CM Jagan : పుట్టే బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు, విలేజ్ స్థాయిలో కంటి పరీక్షలు- సీఎం జగన్ ఆదేశాలు
CM Jagan Review : వైద్య ఆరోగ్య శాఖలో 4 వారాలకు మించి ఎక్కడా ఖాళీలు ఉండకూడదని సీఎం జగన్ ఆదేశించారు. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలన్నారు.
CM Jagan Review : వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదన్నారు. ఫిర్యాదు చేయడానికి టెలిఫోన్ నంబర్ ప్రతిచోటా అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే సమర్థవంతమైన ఎస్‌ఓపీలను పెట్టాలని ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్కుల పనితీరు ఇందులో కీలకమన్నారు. ప్రివెంటివ్ కేర్‌లో మనం ఆశించిన లక్ష్యాలను అప్పుడే సాధించగలమని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. వైద్య ఆరోగ్యశాఖలో రిక్రూట్‌మెంట్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేయాలన్నారు. 4 వారాలకు మించి ఎక్కడా ఏ ఖాళీ కూడా ఉండకూడదన్నారు.
విలేజ్ క్లినిక్ స్థాయిలో కంటి పరీక్షలు
సీఎం ఆదేశాలమేరకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు. ఫస్ట్‌ఎయిడ్, స్నేక్ బైట్, ఐవీ ఇన్‌ఫ్యూజన్, ఇంజక్షన్, వూండ్ కేర్, డ్రస్సింగ్, బేసిక్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ లాంటి అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చామన్నారు. గత ఏడాది అక్టోబరు 22న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకూ 1,39,97,189 మందికి సేవలందించామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా సేవలందుకున్న వారిలో 35,79,569 మంది హైపర్ టెన్షన్‌తో, 24,31,934 డయాబెటిస్‌తో బాధపడతున్నట్టు గుర్తించామన్నారు. వీరికి మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించామన్నారు. పేషెంట్‌కు చికిత్స అందించడంతోపాటు.. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలన్నారు. విలేజ్ క్లినిక్ స్థాయిలో కంటి పరీక్షలు కూడా చేయాలన్నారు.
సికిల్ సెల్ ఎనీమియాపై సీఎం సమీక్ష
ఈ ఏడాది 6.68 లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ నెలలోనే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ఓరల్ హెల్త్‌లో భాగంగా సీఎం ఆదేశాల మేరకు ప్రతినెలా దంత వైద్యులు పీహెచ్‌సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సమయంలో దంతసమస్యల చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టీబీ నివారణపైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయిస్తున్నామన్నారు. అందరికీ పరీక్షలు చేయడం ద్వారా బాధితులను గుర్తించి.. వారికి మంచి చికిత్స అందించే చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వాలన్నారు. క్యూ ఆర్ కోడ్ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్య వివరాలను ఇందులో నమోదు చేయాలన్నారు.
మెడికల్ కాలేజీలపై సమీక్ష
ఈ విద్యాసంవత్సంలోనే ప్రారంభం కానున్న కొత్త మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ సమీక్షించారు. మెడికల్ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించాలన్నారు. పాడేరు, పులివెందుల, ఆదోని కొత్త మెడికల్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయన్నారు. మిగిలిన కాలేజీల్లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు అధికారులు.