తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila : అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ రేవంత్ రెడ్డి... షర్మిల

YS Sharmila : అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ రేవంత్ రెడ్డి... షర్మిల

HT Telugu Desk HT Telugu

06 March 2023, 20:19 IST

google News
    • YS Sharmila : రేవంత్ రెడ్డి అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన తెస్తా అంటూ రేవంత్ చేస్తున్న ప్రకటనపై ఆమె సీరియస్ అయ్యారు. వైఎస్ఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డిపై షర్మిల ఫైర్
రేవంత్ రెడ్డిపై షర్మిల ఫైర్

రేవంత్ రెడ్డిపై షర్మిల ఫైర్

YS Sharmila : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు... వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన తెస్తా అంటూ రేవంత్ చేస్తున్న ప్రకటనపై ఆమె సీరియస్ అయ్యారు. చంద్రబాబుతో ఉన్న సమయంలో రేవంత్ .. వైఎస్ఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని... ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి మహానేత జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ కు లేదని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని ఊరూరా తిరిగినా ప్రజలు రేవంత్ ని నమ్మరని వ్యాఖ్యానించారు.

"మహానేత వైఎస్ఆర్ పాలన తెస్తా అంటూ ఓటుకు నోటు దొంగ కొత్త జపం చేయడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు రాజశేఖర్ రెడ్డిని ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా ? మహానేత మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగా కోరు కాదా ? ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ కు వైఎస్ఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. పులి తోలు కప్పుకున్నంత మాత్రానా నక్క పులి కాదు. అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ రేవంత్ రెడ్డి. కారులో తిరుగుతూ ఆట విడుపులా పాదయాత్ర చేస్తూ పాదయాత్ర అనే పదాన్ని అపహాస్యం చేస్తున్నాడు. ఇలాంటి ప్రబుద్ధుడు ఊరూరా తిరిగి పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మరు. ఓటుకు నోటు దొంగను జనాలు నమ్మడం లేదని, మహానేత పేరును వాడకుంటున్న రేవంత్ కు వైఎస్ఆర్ అభిమానులే బుద్ధి చెప్తారు. రాజన్న సంక్షేమ పాలన కోసం పుట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఆ మహానేత ఆశయ సాధన కోసం 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసింది వైఎస్ఆర్ బిడ్డ మాత్రమే" అని షర్మిల అన్నారు.

రేవంత్ రెడ్డి పాదయాత్రపై షర్మిల గతంలోనూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడు చేసేది పాదయాత్ర కాదని.. బస్సులు, కార్లలో తిరుగుతూ పాదయాత్ర అని చెప్పటం ఏంటని నిలదీశారు. తాను మాత్రమే రాష్ట్రంలో నిజమైన పాదయాత్ర చేస్తున్నాని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 3,800 కిలోమీటర్లు యాత్ర చేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ వైఫల్యాలపై పోరాడటంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని... ప్రజా సమస్యలపై గళమొత్తుతోన్న ఏకైక పార్టీ వైఎస్సార్టీపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రాజన్న సంక్షేమ రాజ్యాన్ని తిరిగి తీసుకొస్తామని అన్నారు.

తదుపరి వ్యాసం