Operation Kuppam: మూడు నెలల తర్వాత పార్టీ ఆఫీసుకు చంద్రబాబు, కుప్పంపై సమీక్ష
Operation Kuppam: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మూడు నెలల తర్వాత తొలిసారి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన తర్వాత జైలు, ఇంటికే పరిమితమైన బాబు పార్టీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు.
Operation Kuppam: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మళ్లీ పార్టీ కార్యకలాపాలను యాక్టివేట్ చేస్తున్నారు. మూడు నెలలుగా దాదాపుగా స్తంభించిపోయిన పార్టీ కార్యకలాపాలను తిరిగి పునరుద్దరించేందుకు రెడీ అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన తర్వాత పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేశారు. అయితే చంద్రబాబు లేకపోవడంతో పూర్తి స్థాయిలో చేపట్టలేక పార్టీ క్యాడర్‌లో స్తబ్దత ఆవహించింది. చంద్రబాబు లేని లోటు స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు లేకపోతే పార్టీని నడిపంచే నాయకుడు కరువైన సంగతి స్పష్టంగా బయటపడింది.
తొలిసారి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబును కుప్పం టీడీపీ నేతలు పరామర్శించారు. కుప్పం నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తానన్న చంద్రబాబు, త్వరలోనే కుప్పం నియోజకవర్గానికి వస్తానని ప్రకటించారు. తనను దెబ్బకొట్టేందుకే కుప్పంలో టీడీపీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టారని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదలనని కార్యకర్తలకు ధైర్యం చెబుతూ భరోసా కల్పించారు.
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా అశాంతి, హింస, రాజకీయ వేధింపులు తలెత్తాయని చంద్రబాబు నాయుడు అన్నారు. తనను ఇబ్బంది పెట్టేందుకు, తెలుగు దేశం పార్టీ నేతలను భయపెట్టేందుకు ప్రజలు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టారని...అరెస్టులు చేసి జైలుకు పంపారని, ఎన్ని సవాళ్లు ఎదురైనా అదరక బెదరక పార్టీ నేతలు, కార్యకర్తలు నిలబడ్డారని...వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని అన్నారు.
ప్రశాంతమైన కుప్పంలో వికృత రాజకీయాలతో ప్రజలను కూడా ఇబ్బందులు పెట్టారని చంద్రబాబు అన్నారు. తన పర్యటనకు వచ్చిన కార్యకర్తలు, ప్రజలపైనా కేసులు పెట్టి వేధించారని... 35 ఏళ్లుగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా....ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని చంద్రబాబు అన్నారు. తన అక్రమ అరెస్టు సమయంలో మద్దతుగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
కుప్పం నియోజవకర్గం నుంచి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు కొద్ది సేపు ముచ్చటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన కార్యక్రమాలకు దిగినవారిపైనా తప్పుడు కేసులు పెట్టారని ఈ సందర్భంగా నాయకులు చెప్పారు. అధినేత కోసం ఎన్ని కేసులు, ఇబ్బందులు అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు.
saraనియోజకవర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ, ఓటర్ వెరిఫికేషన్ వంటి పార్టీ కార్యక్రమాల నిర్వహణ అంశాలను నేతలు చంద్రబాబు నాయుడుకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలిపించుకుంటామని కుప్పం నేతలు చంద్రబాబుకు తెలిపారు.