Siddipet Tragedy: అప్పు తీర్చమన్నందుకు అన్నపై తమ్ముడి దాడి, మనస్తాపంతో పిల్లలతో కలిసి ఆత్మహత్య
11 November 2024, 7:12 IST
- Siddipet Tragedy: సిద్ధిపేటలో విషాదకర ఘటన జరిగింది. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించమన్న అన్నపై తమ్ముడి చెప్పుతో దాడి చేసి దూషించడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా అందరిని విషాదంలో నింపింది.
పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సత్యం
Siddipet Tragedy: చిన్నతనంలో తండ్రి మరణిస్తే కుటుంబ భారాన్ని మోస్తూ పెంచిన అన్నను తమ్ముడు డబ్బు కోసం దారుణంగా అవమానించడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన సిద్ధపేటలో జరిగింది. సిద్ధిపేటకు చెందిన తేలు సత్యం(49) తన కుమారుడు అన్విష్ నందన్(8), కుమార్తె త్రివర్ణహాసిని (6)లతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామానికి చెందిన సత్యం అతని సోదరుడు శ్రీనివాస్, తల్లి అచ్ఛవ్వతో కలిసి సిద్ధిపేటలోని వివేకానందనగర్ కాలనీలో స్థిరపడ్డారు. సత్యం మొదటి భార్య స్వరూప పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి చిన్నతనంలో మరణించడంతో కుటుంబ బాధ్యతలు సత్యం చూసుకునేవాడు. పట్టణంలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తూ జీవనోపాధిపొందేవాడు.
మొదటి భార్య చనిపోవాడంతో 2016లో పట్టణానికి చెందిన శిరీషను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సత్యం సోదరుడు శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు. శ్రీనివాస్ పెళ్లి సమయంలో అయిన ఖర్చులతో పాటు గతంలో సోదరుడికి ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని సత్యం అడుగుతున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది సత్యం అనారోగ్యానికి గురవడంతో శస్త్ర చికిత్సల కోసం రూ.9.80లక్షల వరకు ఖర్చు చేశాడు.
ఈ క్రమంలో తనకు ఇవ్వాల్సిన డబ్బు కోసం శ్రీనివాస్ ఇంటికి కొడుకుతో కలిసి వెళ్లిన సత్యంపై దాడికి పాల్పడ్డాడు. చెప్పుతో కొట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కొడుకు ముందు తనపై దాడి చేయడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని శనివారం సాయంత్రం పట్టణ శివారులోని చింతల్ చెరువు వద్దకు ద్విచక్రవాహంపై వెళ్లారు.
తమ ముగ్గురి చావుకు సోదరుడు శ్రీనివాసే కారణమంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి, సూసైడ్ నోట్ రాసి వాహనంలో పెట్టి తన పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెలికితీసి సిద్ధిపేట ఆస్పత్రికి తరలించారు. సత్యం భార్య శిరీష పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. .
వివేకనందనగర్ కాలనీకి చెందిన సత్యం ప్రింటింగ్ ప్రెస్ నడిపేవాడు. అనారోగ్యంతో దాని నిర్వహణ కుంటుపడింది. సిద్దిపేట ఏసీపీ మధు, టూ టౌన్ సీఐ ఉపేందర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.