Annamayya Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు-ఆయిల్ ట్యాంకర్ ఢీ, ఆరుగురు మృతి!-annamayya district apsrtc bus oil tanker met accident six dead 10 more injured ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Annamayya Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు-ఆయిల్ ట్యాంకర్ ఢీ, ఆరుగురు మృతి!

Annamayya Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సు-ఆయిల్ ట్యాంకర్ ఢీ, ఆరుగురు మృతి!

Bandaru Satyaprasad HT Telugu
Jul 22, 2023 08:03 PM IST

Annamayya Road Accident : అన్నమయ్య జిల్లా పుల్లంపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 10 మంది వరకూ గాయపడ్డారు.

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం

Annamayya Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పుల్లంపేట మండలంలో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత పట్టారు. ఈ ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుల్లంపేట సమీపంలో జాతీయ రహదారిపై కడప నుంచి తిరుపతికి వెళ్తోన్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన ఆయిల్‌ ట్యాంకర్‌ అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్‌ అతివేగంగా రావడమే ఈ ప్రమదానికి కారణమని పోలీసులు అంటున్నారు. ఈ ప్రమాదంతో రాజంపేట-తిరుపతి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. ఓబులవారిపల్లె మండలానికి చెందిన గుండాల శ్రీనివాసులు(62), కడపకు చెందిన బాషా (65), రాజంపేట మండలానికి చెందిన శేఖర్‌ (45) మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. మిగిలినవారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో తిరుపతి శ్రీ చైతన్య కళాశాలలో చదువుతున్న విద్యార్థినులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్ణాటక హసన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘట‌న‌లో న‌లుగురు మృతిచెందారు. మంగళూరు- బెంగళూరు జాతీయ రహదారిపై హసన్ జిల్లా ఈశ్వరహళ్లి కుడిగె సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఎస్‌యూవీ, టిప్పర్ ఢీకొనడంతో నలుగురు మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేఎస్ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేస్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒకరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆలూరు తాలూకా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ముగ్గురిని స్థానికులు ఆలూరు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మరణించారని వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్థారించారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 304 ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను శుక్రవారం రాత్రి బంధువులకు అప్పగించిన‌ట్టు వెల్లడించారు.

Whats_app_banner