Ankapalli Pharma Blast: అనకాపల్లిలో మరో ఫార్మా కంపెనీలో పేలుడు, పలువురికి గాయాలు, బాధితుల్ని ఆదుకోవాలని సీఎం ఆదేశం
Ankapalli Pharma Blast: అనకాపల్లి అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మాలో ఘోర ప్రమాదం మరువక ముందే మరో ఘటన జరిగింది. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో గురువారం అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో మరో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. బాధితుల్ని అవసరమైతే ఎయిర్ అంబులెన్స్‌లో తరలించాలని సిఎం ఆదేశించారు.
Ankapalli Pharma Blast: అనకాపల్లి జిల్లాలోని పారిశ్రామిక వాడల్లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండ్రోజుల క్రితం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ఘోర ప్రమాదంలో 17మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్ధలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత భారీ పేలుడు జరిగింది.
ఈ ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు నలుగురికి తీవ్ర గాయాలైన నేపథ్యంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ను ఆదేశించారు.
హోంమంత్రిని తక్షణమే ఇండస్ ఆసుపత్రిని సందర్శించి బాధితులతో మాట్లాడి అన్ని విధాలా ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్షతగాత్రులను తరలించేందుకు అవసరమైతే ఎయిర్ అంబులెన్సులు వినియోగించాలని ఆదేశించారు.
అనకాపల్లి జిల్లా ఫార్మా సెజ్ లో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్ధలో జరిగిన ప్రమాదంపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు.
మెరుగైన వైద్యం అందించేందకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోంమంత్రి, ఇతర ఉన్నతాధికారులను వెంటనే బాధితుల వద్దకు వెళ్లాలని ఆదేశించారు. ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా ప్రైవేటు ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురు కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. ఘటన, బాధితులకు అందుతున్న సాయంపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం పంపాలని అధికారులను సిఎం ఆదేశించారు.