Employees PRC | పీఆర్సీపై ఉద్యోగుల్లో చెలరేగిన మంట.. ప్రభుత్వానికి కొత్త తంటా..!-andhra pradesh employees call for protest against new prc implemented by govt ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Employees Prc | పీఆర్సీపై ఉద్యోగుల్లో చెలరేగిన మంట.. ప్రభుత్వానికి కొత్త తంటా..!

Employees PRC | పీఆర్సీపై ఉద్యోగుల్లో చెలరేగిన మంట.. ప్రభుత్వానికి కొత్త తంటా..!

Maragani Govardhan HT Telugu
Jan 24, 2022 04:44 PM IST

మూడేళ్ల కిందట అమలు కావాల్సిన 11వ పీఆర్సీ జాప్యమవుతూ వచ్చింది. ఇటీవలే కొత్త పీఆర్సీపై ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేశారు. జనవరి 17న ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలు కోసం ఉత్తర్వులిచ్చింది. అయితే ఇందులో కొన్ని లోపాలున్నాయని, హెచ్ఆర్ఏ తగ్గింపు సరికాదని ఉద్యోగ సంఘాలు ఆందోళనకు తెరలేపాయి.

<p>పీఆర్సీ ఆందోళన</p>
పీఆర్సీ ఆందోళన (Hindustan times, twitter)

కొత్త పీఆర్సీ అమలును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉద్యోగులు నిరసన బాట పట్టిన విషయం తెలిసిందే. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జనవరి 20 గురువారం నాడు కలెక్టరేట్ల ముట్టడికి యత్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. మరోపక్క ప్రభుత్వం కూడా ఈ అంశంపై కేబినేట్‌తో చర్చించనుంది. మూడేళ్ల కిందట అమలు కావాల్సిన 11వ పీఆర్సీ జాప్యమవుతూ వచ్చింది. ఇటీవలే కొత్త పీఆర్సీపై ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేశారు. జనవరి 17న ప్రభుత్వం కొత్త పీఆర్సీ అమలు కోసం ఉత్తర్వులిచ్చింది. అయితే ఇందులో కొన్ని లోపాలున్నాయని, హెచ్ఆర్ఏ తగ్గింపు సరికాదని ఉద్యోగ సంఘాలు ఆందోళనకు తెరలేపాయి. సమ్మెకు ప్రకటన చేశాయి.

కొత్త పీఆర్సీలో ఏముంది?

పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డికి నివేదించాయి. ఆ తర్వాత సీఎం సమక్షంలో రెండు రోజుల పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో చర్చించి జనవరి 7న అధికారికంగా పీఆర్సీపై సీఎం ప్రకటన చేశారు. నూతన పీఆర్సీలో 23 శాతం ఫిట్‍‌మెంట్ వస్తుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం లాంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 17న పీఆర్సీ అమలు కోసం ఉత్తర్వులు జారీ చేశారు.

2019 జూన్‌లో ఇచ్చిన మధ్యంతర భృతి కంటే ఈ ఫిట్‌మెంట్ తక్కువగా ఉన్నప్పటికీ ఉద్యోగులు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరచలేకపోయారు. కానీ అసలు సమస్య హెచ్ఆర్ఏలో చేసిన మార్పుల కారణంగా తలెత్తింది. నూతన పీఆర్సీలో హౌస్ రెంటల్ అలవెన్సు తగ్గించడం వారిని కలవరపెట్టింది. గతంలో ఇచ్చిన హెచ్ఆర్ఏ కంటే ఇప్పుడు తగ్గిందని వారు భావిస్తున్నారు.

హెచ్ఆర్ఏ తగ్గింపుపై వ్యతిరేకత..

గతంలో ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 30 శాతం వరకు ఉండేది. మూడు శ్లాబుల్లో(30, 20, 14.5) దీన్ని చెల్లించేవారు కానీ సీఎస్ కమిటీ ప్రస్తుతం ఉద్యోగులు అందుకుంటున్న ఈ హౌసింగ్ అలవెన్సును భారీగా తగ్గించాలని సిఫార్సు చేసింది. నగరాల్లో (5 నుంచి 50 లక్షల జనాభా)పనిచేస్తున్న సిబ్బందికి ఈ భత్యాన్ని 16 శాతంగా నిర్ణయించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇంత జనాభా ఉన్న నగరాలు చాలా తక్కువ. విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి ఇలా ఒకటెండ్రు మినహా 5 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాలు లేవు. అంటే దాదాపు 10 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే 16 శాతం హెచ్ఆర్ఏ అందుతుంది. సీఎస్ కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం మిగిలిన 90 శాతం ఉద్యోగులకు 8 శాతమే అద్దె భత్యం అందుతుంది.

నగరాలకు సమీపంలో ఉండే సిబ్బందికి హెచ్‌ఆర్‌ఏ ఒక్కసారిగా 20 నుంచి 8 శాతానికి పడిపోయింది. పట్టణ ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులకు గతంలో 14.5 శాతం హెచ్‌ఆర్‌ఏ దక్కేది. ఇప్పుడది 8 శాతమేనని ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో హెచ్‌ఆర్‌ఏలో కనీసంగా 4 నుంచి 14శాతం వరకూ తగ్గుదల అనివార్యమైంది. అంతేకాకుండా ఫిట్‌మెంట్ 23 శాతానికే పరిమితం చేయడం వల్ల బేసిక్ పేలోనూ పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు.

ఉద్యోగుల డిమాండ్లు..

ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీతో తమ వేతనాల్లో కోత పడుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. విభజన చట్టం ప్రకారం బెనిఫిట్స్ తగ్గకూడదని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్త పీఆర్సీని సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్ఆర్ఏ తగ్గుదల, సీసీఏ రద్దుతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు ప్రయోజనం కల్పించే అంశాల్లో రాజీపడబోమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన 43 శాతం ఫిట్‌మెంట్‌ను దాదాపు సగానికి పరిమితం చేశారని అన్నారు. కాబట్టి కొత్త పీఆర్సీకి బదులు పాత పీఆర్సీనే కొనసాగించాలని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా జగన్ సర్కారుపై పిటీషన్ దాఖలు చేశారు.

ప్రభుత్వం ఏమంటోంది..

రాష్ట్ర విభజన, ఇతర కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి విషమించిందని ప్రభుత్వ పెద్దలే స్వయంగా పలు వేదికల ద్వారా గతంలో తెలిపారు. ఆదాయం పడిపోయి, అప్పులు పెరిగాయని, వీలున్నంత వరకు ఉద్యోగుల సమస్య పరిష్కరిస్తున్నామని మంత్రులు చెబుతున్నారు. 23 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి జీవో విడుదలైన తర్వాత ఆందోళన చేయడం సరికాదని చెబుతున్నారు. సానుకూలమైన రీతిలో సామరస్యంగా చర్చించి సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతున్నారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం