America Telugu NRIs Arrest : ఒకే ఇంట్లో 15 మంది యువతులు, బలవంతంగా పనిచేయిస్తున్న ఎన్ఆర్ఐలు- నలుగురి అరెస్టు
America Telugu NRIs Arrest : అమెరికాలో నలుగురు తెలుగు ఎన్ఆర్ఐలు అరెస్టు అయ్యారు. నకిలీ కంపెనీలు సృష్టించి యువతులను అమెరికా తీసుకెళ్లి వారితో బలవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. గిన్స్ బర్గ్ లోని పలు ఇళ్లలో దాదాపు 100 మందికి పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
America Telugu NRIs Arrest : అమెరికాలో మానవ అక్రమ రవాణాకు పాల్పడిన నలుగురు తెలుగు వారిని ప్రిన్స్ టన్ పోలీసులు అరెస్టు చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఆపరేషన్‌లో నలుగురు తెలుగు వారిని అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నకిలీ కంపెనీలు సృష్టించి యువతులను అమెరికా తీసుకెళ్లి వారితో బలవంతంగా పని చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రిన్స్ టన్ ప్రాంతంలోని గిన్స్ బర్గ్ లోని పలు ఇళ్లలో దాదాపు 100 మందికి పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల సోదాల్లో ఒకే ఇంట్లో 15 మందిని గుర్తించారు.
పెస్ట్ కంట్రోల్ ప్రతినిధి సమాచారంతో
పెద్ద ఎత్తున మానవ అక్రమ రవాణా జరుగుతున్నట్లు అనుమానంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. గిన్స్ బర్గ్ లోని ఓ ఇంట్లో దుర్భర పరిస్థితుల్లో ఉన్న యువతులను పోలీసులు గుర్తించారు. వారితో బలవంతంగా పనిచేయిస్తున్నట్లు యువతులు పోలీసులు ఫిర్యాదు చేశారు. గిన్స్‌బర్గ్ లేన్‌లోని నివాసంలో అధికారులు భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారిని రక్షించారు. ఒక పెస్ట్ కంట్రోల్ కంపెనీ ప్రతినిధులు బెడ్ బగ్ సమస్య పరిష్కరించేందుకు ఆ ఇంటికి వెళ్లగా.. అక్కడ సూట్ కేస్‌ల మధ్యలో నేలపై నిద్రపోతున్న అనేక మంది యువతులు గుర్తించారు. దీంతో పెస్ట్ కంట్రోల్ ప్రతినిధులు స్థానిక పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో పోలీసు విచారణ ప్రారంభించారు.
ఒకే ఇంట్లో 15 మంది యువతులు
గిన్స్‌బర్గ్ లేన్‌లోని ఓ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు అందిన సమాచారంతో ఈ ఏడాది మార్చి 13న ప్రిన్స్‌టన్ పోలీసులు సంతోష్ కట్కూరి ఇంట్లో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో మొత్తం 15 మంది యువతులతో సంతోష్ భార్య ద్వారక బలవంతంగా పనిచేయిస్తున్నట్లు గుర్తించారు. బాధిత యువతుల నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, ప్రింటర్లు సహా పలు కీలక పత్రాలను సీజ్ చేశారు. అనంతరం ప్రిన్స్‌టన్, మెలిసా, మెకెన్సీ ప్రాంతాల్లోనూ పోలీసులు బాధితులను గుర్తించారు. అక్రమంగా కంపెనీలు నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో సంతోష్, ద్వారక, చందన్ దాసిరెడ్డి, అనిల్ మాలెను అరెస్ట్ చేశారు.
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు
డల్లాస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారత ఏజెన్సీకి చెందిన ఈ నలుగురు... యువతులను అక్రమ రవాణా చేసి వారితో బలవంతంగా పనిచేయిస్తున్నారు. యువతులు, మరికొంత మంది బాధితులు ప్రోగ్రామర్లుగా పనిచేస్తున్నారని తదుపరి విచారణలో వెల్లడైంది. అధికారులు అనేక ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌లు, ప్రింటర్లు, కీలకమైన పత్రాలను గిన్స్‌బర్గ్ లేన్ లోని నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ప్రిన్స్‌టన్, మెలిస్సా, మెకిన్నేలోని ఇతర ప్రదేశాల నుంచి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులపై మానవ అక్రమ రవాణా కింద కేసు నమోదు చేశారు.
సంబంధిత కథనం