Breakfast Facts | అతిగా అల్పాహారం తినేవారు బరువు తగ్గినట్లు చరిత్రలో లేదు!
18 September 2022, 6:16 IST
- డైటింగ్‌లో ఒక పాత సామెత ఉంది. అదేంటంటే.. రాజులా అల్పాహారం చేయాలి, యువరాజులా లంచ్ చేయాలి, పేదవాడిలా డిన్నర్ చేయాలి అని. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఎక్కువ మొత్తం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోనే చేసేస్తే క్యాలరీలు సమర్థవంతంగా ఖర్చు చేయవచ్చు, తద్వారా బరువు తగ్గించుకోవచ్చు అనే భావన వ్యాప్తిలో ఉంది. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఏమిటంటే.. అల్పాహారం అంటేనే అల్పంగా అనగా తక్కువ పరిమాణంలో తీసుకునేది అని అర్థం. తాజాగా చేపట్టిన ఒక అధ్యయనంలో ఏం తేలిందంటే, ఒక రోజులో ఎక్కువ మొత్తంలో ఆహారం ఏ సమయంలో తిన్నప్పటికీ, అది బరువును ఎంత మాత్రం ప్రభావితం చేయదు. అల్పాహారం ఎక్కువ మొత్తంలో తింటే బరువు తగ్గుతారనేది అపోహ మాత్రమేనని తాజా పరిశోధన ఫలితాలు తెలిపాయి. అయితే ఉదయం పూట ఎక్కువగా తినేస్తే చాలా సేపటి వరకు ఆకలి ఉండదు, అలాంటపుడు ఆహారం తీసుకోకపోతే అది బరువును ప్రభావితం చేయవచ్చు అని పరిశోధకులు నివేదించారు.