TDP BJP Janasena Alliance: పొత్తు పొడిచినట్టే.. సీట్ల సర్దుబాటే మిగిలింది... సర్దుకు పోదామంటున్నబాబు-after five years telugu desam party is joining the nda alliance again ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp Bjp Janasena Alliance: పొత్తు పొడిచినట్టే.. సీట్ల సర్దుబాటే మిగిలింది... సర్దుకు పోదామంటున్నబాబు

TDP BJP Janasena Alliance: పొత్తు పొడిచినట్టే.. సీట్ల సర్దుబాటే మిగిలింది... సర్దుకు పోదామంటున్నబాబు

Sarath chandra.B HT Telugu
Feb 09, 2024 07:04 AM IST

TDP BJP Janasena Alliance: పార్టీ భవిష్యత్తుతో పాటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏపీలో సొంతంగా ఎదగాలని భావించిన బీజేపీ కూడా మనసు మార్చుకుంటోంది. టీడీపీతో జట్టు కట్టేందుకు సిద్ధమవుతోంది.

<p>ప్రధాని మోదీతో చంద్రబాబు… చిగురించిన పొత్తు</p> (ఫైల్)
ప్రధాని మోదీతో చంద్రబాబు… చిగురించిన పొత్తు (ఫైల్)

TDP BJP Janasena Alliance: ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు నెలకొన్న సందిగ్ధత మెల్లగా వీడిపోతోంది. బీజేపీతో సయోధ్య కోసం టీడీపీ కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన,టీడీపీ కూటమిలోకి బీజేపీకి కూడా రానుంది. పార్టీల మధ్య సీట్ల సర్దుబాటే మిగిలి ఉంది. రాజకీయపార్టీల మధ్య పొత్తుల బంధం వికసిస్తోంది.

yearly horoscope entry point

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ-జనసేన కనీసం 7 నుంచి 9 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. గణనీయమైన స్థాయిలో ఎమ్మెల్యే సీట్లను కూడా బీజేపీ కోరుతోంది. 2018లో ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన టీడీపీ తిరిగి కూటమిలో చేరేందుకు రెడీ అయ్యింది. ఆ పార్టీతో పొత్తుతో లాభనష్టాలపై బేరీజు వేసుకుని అడుగులు వేస్తోంది.

ఇరు పార్టీలకు లాభమనే…

ఏపీలో ప్రస్తుతం బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 2014లో ఆ పార్టీకి పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉండేది. టీడీపీ తెగదెంపులు చేసుకున్న తర్వాత రెండు పార్టీలు ఘోరంగా నష్టపోయాయి. ఏపీలో బీజేపీ రాజకీయంగా ఎదగలేక పోవడానికి టీడీపీనే కారణమని అప్పట్లో బీజేపీ భావించింది.

దీంతో కాపు సామాజిక వర్గం ద్వారా సొంతంగా ఎదగడానికి గత ఐదేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలను కూడా అప్పగించింది. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష స్థానంలోకి రావడానికి చేసిన ఏ ప్రయత్నం నెరవేరలేదు.

2024 ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసిన ఫలితం సాధించలేని పరిస్థితి బీజేపీకి ఉంది. మరోవైపు వైసీపీతో లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయనే విమర్శల్ని బీజేపీ ‎ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సొంతంగా పార్టీని ఎన్నికలకు తీసుకెళ్లినా ఫలితం ఎలా ఉంటుందో స్పష్టం కావడంతోనే ఆ పార్టీ పొత్తులకు సుముఖత తెలిపినట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా పార్టీని పొత్తుల విషయంలో ఒప్పించగలిగినట్టు చెబుతున్నారు.

బీజేపీతో స్నేహమే శ్రేయస్కరమని బాబు భావన...

దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇండియా కూటమితో జట్టు కట్టడం కంటే బీజేపీకి దగ్గర కావడమే మేలని చంద్రబాబు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా బీజేపీతో సయోధ్య కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. అయితే 2018లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వా త చంద్రబాబు పెద్ద ఎత్తున బీజేపీ పెద్దల్ని విమర్శించడం సయోధ్యకు అవంతరంగా మారింది.

ఈ నేపథ్యంలో బీజేపీలో ఉన్న చంద్రబాబు సన్నిహితులతో పాటు ఇతర మార్గాల్లో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. బీజేపీ మిత్ర పక్షమైన జనసేన కూడా తన వంతు పాత్ర పోషించింది. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే లక్ష్యాన్ని వివరించడంలో పవన్ విజయం సాధించారు. ఏపీ బీజేపీ, జనసేన నాయకుల ఒత్తిడి కూడా టీడీపీతో పొత్తు విషయంలో ప్రభావం చూపించాయి.

చేరడమే మేలని భావిస్తున్న బాబు...

విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్డీయేలో చేరాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆహ్వానించినట్టు చంద్రబాబు పార్టీ ముఖ్యులకు వివరించారు.టీడీపీకి ఉన్న పరిమితులు,ఇతర సమస్యలపై అమిత్‌షాతో చర్చించినట్టు వారికి తెలిపారు.

బీజేపీ ఉద్దేశాలు, అభిప్రాయాలను అమిత్‌షా తనకు వివరించారని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏలో చేరాల్సి రావొచ్చనే అభిప్రాయాన్ని టీడీపీ నేతలకు చంద్రబాబు వివరించారు. అమిత్ షా ఆహ్వానం మేరకు ఎన్డీయేలో చేరడానికి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారనే అభిప్రాయం బాబు మాటల్లో వ్యక్తమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్రంలో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయని, కారణాలు ఏమైనా బీజేపీ ఆహ్వానాన్ని అందుకుని ఎన్డీయేలో చేరితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని, టీడీపీకి అనివార్యమైన రాజకీయ పరిస్థితి నెలకొందని చంద్రబాబు పార్టీ నేతలతో చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీకి రాజకీయంగా ఉన్న ఇబ్బందులు, ఇతర సమస్యల గురించి అమిత్‌ షాతో చర్చించినట్టు పార్టీ నేతలకు చంద్రబాబు వివరించారు.

‘ఏపీలో మైనారిటీ వర్గాలు గతంలో వైసీపీకి మద్దతు ఇచ్చేవని, ఐదేళ్లలో జగన్‌ పాలన చూసిన తర్వాత ఆ వర్గాలు ఇప్పుడు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని, టీడీపీ ఎన్నికల సమయంలో ఎన్డీయేలో చేరితే వారు మళ్లీ వైసీపీ వైపు వెళ్తారనే అనుమానాలు కూడా బాబు వ్యక్తం చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో సామాజిక సమీకరణలు, ఓటు బ్యాంకులపై విస్తృత చర్చ జరిగిందని, మైనారిటీ వర్గాలను కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయని, సరైన పద్ధతిలో వారికి మన ఆలోచనలను వివరిస్తే దరి చేర్చుకోవచ్చని అమిత్‌ షా అభిప్రాయపడ్డారని బాబు తమ పార్టీ నేతలకు చెప్పారు.

టీడీపీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించారని, పార్టీ నేతలతో మాట్లాడి తుది నిర్ణయం చెబుతానని చెప్పినట్టు చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలకు వివరించారు. దీంతో ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ చేరిక లాంఛనమేనని చెబుతున్నారు. గతంలో జరిగిన వాటిని వదిలేసి కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాలనే ఉద్దేశం అమిత్‌ షా వ్యక్తం చేసినట్టు చంద్రబాబు పార్టీ నేతలకు వివరించారు. టీడీపీ ముఖ్య నాయకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్థిని బరిలో దింపే ప్రతిపాదన కూడా ఉన్నట్టు చెబుతున్నారు.

Whats_app_banner