Constable Murder: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..విశాఖలో దారుణం
Constable Murder: విశాఖపట్నంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను భార్య హతమార్చింది. నిద్రిస్తున్న భర్తకు ఊపిరి ఆడకుండా చేసి చంపేసి గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రించేందుకు ప్రయత్నించింది.
Constable Murder: భర్తతో ఉన్న విభేదాల నేపథ్యంలో ప్రియుడు, అతని స్నేహితుడు సహయంతో భర్తను అంతం చేసిన భార్య వ్యవహారం విశాఖపట్నంలో సంచలనం సృష్టించింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేష్‌ను పక్కా ప్రణాళికతో హతమార్చిన వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.
నిద్రిస్తున్న భర్తను ఇంట్లోనే పథకం ప్రకారం దిండుతో ఊపిరి ఆడకుండా చేసి గుండెనొప్పి గా చిత్రకరించారు. అంత్యక్రియల సమయంలో స్థానికుల అనుమానం వ్యక్తం చేయడంతో భార్య శివ జ్యోతి అలియాస్ శివానిని పోలీసులు నిలదీయడంతో దొరికిపోయింది.
ట్యాక్సీ డ్రైవర్‌తో వివాహితర సంబంధం నేపథ్యంలో భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడి సహాయంతోనే హత్య కు పక్కాగా ప్లాన్ చేసింది. భర్తను చంపేసి గుట్టుచప్పుడు కాకుండా అంతక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఆరోగ్యంగా ఉన్న కానిస్టేబుల్ హత్యకు గురికావడంతో అనుమానించిన విశాఖ ఎంవీపీ పోలీసులు విచారణ జరిపారు. విచారణలో అక్రమ సంబంధం వ్యవహారం వెలుగు చూడటంతో భార్యను తమదైన శైలిలో విచారించగా హత్యకు పాల్పడినట్టు ఒప్పుకుంది.
విశాఖలో బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విశాఖ వన్‌టౌన్ కానిస్టేబుల్ కేసును హత్యగా పోలీసులు చివరకు హత్యగా నిర్ధారించారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. మరో వ్యక్తి సాయంతో ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు గుర్తించారు.
కానిస్టేబుల్‌ను చంపడానికి ముందు మద్యం తాగించారా? లేక విషమిచ్చి ఆ తర్వాత హత్య చేశారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలొస్తే కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. విశాఖ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో అసిస్టెంట్ రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న బర్రి రమేష్‌కుమార్ (40) నగరంలోని ఎంవీపీ కాలనీలో భార్య శివజ్యోతి, ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉంటున్నారు.
ఈనెల 1వ తేదీ విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన రమేష్ తెల్లవారేసరికి గుండెపోటుతో మృతి చెందారంటూ భార్య శివాని ఎంవీపీ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ మల్లేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా, భార్య ప్రవర్తన సందేహాస్పదంగా కనిపించడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రమేష్ నివాసం ఉంటున్న ఇంటి ముందే రామారావు అనే ట్యాక్సీ డ్రైవర్ కారు పార్కింగ్ చేస్తుంటాడు. ఈ సమయంలో డ్రైవర్ రామారావుకు కానిస్టేబుల్ భార్య శివజ్యోతికి సాన్నిహిత్యం ఏర్పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య నడుస్తున్న సంబంధాన్ని రమేష్ ప్రశ్నించడంతో గొడవలు జరుగుతుండేవి.
గతంలో ఓసారి భర్తతో గొడవపడి ప్రియుడు రామారావుతో కలిసి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే బంధువులు శివజ్యోతిని సర్దిచెప్పి కాపురం చేసుకునేలా చేశారు. ఇటీవల ఇంటి యజమాని సైతం వీరి వ్యవహారం, గొడవలు చూసి ఇల్లు ఖాళీ చేయాలని చెప్పారు. ఈ గొడవల నేపథ్యంలో శివజ్యోతి, రామారావు కలిసి పథకం ప్రకారం రమేష్‌ను హత్య చేసినట్లు భావిస్తున్నారు. రమేష్‌కు తొలుత మద్యం తాగించి, ఆ తర్వాత నిద్రపోతున్న సమయంలో దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రమేష్‌కు ఎలాంటి చెడు అలవాట్లు లేవని బంధువులు చెబుతున్నారు. భోజనంలో ఏదైనా విషప్రయోగం చేసి ఆ తర్వాత ప్రాణాలు తీసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల వారితోపాటు, శివజ్యోతి, రామారావులను సైతం పోలీసులు విచారణ చేశారు. హత్యకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టారు.పోలీసు ఉన్నతాధికారులు రమేష్ మృతదేహానికి నివాళులర్పించారు.