September 26 Telugu News Updates : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
- తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణను సోమవారం నిర్వహించనున్నారు.శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో ప్రారంభమయ్యే అంకురార్పణ కార్యక్రమాలు రాత్రి 7 గంటల నుంచి 8 వరకు నిర్వహిస్తారు. రాత్రి ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే 'మృత్సంగ్రహణ యాత్ర' అంటారు. ఈ మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్ని అంకురార్పణగా పేర్కొంటారు.
Mon, 26 Sep 202204:52 PM IST
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుమల కొండపై శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. మంగళవారం సాయంత్రం ధ్వజారోహణం బ్రహ్మోత్సవాలు మెుదలవుతాయి. తొమ్మిది రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీవారికి సీఎం జగన్ మంగళవారం ఉదయం పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
Mon, 26 Sep 202203:24 PM IST
భాగ్యనగరంలో భారీ వర్షం
భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రయాణికులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ కోరారు. ట్రాఫిక్‌లో ఇరుక్కుంటారని చెప్పారు. అసెంబ్లీ, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లిబర్టీ, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో భారీ వాన పడింది.
Mon, 26 Sep 202202:10 PM IST
ఏపీఐఐసీ గోల్డెన్ జూబ్లీ లోగో ఆవిష్కరించిన సీఎం
సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీఐఐసీ గోల్డెన్ జూబ్లీ లోగోను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. పారదర్శక పారిశ్రామిక విధానంతో పారిశ్రామిక వాడల అభివృద్దికి నిరంతరం కృషిచేయాలన్నారు. రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సీఎం స్పూర్తితో మరింత వేగంగా పారిశ్రామిక పార్కులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారిస్తామని ఏపీఐఐసీ ప్రతినిధులు చెప్పారు.
Mon, 26 Sep 202211:14 AM IST
దుర్గమ్మను దర్శించుకున్న గవర్నర్ దంపతులు
కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ అన్నారు. అమ్మవారి దర్శనంతో సకల శుభాలు చేకూరుతాయన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు ఆలయ ఈఓ భ్రమరాంబ పూర్ణకుంభం స్వాగతం పలికారు.
Mon, 26 Sep 202209:59 AM IST
ఐలమ్మ స్ఫూర్తితో పోరాడాలి
వీర నారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో టీఆర్ఎస్ అవినీతి-నియంత-కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని బండి సంజయ్ అన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకుని బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు.
Mon, 26 Sep 202208:43 AM IST
బెయిల్ తిరస్కరణ
దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. వైఎస్ వివేకా హత్య కేసులో బెయిల్ ఇవ్వాలని సుప్రీంలో శివశంకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరుకు ఎలాంటి కారణాలు కనిపించడంలేదన్న సుప్రీం కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Mon, 26 Sep 202208:05 AM IST
ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు సరికాదన్న జగ్గారెడ్డి
సీఎం జగన్ నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తప్పుపట్టారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులు ఆమోదయోగ్యంగా ఉండాలని, ఏపీకి అమరావతినే రాజధాని ఉండాలని కాంగ్రెస్ నిర్ణయమన్నారు. ఏపీ కాంగ్రెస్ కూడా అదే నిర్ణయంలో ఉందన్నారు. మూడు ప్రాంతాల్లో 3 రాజధానుల నిర్ణయం సరికాదని, సీఎం జగన్ ది తప్పుడు నిర్ణయమన్నారు. వైఎస్ షర్మిలపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ కూతురైతే వ్యక్తిగత విమర్శలు ఎంతవరకు కరెక్ట్ అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. వైఎస్ బాటలో షర్మిల నడవడం లేదని, బీజేపీ డైరెక్షన్ లోనే షర్మిల పనిచేస్తోందని ఆరోపించారు. షర్మిల మోదీని ఎందుకు విమర్శించడం లేదని, జగన్, బీజేపీ వదిలిన బాణమే షర్మిల అని ఆరోపించారు. వైఎస్ షర్మిల వైఎస్ పేరును దిగజార్చవద్దని, వ్యక్తిగత విమర్శలు చేయాలంటే మా దగ్గర కూడా చాలా ఉన్నాయిన్నారు.
Mon, 26 Sep 202208:03 AM IST
ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎదురు దెబ్బ
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనంతబాబు బెయిల్ పిటిషన్‍ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. డ్రైవర్ హత్యకేసులో పోలీసులు 90 రోజుల్లో చార్జ్ షీట్ దాఖలు చేయనందున డిపాల్ట్ బెయిల్ మంజూరు చేయాలంటూ అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు అనంతబాబు గత నేర చరిత్రను పోలీసులు హైకోర్టుకు సమర్పించడంతో అతని బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.
