Margadarshi Deposits: మార్గదర్శి డిపాజిట్‌దారులకు ఏపీ సిఐడి నోటీసులు
Margadarshi Deposits: మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నఏపీ సిఐడి దర్యాప్తులో దూకుడు పెంచింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి సంస్థలో భారీ మొత్తంలో డిపాజిట్లు చేసిన వారికి నోటీసులు జారీ చేసింది.
Margadarshi Deposits: మార్గదర్శి చిట్‌ఫండ్స్ వ్యవహారంలో ఏపీ సిఐడి దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా మార్గదర్శి సంస్థ నిబంధనలకు విరుద్ధంగా రూ. కోటికి పైగా మొత్తాన్ని డిపాజిట్ చేసిన వారిపై దృష్టి సారించింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రూ.20వేలకు మించి డిపాజిట్లు తీసుకునే అధికారం మార్గదర్శికి లేకపోవడంతో పెద్ద మొత్తాలు డిపాజిట్ చేసిన కోటీశ్వరులందరికీ నోటీసులు జారీ చేశారు.
మార్గదర్శి చిట్‌ఫండ్స్ లావాదేవీలపై సీఐడీ దర్యాప్తు వేగవంతమైంది. చిట్‌ఫండ్స్ నిర్వహణలో పెద్దఎత్తున లావాదేవీలపై దృష్టి సారించింది. రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలను వెలికి తీస్తోంది. మార్గదర్శిలో ఇప్పటికే మూసి వేసిన 23 చిట్ గ్రూపులతో పాటు మరికొన్ని గ్రూపుల్ని మూసివేసేందుకు చర్యలు చేపట్టింది. చిట్టీల నిర్వహణను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రూ.కోటి అంతకుమించి డిపాజిట్లు చేసినవారికి సీఐడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. డిపాజిట్ల ముసుగులో బ్లాక్ మనీ నిల్వ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం చిట్‌ఫండ్ సంస్థలు డిపాజిట్లను వసూలు చేయకూడదు.
మార్గదర్శి చిట్‌ఫండ్స్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేస్తున్నట్లు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు వేర్వేరుగా నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైంది. అక్రమ డిపాజిట్లకు సంబంధించి పూర్తి వివరాలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ వెల్లడించలేదు. రశీదుల పేరిట భారీ ఎత్తున నగదు లావాదేవీలు సాగిస్తున్నట్లు సీఐడీ ప్రాథమికంగా గుర్తించింది.
ఆదాయ వివరాల పరిశీలన..
రాష్ట్రవ్యాప్తంగా 37 మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో రశీదుల పేరిట డిపాజిట్ చేసిన వారి వివరాలను సీఐడీ సేకరించింది. డిపాజిట్‌దారుల వృత్తి, వ్యాపారాలు, ఆదాయ మార్గాలు, ఇతర వివరాలతో సీఐడీ అధికారులు ఇప్పటికే నివేదిక రూపొందించారు. మొదటి దశలో రూ.కోటి అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసినవారికి నోటీసులు జారీ చేశారు.
మార్గదర్శిలో డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఎలాంటి ఆదాయ మార్గాల ద్వారా సేకరించారు? మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోనే ఎందుకు డిపాజిట్ చేశారు? తదితర వివరాలను వెల్లడించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
నిర్ణీత గడువులోగా దర్యాప్తు సంస్థకు ఈ సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. డిపాజిట్‌దారులు లిఖితపూర్వకంగా తెలిపే వివరాలను సీఐడీ అధికారులు మరోసారి క్షుణ్నంగా పరిశీలించి అందులో వాస్తవాలను వెలికితీస్తారు. ఆర్బీఐ, కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు నిబంధనలను ఎందుకు పాటించలేదనే కోణాల్లో విచారణ జరుపనున్నునారు.
కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘించినందున మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థకు చెందిన 23 చిట్టీ గ్రూపులను మూసివేయాలని స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే ఆదేశించింది. ఆ మేరకు చిట్టీ గ్రూపుల మూసివేత దాదాపు పూర్తయ్యింది. మరిన్ని గ్రూపులను మూసివేసే దిశగా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈమేరకు ఇప్పటికే గుర్తించిన అక్రమాలతో నివేదికను రూపొందిస్తున్నారు.
మూసివేసిన చిట్టీల నిర్వహణ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక అధీకృత అధికారిని నియమించనున్నారు. మూసివేసిన చిట్టీల గ్రూపుల్లోని చందాదారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లకు చందాలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చిట్టీ పాట పాడిన చందాదారులు మిగిలిన వాయిదాలను చెల్లించాలి. మూసివేసిన చిట్టీ గ్రూపుల చందాదారులకు వారి మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియ పర్యవేక్షణకు అధీకృత అధికారిని త్వరలో నియమించనున్నారు.
కోర్టు ఉత్తర్వులకు విరుద్ధమంటున్న మార్గదర్శి…
ఆదాయపు పన్ను చట్టంలోని ఏ నిబంధనలను మరియు భారతీయ రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన మార్గదర్శకాలను మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఎక్కడా ఉల్లంఘించలేదని ప్రకటించింది. చిట్ ఫండ్ వ్యాపారం కోసం నిర్దేశించిన రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా వ్యాపారాన్ని నిర్వహిస్తోందని, ఆర్థిక క్రమశిక్షణే తమ బలం అని, చందాదారుల నమ్మకాన్ని వమ్ము చేసేలా చిట్ ఫండ్ నిబంధనలను ఉల్లంఘించలేదని మార్గదర్శి యాజమాన్యం ప్రకటించింది.