AP Aarogyasri Services : ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్- చర్యలుంటాయని ఆసుపత్రులకు ప్రభుత్వం హెచ్చరిక!-amaravati ap aarogyasri services stopped network hospitals due pending bills talks onaway ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Aarogyasri Services : ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్- చర్యలుంటాయని ఆసుపత్రులకు ప్రభుత్వం హెచ్చరిక!

AP Aarogyasri Services : ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్- చర్యలుంటాయని ఆసుపత్రులకు ప్రభుత్వం హెచ్చరిక!

Bandaru Satyaprasad HT Telugu
May 22, 2024 07:49 PM IST

AP Aarogyasri Services : ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో, నెట్ వర్క్ ఆసుపత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ప్రభుత్వం రూ.800 కోట్లు విడుదల చేయాలని నెట్ వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. చర్యలు తీసుకుంటామని ట్రస్ వార్నింగ్ ఇస్తుంది.

ఆరోగ్య శ్రీ సేవలు
ఆరోగ్య శ్రీ సేవలు

AP Aarogyasri Services : ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో నెట్ వర్క్ ఆసుపత్రులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మార్చి 31 వరకు ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తామని నెట్ వర్క్ ఆసుపత్రులు పేర్కొన్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ.203 కోట్ల బిల్లులు చెల్లించేందుకు అంగీకరించింది. అయితే ఈ నిధులు కనీసం ఒక నెల బిల్లు కూడా కాదని, తక్షణమే రూ.800 కోట్ల బకాయిలు చెల్లించాలని కోరాయి. నెట్ వర్క్ ఆసుపత్రులతో ఆరోగ్య శ్రీ సీఈవో రెండు దఫాల్లో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికే 8 నెలలుగా రూ.1500 కోట్ల పెండింగ్ బకాయిలు పెట్టిందని, వీటిల్లో కనీసం రూ.800 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఆరోగ్యశ్రీ సేవల కోసం ఆసుపత్రులను బెదించవద్దని విజ్ఞప్తి చేసింది.

రూ.800 కోట్లు విడుదలకు డిమాండ్

రాష్ట్రంలోని ప్రైవేట్ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నేటి నుంచి బంద్‌ అయ్యాయి. దీంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించే వరకు వైద్య సేవలు అందించమని నెట్ వర్క్ ఆసుపత్రులు స్పష్టం చేశాయి. ప్రభుత్వం రూ. 1500 కోట్లకు పైగా ఆరోగ్య శ్రీ నిధులు పెండింగ్‌లో పెట్టిందని, ఆ బిల్లులు చెల్లించే వరకు కొత్త కేసులు చేర్చుకోమని తెలిపాయి. ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవో ఇప్పటి వరకూ రెండు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఆసక్తిగా మారింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో కొత్తగా వైద్య సేవలకు కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త కేసులు చేర్చుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రూ.203 కోట్లు చెల్లింపులు

నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు పెండింగ్ బిల్లులు రూ.203 కోట్లు చెల్లింపులు చేపట్టినట్లు ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మిషా తెలిపారు. మిగితా బిల్లుల చెల్లింపులు వీలైనంత త్వరలో చేపడతామన్నారు. అయితే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సహకరించాలని ప్రైవేట్ ఆసుపత్రులను విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య శ్రీ పథకం కింద పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పెండింగ్‌ బిల్లులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ , స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌(ఆశా) మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల చర్చలు విఫలం అయ్యాయి. ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలుస్తుందా? లేదా చర్యలు తీసుకుంటుందా? వేచి చూడాలి. అయితే ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు అంతరాయం కలిస్తే ఆసుపత్రుపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ హెచ్చరించింది. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశించింది. ఈ ఏడాదిలో ఇప్పటికే రూ.366 కోట్లు విడుదల చేశామని, మరో 203 కోట్ల రూపాయలు చెల్లింపులు చేస్తున్నామని ఆరోగ్య శ్రీ ట్రస్టు ప్రకటించింది. మిగిలిన చెల్లింపులు త్వరలో చేపడతామని, వైద్య సేవలకు అంతరాయం కలిగించవద్దని పేర్కొంది.

Whats_app_banner

సంబంధిత కథనం