AP Assembly Session : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
AP Assembly Session ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో సమవేశాలు ప్రారంభం కానున్నాయి. బిఏసి సమావేశం తర్వాత సభ ఎన్ని రోజులు జరగాలో నిర్ణయించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని వ్యవహారంపై కీలక ప్రకటనలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.
AP Assembly Sessionఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు 10 రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో 17వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 15 బిల్లులను సభ ముందుకు రానున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ బడ్జెట్ సెషన్ కీలకం కానుంది. సంక్షేమ పథకాలకు కేటాయింపులు, ఖర్చులు, అప్పులు తదితర అంశాలపై ఆసక్తి నెలకొంది.
అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత చంద్రబాబు హాజరు కావడం లేదు. టీడీపీ సభ్యులు హాజరు కానున్నారు. ఆస్తిపన్ను, మూడు రాజధానులు, పోలవరం, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల అంశాలపై అధికార పార్టీని నిలదీయాలని భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలనేది నేడు జరిగే బిజినెస్ ఎడ్వయిజరీ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తెలుగుదేశం తరుపున శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు బిఏసికి హాజరు కానున్నారు. ఆస్తిపన్ను సవరణలకు సంబంధించిన బిల్లును సమావేశాల్లో ఆమోదించనున్నట్లు తెలిసింది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేసే అంశంపైనా ఈ సమావేశాల్లో ప్రకటన చేయనున్నారు.
గతంలో అసెంబ్లీలో తీర్మానం చేయడంలో చట్టపరమైన సమస్యలు తలెత్తడంతో ఈ సారి ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. దీని ద్వారా సిఎం విశాఖ నుంచి పాలన సాగించవచ్చని తెలుస్తోంది. నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన పలు అంశాలపై ముఖ్యమంత్రి రోజుకొక అంశంపై లఘు చర్చల రూపంలో మాట్లాడనున్నట్లు తెలిసింది.
గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం…
తొలిరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్‌నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఉభయసభలూ మరుసటి రోజుకు వాయిదా పడనున్నాయి. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే శాసనసభ, శాసనమండలి వ్యవహారాల సలహా మండళ్లు భేటీ అవుతాయి. సమావేశాల అజెండాను ఖరారు చేయనున్నాయి.
ప్రభుత్వం తరఫున 25 నుంచి 30 అంశాలను వైకాపా చర్చకు ప్రతిపాదించనుంది. ఈ నెల 17న సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించారు. బడ్జెట్ ఎప్పుడనే దానిపై నేడు స్పష్టత రానుంది. ఈ సమావేశాల్లో సీఎం జగన్ పలు అంశాలపై కీలక ప్రకటనలు చేయనున్నారు. తాను విశాఖకు తరలి వెళ్లనుండటంపైనా స్పష్టత ఇవ్వనున్నారు. రాజధాని తరలింపు ఆలశ్యమైనా ముఖ్యమంత్రి విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని గట్టిగా భావిస్తున్నారు.
ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైన టీడీపీ
మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో 15కు పైగా ప్రధాన సమస్యలపై ఉభయసభల్లో చర్చకు పట్టుపట్టాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నిర్ణయించింది. విద్యుత్ ఛార్జీల పెంపు, నిరుద్యోగం, పోలవరం, రైతుల సమస్యలు, ప్రతిపక్షాల కార్యక్రమాలపై ప్రభుత్వ ఆంక్షలు, కేసుల నమోదు వంటి పలు అంశాలపై చర్చకోసం సన్నద్ధమైంది. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి మంగళవారం ఉదయం నివాళి అర్పించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రదర్శనగా అసెంబ్లీకి వెళ్లనున్నారు.
మరోవైపు సీఎం జగన్ తన వద్దనున్న శాఖలను పలువురు మంత్రులకు కేటాయించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ శాఖలకు సంబంధించి ఆయా మంత్రులే సమాధానాలు చెప్పనున్నారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయం అసెంబ్లీ కార్యదర్శికి సోమవారం రాతపూర్వకంగా తెలిపింది. కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సాధారణ పరిపాలన శాఖ, తానేటి వనితకు శాంతిభద్రతలు, ఆదిమూలపు సురేష్‌కు న్యాయశాఖ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ఎన్‌ఆర్‌ఐ సాధికారికత-సంబంధాలు, ప్రభుత్వ రంగ సంస్థల వ్యవహారాలను అప్పగించినట్లు సిఎంఓపేర్కొంది.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు….
ఆంధ్రప్రదేశ్ శాసనసభ- శాసనమండలి బడ్జెట్ సమావేశాలు జరుగనున్న దృష్ట్యా అధికారులతో కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఐపిఎస్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో కలిసి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న దృష్ట్యా చుట్టు ప్రక్కల ఉండే ప్రాంతాల్లో పర్యటించి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతర విషయాలు అధికారులతో కలిసి చర్చించారు.