APSRTC New Buses: ఏపీస్ఆ‌ర్టీసీలో 1400కొత్త బస్సులు,ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ జర్నీ ప్రారంభం-1400 new buses in apsrtc free journey for women from august 15 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsrtc New Buses: ఏపీస్ఆ‌ర్టీసీలో 1400కొత్త బస్సులు,ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ జర్నీ ప్రారంభం

APSRTC New Buses: ఏపీస్ఆ‌ర్టీసీలో 1400కొత్త బస్సులు,ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ జర్నీ ప్రారంభం

Sarath chandra.B HT Telugu
Aug 09, 2024 01:48 PM IST

APSRTC New Buses: ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ప్రారంభించేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. ఆర్టీసీ భవన్‌లో ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఏపీలో కూడా మహళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఏపీలో కూడా మహళలకు ఉచిత బస్సు ప్రయాణం

APSRTC New Buses: ఏపీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగుల సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉద్యోగులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా 1400 ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తున్నామని, ప్రయాణీకులకు భద్రత, సుఖప్రయాణం ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. ఆగస్ట్‌ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం ప్రారంభించనున్న నేపథ్యంలో విజయవాడలో ఆర్టీసీ బస్‌ భవన్‌లో అధికారులు, కార్మిక సంఘాలతో సమీక్ష నిర్వహించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత నిలిచిపోయిన కారుణ్య నియామకాలపై అధికారులతో చర్చించినట్టు చెప్పారు. ఏపీఎస్‌ ఆర్టీసీ చిన్న గ్రామాల నుంచి పట్టణాల వరకు అన్ని వర్గాల ప్రజలతో అనుసంధానమై ఉందని, సంస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు మంత్రివ రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. కార్మికులకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పారు.

ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో బోర్డర్ చెక్‌ పోస్ట్‌లను మూసేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని, గతంలో కేంద్రం ఆదేశాలతో బోర్డర్ చెక్‌ పోస్టులు మూసేశామని, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏర్పాటు చేసి అక్రమ రవాణాపై నిఘా ఉంచుతామని చెప్పారు. గత ఐదేళ్లలో ఖనిజాలు, రేషన్ బియ్యం, జంతువులు అక్రమంగా రవాణా చేశారని ఇకపై అటువంటివి జరగడానికి వీల్లేదని రవాణా శాఖ సిబ్బందికి స్పష్టం చేశారు.

గతంలో జరిగిన అక్రమాలు ఇకపై జరగడానికి వీల్లేదని సూచించారు. తప్పులు సరిదిద్దుకుని ముందుకు సాగాలన్నారు. గత ప్రభుత్వంలో ఆరేడు నెలలుగా ఆర్‌సి కార్డులు కూడా జారీ చేయలేదని, హైసెక్యూరిటీ కార్డుల్ని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. రాబోయే రోజుల్లో నాణ్యమైన సేవలు అందిస్తామన్నారు.

19-24 మధ్య ఆర్టీసీ నిర్వీర్యమైపోయిందని, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తామన్నారు. అమరావతి బ్రాండ్ ఏసీ బస్సుల్ని కొనసాగిస్తామని మంత్రి ప్రకటించారు. అమరావతి బ్రాండ్‌తో బస్సుల్ని కొనసాగిస్తామని చెప్పారు. ఆర్టీసీ ప్రాంగణాల్లో శుభ్రతపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి సూచించారు.

అధికారులపై తాము జులుం ప్రదర్శించమని, కార్మికుల సమస్యలు పట్టించుకోని అధికారుల్ని మార్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఆర్టీసీ కి 1400 కొత్త బస్సులు కొనుగోలుచేశామని తెలిపారు.

విజయవాడ జోన్ 2 కు సంబందించిన 26 స్టార్ లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులను ప్రారంభించారు. ప్రభుత్వానికి ప్రయాణీకులు కార్మికులు రెండు కళ్ళు లాంటి వారని, కార్మికుల, ప్రయాణీకుల క్షేమం తమకు ముఖ్యమన్నారు. గత ప్రభుత్వం గత ఐదేళ్ళలో ఆర్టీసీకి ఒక్క బస్సు ను కూడా కొనుగోలు చేయలేదన్నారు. ప్రయాణీకుల భద్రతకు, సుఖవంతమైన ప్రయాణానికి ప్రాధాన్యత ఇచ్చి కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు.

సిబ్బంది కూడా ప్రయాణీకులు అధికంగా ప్రయాణించి ఆక్యుపెన్సీ రేషియో పెరిగేలా పనిచేయాలన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తోందని, ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో 65 లక్షల మంది పేదలకు పెన్షన్లను ఒకటవతేదీనే వారి ఇంటివద్దకు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా 16 వేలకు పైగా పోస్టులతో డీఎస్సీ ప్రకటించడం జరిగిందన్నారు. ఈనెల 15వ తేదీ నుండి రాష్ట్రంలో మొదటిదశలో అన్నా క్యాంటిన్లు ప్రారంబిస్తున్నామన్నారు.

గత ప్రభుత్వం అభివృద్ధిని అస్సలు పట్టించుకోలేదన్నారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించదగిన వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామన్నారు.