Mahindra Scorpio-N: మహీంద్రా స్కార్పియో-ఎన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ
30 June 2022, 11:38 IST
మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి 2022లో కొత్త స్కార్పియో-ఎన్ మోడల్ మార్కెట్‌లోకి వచ్చింది. మహీంద్రా స్కార్పియోకు మార్కెట్‌లో ప్రత్యేకంగా ఓ ఫ్యాన్‌బేస్ ఉంది. అలాంటి వాళ్లందరి కోసం స్కార్పియో కొత్త మోడల్‌ను లాంచ్ చేశారు. నిజానికి స్కార్పియో అన్న పేరు తప్ప.. ఇప్పటి వరకూ ఉన్న మోడల్‌కు, ఈ కొత్త మోడల్‌కు అసలు పొంతనే లేదు.
ఈ లేటెస్ట్ స్కార్పియో-ఎన్‌లో అత్యాధునిక ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ధర కూడా కేవలం రూ.11.99 లక్షల నుంచి ప్రారంభమైంది. ఈ కొత్త స్కార్పియో-ఎన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూను హిందుస్థాన్ టైమ్స్ ఆటో కరెస్పాండెంట్ శుభోదీప్ చక్రవర్తి అందించాడు.
పాత స్కార్పియోతో పోలిస్తే ఈ కొత్త వెహికిల్ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా ముందు భాగంలో ఎల్‌ఈడీ లైట్లను చాలా స్టైలిష్‌గా తీసుకొచ్చారు. వాటి కిందే సీ షేప్‌లో ఉన్న డేటైమ్ రన్నింగ్ లైట్లు కూడా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఫ్రంట్ గ్రిల్, దానిపై కొత్తగా ఉన్న మహీంద్రా లోగో కూడా ఈ స్కార్పియో-ఎన్‌కు కొత్త లుక్‌ను తీసుకొచ్చింది.
పాత స్కార్పియోతో పోలిస్తే ఈ కొత్త మోడల్ పొడవు, వెడల్పు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీల్‌బేస్ కూడా కాస్త పెద్దగా ఉంది. ఇక ఈ ఎస్‌యూవీ వెనుక భాగంలో పాత స్కార్పియో మోడల్స్‌లాగే సైడ్ ఓపెనింగ్ డోర్‌ను అలాగే ఉంచారు. సాధారణంగా మిగతా అన్ని మోడల్స్‌లో ఈ డోర్ పైకి లేపగలిగేలా ఉంటుంది. బూట్ స్పేస్ కూడా ఎక్కువగా లేకపోవడం కాస్త నిరాశ కలిగించే విషయం.
ఇక కారు లోపల క్యాబిన్‌లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఈ స్కార్పియో-ఎన్ క్యాబిన్ పాత మోడల్స్‌తో పోలిస్తే చాలా అట్రాక్టివ్‌గా ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700లాగే ఇందులోనూ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్స్ ఉపయోగించారు.
ఇక 8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ కూడా ఇందులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. డ్రైవర్ డిస్‌ప్లే సెమీ డిజిటల్‌గా ఉండటం కొందరికి నచ్చకపోవచ్చు. ఇప్పుడు వస్తున్న కార్లలో చాలా వరకూ ఫుల్ డిజిటల్ డిస్‌ప్లే ఉంటోంది. సోనీ 3డీ మ్యూజిక్ సిస్టమ్‌తో సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది.