చిత్తూరులో ఘోరం - ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం!
Chittoor district Crime News:చిత్తూరు జిల్లాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. పదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. నిందితుడిపై పోక్సోతో అట్రాసిటీ చట్టం కేసులు నమోదు చేశారు.
పదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలంలోని ఓ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పేదరికంలో ఉన్న వీరు ప్రతి రోజు కూలీ పనులకు వెళ్లాల్సిందే. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో ఒకరు అబ్బాయి, మరొకరు పదేళ్ల కుమార్తె ఉన్నారు. రోజులానే శనివారం భార్య కూలీ పని వెళ్లింది. భర్త సమీపంలో ఉన్న అడవికి కట్టెల కోసం వెళ్లాడు.
తల్లిదండ్రులు పనుల నిమిత్తం వెళ్లిపోవడంతో చిన్నారి ఆ గ్రామ సచివాలయం వద్ద ఆడుకోవడానికి వెళ్లింది. అక్కడ ఆ చిన్నారి ఆడుకుంటుండగా… అదే గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ రెడ్డి హుస్సేన్ (28) అక్కడి వచ్చాడు. ఆ చిన్నారికి మాయ మాటలు చెప్పి, అక్కడికి సమీపంలో ఉన్న తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై హుస్సేన్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ చిన్నారి ఎంత ఏడ్చినా… వద్దు వద్దు అని ప్రాధేయపడినా ఆ మానవ మృగం ఆమెపై దాడికి దిగాడు. ఆ చిన్నారి తప్పించుకునేందు ప్రయత్నించినా, గట్టిగా పట్టుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసిన తరువాత ఆ చిన్నారిని అక్కడే వదిలేసి కామాంధుడు రెడ్డి హుస్సేన్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ చిన్నారి అక్కడే ఏడ్చుకుంటూ ఉంది. కట్టెల కోసం అడవికి వెళ్లిన తండ్రి ఇంటికి వచ్చాడు. అయితే తండ్రికి కుమార్తె ఇంటి వద్ద కనిపించలేదు.
దీంతో తన కుమార్తె ఎక్కడుంది? ఇంకా ఇంటికి రాలేదు? అంటూ పరిసర ప్రాంతాల్లో వెతికారు. సమీపంలో ఉన్న తోట వైపు చూడగా, కుమార్తె అటుగా ఏడ్చుకుంటూ వస్తుంది. తండ్రి వద్దకు వచ్చిన కుమార్తెను ఏం జరిగిందని తండ్రి ఆరా తీశాడు. ఆమెను సముదాయించి, ఏం జరిగిందని అడిగాడు. దీంతో జరిగిన విషయాన్ని తండ్రికి ఆ చిన్నారి వివరించింది. దీంతో చిన్నారితో పాటు తండ్రి కల్లూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలోని పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తును ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని పట్టుకున్న తరువాత చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి తెలిపారు.