Zaheerabad BRS Leaders Fight : జహీరాబాద్ బీఆర్ఎస్ లో భగ్గుమన్న విభేదాలు, బుజ్జగించిన మంత్రి హరీశ్ రావు!
08 October 2023, 20:00 IST
- Zaheerabad BRS Leaders Fight : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. జహీరాబాద్ బీఆర్ఎస్ నేతలు శివకుమార్, మాణిక్ రావుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
జహీరాబాద్ బీఆర్ఎస్
Zaheerabad BRS Leaders Fight : ఎన్నికలు ముంచుకొస్తున్నసమయంలో జహీరాబాద్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ గెలుపు కోసం మంత్రి హరీశ్ రావు వ్యూహాలు పన్నుతుంటే, జహీరాబాద్ బీఆర్ఎస్ నాయకులు మాత్రం, పార్టీ క్యాడర్, అధికారుల ముందే తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలకు, దూషణలకు దిగారు. హరీశ్ రావు మంచిర్యాల జిల్లా పర్యటన ముగించుకొని జహీరాబాద్ లో అరగంటలో హెలికాఫ్టర్ దిగుతుంది అనగా ఈ సంఘటన జరిగిందట. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.మాణిక్ రావు, డిస్ట్రిక్ట్ కో-ఆపరేటింగ్ అండ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంస్) ఛైర్మన్ మల్కాపురం శివకుమార్ మధ్య ఈ దూషణల పర్వం 15 నిమిషాల పాటు కొనసాగింది. ఎన్నికల్లో పార్టీని నడిపించడానికి హరీశ్ రావు నియమించిన బెవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ దేవి ప్రసాద్ చూస్తుండగానే ఈ తతంగమంతా నడిచింది. మంచిర్యాల నుంచి హెలీకాఫ్టర్ లో రానున్న హరీశ్ రావుని ఆహ్వానించడానికి, అధికారులు, రాజకీయ నాయకులందరూ బర్దీపూర్ అనే గ్రామం దగ్గర ఉన్న హెలిపాడ్ దగ్గరికి చేరుకున్నారు.
శివ కుమార్, మాణిక్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం
ఎమ్మెల్యే మాణిక్ రావు అనుచరుడైన ఒకరు తనకు తెలియకుండా, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తికి గ్రామంలో గృహలక్ష్మి ఇచ్చారని, అతని పేరు ఎవరు లబ్ధిదారుల్లో చేర్చారో చెప్పాలని శివ కుమార్ ను ప్రశ్నించారు. తనకు గృహలక్ష్మితో ఎటువంటి సంబంధం లేదని శివకుమార్ అన్నారు. అలా మాణిక్ రావు అనుచరులకు, శివ కుమార్ కి తీవ్ర వాదోపవాదనలు జరిగాయి. తనను బాధ్యుడ్ని చేస్తున్నందుకు శివ కుమార్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దేవీ ప్రసాద్, మాణిక్ రావు ఎంత వారించినా వినకుండా, హరీష్ రావు రాకముందే హెలిపాడ్ దగ్గర నుంచి వెళ్లిపోయారు. తాను పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని, తనను ఇంకా బద్నామ్ చేస్తే సహించలేనని వెళ్లిపోయారు. ఈ హఠాత్పరిణామం పార్టీ కార్యకర్తలలో గందరగోళం నింపింది.
బుజ్జగించిన హరీశ్ రావు
ఇంతలో హెలికాప్టర్ లో హరీశ్ రావు దిగటం, జరిగిన పరిణామాలు మాణిక్ రావు, దేవీప్రసాద్ మంత్రి వివరించడం జరిగాయి. దగ్గరలో ఉన్న రెండు, మూడు గ్రామాల్లో చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొన్న హరీశ్ రావు, జహీరాబాద్ పబ్లిక్ మీటింగ్ కు ముందే తన కాన్వాయిను జహీరాబాద్ పట్టణంలోని శివ కుమార్ ఇంటికి మళ్లించాడు. సుమారుగా 15 నుంచి 20 నిమిషాల పాటు మాట్లాడి, శివ కుమార్ ను తనతో పాటు పబ్లిక్ మీటింగ్ తీసుకెళ్లారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీ నాయకుల మధ్య ఇలాంటి విబేధాలు ఏ పరిణామాలకు దారి తీస్తాయో అని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.