CM Jagan Review On Cyclone : సహాయక చర్యల్లో ఎలాంటి లోటు రాకూడదు, తుపాను దృష్ట్యా అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
CM Jagan Review On Cyclone : మిచౌంగ్ తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అన్ని రకాల సహాయ, పునరావాస చర్యలు తీసుకోవాలని ఆదేశిచారు.
CM Jagan Review On Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. మిచౌంగ్ తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 4వ తేదీన నెల్లూరు, మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని, అది ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు తెలియజేశారు. తుపాను పరిస్థితులు నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు.
సహాయ శిబిరాలు ఏర్పాటు
కరెంటు, రవాణా వ్యవస్థలకు అంతరాయాలు ఏర్పడితే వెంటనే వాటిని పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. తుపాను ప్రభావం అధికంగా ఉన్న తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. రక్షిత తాగునీరు, ఆహారం, పాలు శిబిరాల్లో ఏర్పాటు చేసుకోవాలని, ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీఎం ఆదేశాల మేరకు 8 జిల్లాలకు ముందస్తుగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తిరుపతి జిల్లాకు రూ.2 కోట్లు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లా, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు రూ.1 కోటి చొప్పున నిధులు విడుదల చేశారు.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను దృష్ట్యా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లును ఆదేశించారు. తుపాను ముందు జాగ్రత్త చర్యలపై శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ... భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం సోమవారం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉందని అన్నారు. తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో ఒక మాదిరి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.