AP CM Jagan: మార్చి, ఏప్రిల్ నెలలోనే ఏపీ ఎన్నికలు, క్లారిటీ ఇచ్చేసిన జగన్
AP CM Jagan: రానున్న మార్చి,ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు ఉంటాయని జగన్ ప్రకటించార. తన ఆలోచనలు గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని నేతలకు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలు బాగా అమలయ్యేట్టుగా పర్యవేక్షించాలన్నారు.
AP CM Jagan: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏపీ సిఎం జగన్ పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఎన్నికలు జరుగుతాయని పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు. పార్టీ వ్యవస్థలో అత్యంత కీలకమైన మండలస్థాయి నాయకుల నుంచి మంత్రుల వరకు ప్రజాప్రతినిధులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మార్గ నిర్దేశం చేశారు.
52నెలల్లో కనివిని ఎరుగని విధంగా సువర్ణక్షరాలతో లిఖించేలా పాలన అందించామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. విజయవాడలో నిర్వహించిన సభలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం కల్పించడమే లక్ష్యంగా జగన్ ప్రసంగించారు.
గ్రామ స్థాయిలోనే అవినీతికి ఏమాత్రం తావు లేని, లంచాలకు,వివక్షకు తావులేి డిబిటి ద్వారా ఎన్నడూ రాష్ట్రంలో చూడని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్టు చెప్పారు. మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులు ప్రకటించినట్టు చెప్పారు.
13జిల్లాల ఏపీలో 26జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రామ స్థాయిలోనే గతంలో ఎన్నడూ చూడని సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో పాటు 50ఇళ్లకు వాలంటీర్‌ను తీసుకొచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వ పథకాలకు అర్హతే ప్రమాణికంగా ప్రతి ఒక్కరికి అందించినట్టు చెప్పారు. ఎక్కడా లంచాలు లేకుండా, వివక్షకు తావు లేకుండా గ్రామ స్థాయిలోనే ప్రతి ఒక్కరికి అందించగలిగినా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు.
మ్యానిఫెస్టోలో 99శాతం నెరవేర్చాం…
మ్యానిఫెస్టో అంటే ఎన్నికల సమయంలో మాత్రమే చెబుతారని, కానీ 99శాతం వాగ్ధానాలను అమలు చేయడం ద్వారా చెప్పాడంటే చేస్తాడని, మాట నిలబెట్టుకుంటాడని, కష్టమైనా నష్టమైనా అండగా ఉంటాడనే మంచి పేరు తెచ్చుకున్నట్టు జగన్ చెప్పారు.
నాలుగేళ్ల పాలనలో అన్ని సామాజిక వర్గాలను, అన్ని ప్రాంతాలను ప్రేమగా అభిమానించినట్లు చెప్పారు. ప్రతి మాట ముందు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలని చెబుతూ రూ.2.35లక్షల కోట్ల రుపాయలను డిబిటి ద్వారా నేరుగా బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు చెప్పారు. 75శాతం పైచిలుకు లబ్ది చేకూర్చినట్టు చెప్పారు. 70ఏళ్లలో రాష్ట్రం మొత్తమ్మీద నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే 2.07లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తాను ఇవ్వగలిగినట్టు చెప్పారు. వాటిలో 80శాతం పైగా ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చామన్నారు.
31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని, 22లక్షల ఇళ్లు వేగంగా నిర్మాణం జరుగుతున్నాయన్నారు. వీటిలో 80శాతం ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకు అందించామన్నరు. రాష్ట్రంలో మునుపెన్నడు చూడని విధంగా నామినేటెడ్ పదవులు, పోస్టుల్లో 50శాతం వారికే కేటాయించామని చెప్పారు. చట్టం చేసి మరి పదవుల్ని అయా వర్గాలకు అందించామన్నారు. స్థానిక సంస్థలు మొదలుకుని రాష్ట్ర క్యాబినెట్ వరకు సామాజిక న్యాయం వర్ధిల్లిన పాలన వైసీపీలో మాత్రమేనని చెప్పారు.
బీదలు, బడుగు,బలహీన వర్గాలు తమ కుటుంబం అని భావించి ప్రతి అడుగు వేసినట్టు చెప్పారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలు బాగుంటేనే మారుమూల పల్లెల్లో ఉన్న పేదల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని నమ్మి ఇంతకు ముందు చూడని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్టు చెప్పారు.
పేదరిక నిర్మూలనకు కృషి….
పేదరికం పోవాలని, పేదలు పై స్థాయికి రావాలని కృషి చేసినట్టు చెప్పారు. సమాజంలో 50శాతం మహిళా సాధికారత కోసం తమలా ఎవరు ఆలోచన కూడా చేయలేదని చెప్పారు. తాము మాత్రమే వారికి అండగా నిలబడ్డామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు జరగేలేదన్నారు. 3648కిలోమీటర్ల పాదయాత్రలో వేసిన ప్రతి అడుగులో ప్రజలు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు 52నెలల కాలంలో పరిష్కారం చూపగలిగినట్టు చెప్పారు.
తమ పార్టీ తప్ప ప్రజలకు ఇచ్చిన మ్యానిఫెస్టోను ఇంతగా నిలబెట్టుకున్న పార్టీ దేశ చరిత్రలో మరొకటి లేదన్నారు. 52నెలల్లోనే వ్యవస్థల్లో, పరిపాలనలో ఇన్ని మార్పులు తీసుకొచ్చిన రాజకీయ పార్టీ దేశచరిత్రలో ఇంకొకటి లేదన్నారు. పేదల గురించి ఆలోచించిన ప్రభుత్వం వైసీపీ మాత్రమేనన్నారు. ఇవన్నీ చేయగలగడానికి తనపై ఉంచిన నమ్మకం కారణమని చెప్పారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకం వల్లే ఇవన్నీ చేయగలిగినట్టు చెప్పారు.
రాబోయే నెలల్లో..
పార్టీ తరున మరో నాలుగు కార్యక్రమాలు ప్రారంభించనున్నట్టు సిఎం చెప్పారు. ఇప్పటికే ప్రారంభిచిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత ఉపయోగం జరగాలన్నారు.
గత నెల 30న ప్రారంభించిన కార్యక్రమం నవంబర్ 10 వరకు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వ్యాధుల బారిన పడకూడదనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించాలనే తపనతో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. గ్రామాల్లో రోగాల స్థాయికి వెళ్లక ముందే, రోగాలు రాకుండా చూస్తే ఆ కుటుంబాలకు మంచి చేసినట్టు అవుతుందన్నారు.
దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. 15,500సచివాలయాల పరిధిలో పట్టణాలు, గ్రామాల్లో 15వేల క్యాంపులు నిర్వహిస్తామన్నారు. కోటి 60లక్షల ఇళ్లను కవర్ చేయనున్నట్టు చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని జల్లెడ పట్టి తోడుగా నిలబడతామన్నారు.
ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటిని మ్యాప్ చేస్తామని, ప్రతి ఒక్కరికి పరీక్షల్ని ఇంటి వద్దే చేస్తారన్నారు. ఇంట్లో ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా వారిని చేయిపట్టి నడిపించి, అన్ని రకాలుగా తోడుగా ఉంటామన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష 1.60కోట్ల మందికి సేవలు అందిస్తామన్నారు.
ప్రతి ఇంటికి వాలంటీర్లు సందర్శించి క్యాంపుల గురించి వివరించి సందర్శన తేదీలను వివరిస్తారని చెప్పారు. శిక్షణ పొందిన ఏఎన్‌ఎంలు ఆరోగ్య పరీక్షలు ఇళ్ల వద్దే నిర్వహిస్తారు. మూడో దశలో ఆరోగ్య పరీక్షలను ఖరారు చేస్తారు. నాలుగో దశలో వైద్యులు పరీక్సించ సంప్రదింపులు, మందులు అందిస్తారు. ఐదో దశలో మెరుగైన చికిత్సను ఖరారు చేస్తారు.
ప్రతి ఇంటికి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వ్యాధులు నయం అయ్యే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఐదవ దశలో కీలకమైన దశ అని, దానిలో ప్రజా ప్రతినిధులు ఎక్కువగా నిమగ్నం కావాలని, ఆరోగ్య సురక్ష క్యాంపులో గుర్తించిన వారికి వ్యాధి నయం అయ్యే వరకు చేయూత అందించాలన్నారు.
వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, ఫ్యామిలీ డాక్టర్లు, స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ప్రజల పట్ల బాధ్యతతో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. ప్రజలకు ఎంత ఎక్కువ చేరువ చేస్తే అంత ఎక్కువగా ఆ ఫలాలు అందుతాయన్నారు. వైద్యం నుంచి మందుల వరకు అన్ని ఉచితంగా ప్రజలకు అందించేలా ప్రజా ప్రతినిధులు తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.
ఏపీకి జగనే ఎందుకు కావాలి?
వై ఏపీ నీడ్స్ జగన్, ఏపీకి జగనే ఎందుకు కావాలి చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజల ఆశీస్సులతో ఇదే ప్రభుత్వం మళ్లీ రావాలని, ప్రజలకు మరింత సేవ చేయడానికి, ప్రభుత్వాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని వివరించే కార్యక్రమం అని చెప్పారు. నవంబర్ 1నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. నవంబర్ 10 నుంచి జగనన్న సురక్ష ముగియనుందన్నారు. ఏపీకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం ద్వారా డిసెంబర్ 10 వరకు 40రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు.
రెండు దశల్లో ఈ కార్యక్రమం జరుగతుందని, గ్రామాల్లో సచివాలయాలను సందర్శించాలని, మండల స్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులు కార్యక్రమాలను ప్రారంభించాలని చెప్పారు. సచివాలయాలను సందర్శించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 60ఇళ్లకు వెళ్లేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి సచివాలయంలో నాలుగు పనులు చేయాలన్నారు. సచివాలయ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలన్నారు.
ప్రతి సచివాలయంలో ప్రభుత్వ పథకాల ద్వారా కోట్లాది మందికి లబ్ది చేకూరుతోందని నాలుగున్నరేళ్లలో పరిపాలన ఎలా అందించారో ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. మొదటి దశలో ప్రతి సచివాలయం పరిధిలో ఏ సంక్షేమాన్ని అందించారో ప్రదర్శించాలని, సచివాలయ పరిధిలో శాశ్వతంగా ఏర్పాటు చేసిన డిస్‌ప్లే ఆవిష్కరించాలన్నారు. స్థానిక పెద్దలను కలిసి సమావేశమై వారి ఆశీస్సులు తీసుకోవాలన్నారు. 52 నెల్లలో గ్రామం నుంచి రాజధానుల వరకు ఎన్ని మార్పులు తీసుకువచ్చిందో చెప్పాలన్నారు.
వాళ్ల మోసాలు వివరించండి….
2014 లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి చేసిన మోసాలను ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. ప్రతి ఇంట్లో చేసిన అభివృద్ధితో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోతో ఎలా మోసాలు చేశారో ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు…
అక్టోబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 31 వ తేదీ వరకు 60రోజులకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సీనియర్ నాయకులంతా కలిసి యాత్ర చేపడతారన్నారు. ఎమ్మెల్యే అధ్యక్షతన మూడు ప్రాంతాల్లో ప్రతి రోజు మూడు మీటింగ్‌లు జరుగుతాయన్నారు.
ఒక్కో రోజు అసెంబ్లీ నియోజక వర్గంలో పర్యటించి ప్రభుత్వం చేసిన మంచి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, మారిన విద్యా, వైద్యం, అభివృద్ధిని వివరిస్తామని చెప్పారు. ప్రతి రోజు సాయంత్రం మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగ సభలు జరుగుతాయని చెప్పారు.
పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ ప్రసంగాలు జరుగుతాయన్నారు. ఎమ్మెల్యే, అసెంబ్లీ కన్వీనర్ అధ్యక్షత వహిస్తారని, 60రోజులు నిరంతరం జరుగుతాయని, వాటిలో అంతా పాల్గొనాలని సూచించారు. సామాజిక న్యాయ యాత్రగా బస్సు యాత్ర జరుగుతుందన్నారు.
పేదల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని వివరించాలన్నారు.ఏపీలో కులాల మధ్య యుద్ధం జరగడం లేదని, పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధంలో పేదలు మొత్తం ఏకం కావాలన్నారు.
ఆడుదాం ఆంధ్రాతో క్రీడాపోటీలు…
బస్సు యాత్ర జరుగుతున్న సమయంలోనే డిసెంబర్ 11 నుంచి ఆడుదాం ఆంధ్రా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. జనవరి 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్థాయిలో నైపుణ్యం ఉన్న వారిని గుర్తించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.