ADG Issue : ఏసీబీ కేసులు కొట్టేయాలని కోర్టును ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్ మాజీ నిఘా విభాగాధిపతి ఏబీ వెంకటేశ్వరరావు మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పోస్టింగ్ ఇచ్చినట్లే ఇచ్చి ఏపీ ప్రభుత్వం మరోమారు సీనియర్ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో, తనపై ఏసీబీ నమోదు చేసిన కేసుల్ని కొట్టేయాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు.
తనపై ఏసీబీ నమోదు చేసిన కేసుల్ని కొట్టేయాలంటూ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. నిఘా విభాగాధిపతిగా పని చేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో 2021 మార్చిలో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
పరికరాల కొనుగోలు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదని, ఒక్క పైసా కూడా ఎవరికి చెల్లించ లేదని ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏపీ విజిలెన్స్ కమిషన్ ఆమోదం పొందకుండానే సాధారణ విచారణ జరిపి తనపై కేసు పెట్టారన్నారు.
తప్పుడు ఆరోపణలతో నమోదు చేసిన ఈ కేసును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యంలో తుది నిర్ణయం వెల్లడించే వరకు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా చేపట్టే చర్యలను నిలువరించాలని కోరారు. నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోలు నిర్ణయంలో తన పాత్ర లేదని పిటిషన్లో పేర్కొన్నారు. తన వల్ల ఎలాంటి ఆర్థిక నష్టం రాష్ట్రానికి జరగలేదన్నారు.
కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ బాధ్యతలు అప్పగించింది. విధుల్లో చేరిన రెండువారాల్లోనే మళ్లీ ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తనపై కక్ష సాధింపుకు పాల్పడుతోందని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. 18అవినీతి కేసులున్న ముఖ‌్యమంత్రికి లేని అభ్యంతరం ఏ తప్ప చేయకపోయినా తానెందుకు సస్పెన్షన్ అనుభవించాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిఘా పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందని ఆరోపిస్తోంది. ఆయనపై దాఖలైన పాతకేసుల ఆధారంగానే మరోమారు సస్పెన్షన్ విధించింది.ప్రభుత్వ నిర్ణయంపై ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ హైకోర్టులో సవాలు చేశారు.
టాపిక్