CNN In Delhi: స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం.. నిధులు, ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం భరోసా
CNN In Delhi: విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని, రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరినట్టు చెప్పారు.
CNN In Delhi: విశాఖ రైల్వే జోన్ కు గత ప్రభుత్వం భూమి ఇవ్వకుండా కాలయాపన చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. విశాఖ ఉక్కుపై కుమారస్వామితో చర్చించినట్టు వివరించారు. ప్రత్యామ్నాయ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని, రూ. 15 వందల కోట్లు ఇప్పటిదాకా నిధులు కేటాయించారని ఇబ్బందులను అధిగమించుకుని ముందుకు వెళ్లాలని చూస్తున్నట్టు తెలిపారు.
విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని, కొంత యాజమాన్య నిర్ణాయాల కారణంగా విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో పడిందన్నారు. సెయిల్ లో విలీనం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. తాత్కాలిక నిధులతో సమస్య పరిష్కారం కాదని, ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశం కావడంతో ప్రైవేటైజేషన్ కాకుండా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.
డిసెంబర్లో శంకుస్థాపన..
కూటమి ప్రభుత్వం రాగానే రైల్వే జోన్ కు భూమిని కేటాయించినట్టు చంద్రబాబు వివరించారు. డిసెంబర్ లో విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తామన్నారు. విశాఖ రైల్వే జోన్ లోనే వాల్తేరు రైల్వే డివిజన్ ఉంటుందని ప్రకటించారు. జఠిలమైన సమస్యను పరిష్కరించామని చెప్పారు.
హౌరా నుండి చెన్నై నేషనల్ హైవే రెండు లేన్లను 4 లేన్లగా మార్చుతున్నారని దీంతో గూడ్స్, రైళ్ల రాకపోకలు పెరుగుతాయన్నారు. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ప్రతి పట్టణం అనుసంధానం అవుతుందని చెప్పారు. తద్వారా ఏకకాలంలో ఎకనమిక్, పోర్టు డెవలెప్మెంట్ తో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
అమరావతి లైన్‌కు అమోదం…
విజయవాడ నుంచి అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం అంగీకరించిందని, మచిలీపట్నం నుంచి రేపల్లె రైల్వే లైనుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని చంద్రబాబు తెలిపారు. బుల్లెట్ ట్రైన్ ద్వారా అమరావతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పట్టణాల అనుసంధానం చేయాలి కోరినట్టు వివరించారు. దేశం లోని కీలకమైన ఎకనమిక్ హబ్ ల గుండా బులెట్ ట్రైన్ ప్రయాణం జరుగుతుందని, బులెట్ ట్రైన్ అనుసంధానంతో పెరగనున్న ఎకానమీ ఆక్టివిటీస్ పెరుగుతాయన్నారు.
2026 నుండి బులెట్ ట్రైన్ పనులు ప్రారంభం అవుతాయని భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ రైల్వే స్టేషన్ ను ఆధునీకరణ పూర్తి చేయాలని కోరినట్టు వివరించారు. నడికుడి టూ శ్రీకాళహస్తి, కోటపల్లి టూ నర్సాపూర్, కడప టూ బెంగళూరు లైన్ల కోసం మ్యాచింగ్ గ్రాంట్ అడుగుతున్నారని, ఇప్పటికే రూ.75 వేల కోట్ల రైల్వే పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు.
రైల్వే లైన్ల గురించి, అండర్ పాస్ లు, స్టేషన్ల ఆధునీకరణ గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదని కనీసం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయన్నారు.
ఏపీలో NIEIT
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఏపీలో పెట్టేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని, దీంతో సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీకి డిమాండ్ పెరుగుతుందని, దీనిపై వర్కవుట్ చేయాలి. లాభనష్టాలు బేరీజు వేసుకుని ముందుకెళ్తామన్నారు. ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీకి ఏపీని కేరాఫ్ అడ్రెస్ గా నిలిపి, తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన లభిస్తుందన్నారు.
డేటా సెంటర్‌కు భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుందని ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పలు ప్రతిపాదనలు పంపామన్నారు. ఏపీలో దీనికి సంబంధించిన వ్యవస్థను రూపొందిస్తామన్నారు. ఏఐని సమగ్రంగా వినియోగించి సత్వర పాలనలో సత్వర ఫలితాలు సాధిస్తామన్నారు. ఏపీలో ఈనెల 22, 23 తేదీల్లో డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తామని చెప్పారు.
త్వరలో విజయవాడ ఈస్ట్ బైపాస్…
విజయవాడ పశ్చిమ బైపాస్ పూర్తవ్వగానే తూర్పు బైపాస్ ప్రారంభం అవుతుందని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని స్టేట్ హైవేలు పూర్తి చేయాలని గడ్కరీని కోరినట్టు తెలిపారు. రహదారులకు సంబంధించి ఇప్పటికే రూ.50 వేల కోట్ల విలువైన పనులు నడుస్తున్నాయని, రెండేళ్లలో యుద్ధ ప్రాతిపదికన హైవేలు పూర్తి చేయాలని కోరామన్నారు.
విజయవాడ నుండి హైదరాబాద్ కు ఎక్స్ ప్రెస్ హైవే ఏర్పాటును కేంద్రం ముందుకు తీసుకెళ్లామని, అమరావతి 183 కి.మీ ఔటర్ రింగ్ రోడ్ పైనా కేంద్రం తో చర్చించినట్టు వివరించారు. గత ప్రభుత్వం అనంతపురం, అమరావతి హైవేను అమరావతి కడపకు మార్చిందని చెప్పారు.
కుప్పం-హోసూరు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ రోడ్, మూలపేట నుండి వైజాగ్ గ్రీన్ ఫీల్డ్ రహదారి ఏర్పాటుతో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు, విశాఖ బీచ్ కు ఈ రోడ్ ను అనుసంధానం చేస్తామన్నారు. 2025 డిసెంబర్ నాటికి భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరినట్టు వివరించారు.