AP Agricet 2024 Results: ఏపీ అగ్రిసెట్‌ 2024 ఫలితాలు విడుదల, నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో…-andhra pradesh ng ranga agricet 2024 results released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Agricet 2024 Results: ఏపీ అగ్రిసెట్‌ 2024 ఫలితాలు విడుదల, నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో…

AP Agricet 2024 Results: ఏపీ అగ్రిసెట్‌ 2024 ఫలితాలు విడుదల, నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో…

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 11, 2024 08:26 AM IST

AP Agricet 2024 Results: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవ సాయ విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరంలో అగ్రికల్చర్‌ బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన అగ్రిసెట్ పరీక్షల్లో 93 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.ఎన్జీరంగా వర్సిటీలో వీసీ డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మీదేవి ఫలితాలను విడుదల చేశారు.

ఏపీ అగ్రిసెట్‌ 2024 ఫలితాలు విడుదల
ఏపీ అగ్రిసెట్‌ 2024 ఫలితాలు విడుదల

AP Agricet 2024 Results: ఏపీలోని ఎన్జీ రంగా వర్శిటీ అగ్రికల్చర్‌ బిఎస్సీ ప్రవేశాల కోసం నిర్వహించిన అగ్రిసెట్‌ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,556 మంది అగ్రిసెట్‌ పరీక్షలను రాయగా 1,447 మంది ఉత్తీర్ణులయ్యారు. వ్యవసాయ డిప్లొమా కోర్సులో పంగా రామ వెంకట సుభాష్, మట్టా లావణ్య, రాచకొండ నాగలక్ష్మి 115 చొప్పున మార్కులు సాధించారు. రోస్టర్‌ ఆధారంగా మొదటి మూడు స్థానాలను వారికి కేటాయించారు.

సేంద్రియ వ్యవసాయ పరీక్షలో ఆదరణ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన కలగురి రాజేష్‌కు 92 మార్కులు, విత్తన సాంకేతిక పాలిటెక్నిక్‌, జంగమహేశ్వరపురం పాలిటె క్నిక్ కళాశాల విద్యార్థిని మొక్కా మేఘనకు 95 మార్కులతో ప్రథమ ర్యాంకులను పొందారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ర్యాంకు కార్డులు వర్సిటీ వెబ్‌‌సైట్‌లో అక్టోబర్ 11 అందుబా టులో ఉంచుతారు. కౌన్సెలింగ్ షెడ్యూల్‌, దరఖాస్తు వివరాలకు https://angrau.ac.in/ ని చూడాలని రిజిస్ట్రార్ జి. రామచంద్రరావు సూచించారు.

అగ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆగస్టు 27న ఆన్లైన్‌లో నిర్వహించిన అగ్రిసెట్-2024 పరీక్షకు 1556 మంది హాజరయ్యారు. వీరిలో 897మంది బాలికలు, 659మంది బాలురు ఉన్నారు. పరీక్షకు హాజరైన వారిలో 1,469 మంది వ్యవసాయ డిప్లొమా, 35మంది సేంద్రీయ వ్యవసాయం, 52 మంది విత్తన సాంకేతిక పరిజ్ఞానం విభాగాలో పరీక్షలు రాశారు.

అగ్రిసెట్ 2024లో మొత్తం 1,447మంది అర్హత సాధించారు. పరీక్షకు హాజరైన వారిలో 93.0% ఉత్తీర్ణత సాధించారని రిజిస్ట్రార్ రామచంద్రరావు ప్రకటించారు. అగ్రిసెట్ ఫలితాలు శుక్రవారం నుంచి వర్శిటీ వెబ్సైట్‌లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు ర్యాంక్ కార్డులను వర్శిటీ వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. కౌన్సెలింగ్ తేదీల వివరాలను వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.

ఆచార్య‌ ఎన్జీ రంగా యూనివ‌ర్శిటీలో అగ్రిక‌ల్చ‌ర్‌ కోర్సుల కోసం నిర్వ‌హించే అగ్రిసెట్-2024‌ను గత ఆగస్టులో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఆగ‌స్టు 27న కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష నిర్వహించారు.

అందుబాటులో ఉన్న సీట్లు..

రాష్ట్రంలో మొత్తం 268 సీట్లు అగ్రి కోర్సుల్లో అందుబాటులో ఉన్నాయి. అందులో యూనివ‌ర్శిటీ అగ్రిక‌ల్చ‌ర‌ల్ కాలేజీలో 196, అనుబంధ అగ్రిక‌ల్చ‌ర‌ల్‌ కాలేజీలో 72 సీట్లు ఉన్నాయి. ఇందులో అగ్రిక‌ల్చర‌ల్ కోర్సుకు 220 సీట్లు కాగా, అందులో 161 ప్ర‌భుత్వ, 59 అనుబంధ కాలేజీ సీట్లు ఉన్నాయి.

సీడ్ టెక్నాల‌జీ కోర్సుకు 37 సీట్లు కాగా, అందులో 27 ప్ర‌భుత్వ, 03 అనుబంధ కాలేజీ సీట్లు ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్‌ కోర్సుకు 11 సీట్లు కాగా, అందులో 08 ప్ర‌భుత్వ, 03 అనుబంధ కాలేజీ సీట్లు ఉన్నాయి. అనుబంధ కాలేజీల్లో ఉన్న 72 సీట్ల‌లో 24 సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద భ‌ర్తీ చేస్తారు. ఒక్కో కాలేజీకి నాలుగు సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద భ‌ర్తీ చేస్తారు.

Whats_app_banner