Mon, 26 Sep 202206:14 AM IST
అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. కనకదుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు.
Mon, 26 Sep 202205:30 AM IST
చిత్తూరు టూటౌన్ పిఎస్‌లో కేసులు
చిత్తూరు టూటౌన్ పీఎస్‍లో టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. 13 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సబ్ జైలు నుంచి బెయిల్‍పై విడుదలైన సందర్భంగా టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించడంతో కేసులు నమోదు చేశారు. మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు సహా 13 మందిపై కేసులు నమోదయ్యాయి. టీడీపీ నేతలపై కేసులు నమోదుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mon, 26 Sep 202204:31 AM IST
అవనిగడ్డలో యువకుడు దారుణ హత్య.
కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం రామచంద్రపురం లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు బచ్చు శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే అర్ధరాత్రి హత్య జరిగి ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon, 26 Sep 202204:28 AM IST
అక్రమ లావాదేవీలపై ఈడీ విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్‍లో అక్రమ లావాదేవీలపై ఈడీ విచారణ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సేకరించిన ఆధారాల ద్వారా ఢిల్లీలో విచారణ జరుపుతుననారు. ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు), అభినవ్‍రెడ్డి, అభిశేక్‍రావు, గండ్ర సృజన్, శరత్ చంద్రారెడ్డిని విచారించిన ఈడీ . గత విచారణలో శ్రీనివాసరావు నుంచి కీలక విషయాలు రాబట్టిన ఈడీ , విచారణలో నిందితులు ఇచ్చే సమాచారం సంతృప్తికరంగా లేకుంటే అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
Mon, 26 Sep 202204:27 AM IST
ఎమ్మెల్యేకి చేదు అనుభవం
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబును గ్రామస్తులు నిలదీశారు. గ్రామంలో అభివృద్ధి జరగడం లేదని ఫిర్యాదు చేశారు. రహదారులు, డ్రైనేజీ సౌకర్యం లేదంటూ ఎమ్మెల్యేపై మండిపడ్డారు
Mon, 26 Sep 202204:11 AM IST
రెండు బైకుల ఢీ, ఇద్దరు మృతి
తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం ప్రక్కిలంక వద్ద రెండు బైకులను ట్రాక్టర్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు అన్నదేవరపేటకు చెందిన వారిగా గుర్తించారు.
Mon, 26 Sep 202204:11 AM IST
ఏలూరు జిల్లాలో అమరావతీ రైతుల పాదయాత్ర
ఏలూరు జిల్లాలో 15వ రోజు అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగుతోంది. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొనికి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర, నేడు సుమారు 15 కిలోమీటర్లు సాగనుంది
Mon, 26 Sep 202204:11 AM IST
రాజస్థాన్ కాంగ్రెస్‌లో సంక్షోభం
కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి గెహ్లాట్ పోటీ పడుతున్న నేపథ్యంలో సిఎం పదవికి రాజీనామా చేయనుండటంతో ఆయన వర్గం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. గెహ్లాట్ స్థానంలో సచిన్ పైలట్‌కు సిఎం పదవి ఇస్తారనే వార్తల నేపథ్యంలో గెహ్లాట్ వర్గం రాజీనామాలు చేసింది. సీఎల్‍పీ సమావేశానికి ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా చేశారు. సచిన్ పైలెట్ సీఎం కాకుండా అడ్డుకునే యత్నంలో అశోక్ గెహ్లాట్ వర్గం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. స్పీకర్‍కి రాజీనామా లేఖలు ఇచ్చి గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు.
Mon, 26 Sep 202204:11 AM IST
ప్రకాశం జిల్లాలో మంత్రుల పర్యటన
నేడు ప్రకాశం జిల్లాలో మంత్రుల బృందం పర్యటించనుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రుల బృందం శ్రీకారం చుట్టనుంది. మార్కాపురం, యర్రగొండపాలెంలో మంత్రుల పర్యటిస్తారు. ప్రకాశం జిల్లా పర్యటనకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, రోజా, మేరుగ నాగార్జున వెళ్లనున్నారు.
Mon, 26 Sep 202204:11 AM IST
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ప్రారంభం
బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గా దేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. తొలి రోజు ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ ఏడాది అమ్మవారు పది రోజుల పాటు భక్తులకు వివిధ అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు.