Dadi Veerabhadra Rao : వైసీపీకి బిగ్ షాక్, దాడి వీరభద్రరావు రాజీనామా-త్వరలో జనసేనలోకి!
Dadi Veerabhadra Rao : ఏపీలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.
Dadi Veerabhadra Rao : ఎన్నికల ముందు వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి... వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. మంగళవారం తన ముఖ్య అనుచరులతో సమావేశమైన దాడి వీరభద్రరావు...అనంతరం తన రాజీనామా లేఖను సీఎం జగన్ పంపించారు. తన అనుచరులతో కలిసి వైసీపీని వీడుతున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డికి వీరభద్రరావు రాజీనామా లేఖను పంపించారు. అయితే తన రాజీనామాకు ముందు అనకాపల్లిలో వీరభద్రరావు తన అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని వారితో ఆయన అన్నట్లు సమాచారం. త్వరలోనే రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తానన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెబుతామని దాడి వీరభద్రరావు అన్నారు.
త్వరలోనే జనసేనలోకి!
అనకాపల్లి జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు రత్నాకర్ కు అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే సర్వేల ఆధారంగా టికెట్లు ఇస్తున్న సీఎం జగన్... రత్నాకర్ కు టికెట్ ఇచ్చే పరిస్థితులు లేవని సమాచారం. దీంతో దాడి వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్, ముందుగా వేరే నియోజకవర్గానికి మారాలని భావించారు. దీంతో అనకాపల్లి టికెట్ పై దాడి కుటుంబం ఆశలు పెట్టుకున్నట్లు తెలిసింది. కానీ మంత్రి అమర్నాథ్ స్థానం మారినా తమకు టికెట్ దక్కదని తేలిపోవడంతో వైసీపీని వీడినట్లు సమాచారం. త్వరలోనే ఆయన జనసేనలో చేరనున్నట్లు సమాచారం.
నాలుగు సార్లు ఎమ్మెల్యే
దాడి వీరభద్రరావు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా ఆయన కూడా పనిచేశారు. అయితే 2014 ఎన్నికలకు ముందు వీరభద్రరావు వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల ముందు మళ్లీ వైసీపీలో చేరారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక వీరభద్రరావుకు అధిష్ఠానం ఎలాంటి కీలక బాధ్యతలు అప్పగించలేదు. ఈ క్రమంలో ఇవాళ వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. దాడి వీరభద్రరావు నిర్ణయంపై వైసీపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇన్ ఛార్జుల మార్పులతో వైసీపీ ములసం మొదలైంది. నేతలు ఒక్కొక్కరిగా అసంతృప్తిని బయటపెడుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.