US Streeet Name: ప్రవాసాంధ్రుడి పేరుతో అమెరికాలో వీధి పేరు
US Streeet Name: అమెరికాలో ఓ వీధికి ప్రవాసాంధ్రుడైన వైద్యుడి పేరు పెట్టడం ద్వారా ఆయన చేసిన సేవలకు స్థానిక అధికారులు వీధిపేరు పెట్టి గౌరవించారు.
US Streeet Name: ప్రవాసాంధ్ర వైద్యుడికి అమెరికాలో అరుదైన గుర్తింపు లభించింది. దాదాపు 55ఏళ్ల క్రితమే అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిన ప్రవాసాంధ్ర వైద్యుడు బావికాటి జయరాం నాయుడు పేరును ఓ వీధికి పెట్టారు.
వైద్య వృత్తిలో డాక్టర్ జయరాం నాయుడు చేసిన సేవలను గుర్తించిన స్థానిక ప్రభుత్వం ఓ వీధికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించింది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెద్దకొట్టాలపల్లికి చెందిన జయరాం ప్రస్తుతం టెక్సాస్‌లో నివసిస్తున్నారు.
వైద్యవిద్యను పూర్తి చేసిన తర్వాత 1968లో అమెరికాకు వెళ్లి అక్కడే హృద్రోగ వైద్య నిపుణుడిగా గుర్తింపు పొందారు. గుండె సంబంధిత వైద్య చికిత్సల కోసం 300 పడకల ఆసుపత్రి నిర్మించారు. ఆయన సేవలను గుర్తించిన అక్కడి ప్రభుత్వం టెక్సాస్ మెడికల్ బోర్డు సభ్యుడిగా నియమించింది.
జన్మభూమిపై మమకారంతో తల్లిదండ్రుల పేరుమీద బావికాటి రంగప్ప, లక్ష్మమ్మ మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేసి సొంత ఊరిలో కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సోదరుడు రాజశేఖర్ నాయుడు కూడా అమెరికాలో స్థిరపడి పారిశ్రామికవేత్తగా మారారు.
పెద్ద కొట్టాలపల్లిలో వైద్యసేవలు అందించేందుకు 1997లో రూ.20 లక్షలతో ఆస్పత్రిని నిర్మించారు. కొత్త పరికరాలు ఏర్పాటు చేయడంతోపాటు వైద్య సిబ్బంది కోసం ప్రత్యేక గదులు కూడా నిర్మించారు. శుభకార్యాలు నిర్వహించేందుకు కల్యాణ మండపాన్ని నిర్మించారు. నీటి శుద్ధి కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.
2015లో హైస్కూల్‌లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఏటా రూ.30 వేలు నగదు పురస్కారాలు అందజేస్తున్నారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. జయరాం నాయుడు పేరుతో టెక్సాస్‌లో వీధి పేరు ఏర్పాటు చేయడంపై పెద్ద కొట్టాలపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.