 21) నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పీఈసెట్ కన్వీనర్ ఆచార్య పాల్‌కుమార్ తెలిపారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 23 వరకు కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్ కు జనరల్, బీసీ కేటగిరి అభ్యర్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 26 నుంచి 28 వరకు కాలేజీల ఎంపికపై వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. సెప్టెంబరు 29న అప్లికేషన్లలో మార్పులు చేసుకునే అవకాశం కల్పించినట్లు కన్వీనర్ ఆచార్య పాల్ కుమార్ పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబరు 3 నుంచి 7వ తేదీ మధ్య కాలేజీల్లో అడ్మిషన్లు పొందాల్సి ఉంటుందని తెలిపారు. ఏపీలోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 31న ఏపీ పీఈసెట్ పరీక్ష నిర్వహించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు జూన్ 16న విడుదల చేశారు. ఏపీ పీఈసెట్ పరీక్షలో మొత్తం 977 మంది అర్హత సాధించారు.