తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial District : కోరుట్లలో ఘరానా మోసం - పింఛన్ ఇప్పిస్తానని వృద్దురాలి బంగారు ఆభరణాలు చోరీ

Jagtial District : కోరుట్లలో ఘరానా మోసం - పింఛన్ ఇప్పిస్తానని వృద్దురాలి బంగారు ఆభరణాలు చోరీ

HT Telugu Desk HT Telugu

21 December 2024, 6:38 IST

google News
    • కోరుట్ల లో ఘరానా మోసం వెలుగు చూసింది. పింఛన్ ఇప్పిస్తానంటూ ఓ యువకుడు… వృద్దురాలి బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. అసలు విషయం తెలియటంతో మోసపోయిన వృద్ధురాలు…. లాబోదిబో అంటు పోలీసులను ఆశ్రయించింది. సీసీ పుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కోరుట్ల లో ఘరానా మోసం
కోరుట్ల లో ఘరానా మోసం

కోరుట్ల లో ఘరానా మోసం

అవ్వా అని పిలిచాడు.. గుర్తు పడుతున్నావా అని అడిగాడు.. పింఛన్ వస్తలేదా అని అప్యాయంగా పలకరించాడు. నాలుగు లక్షలు వచ్చి బ్యాంకులో ఉన్నాయి... ఫోటో దిగితే వస్తాయని మాయ మాటలు చెప్పాడు. ఒంటిపై బంగారం ఉంటే పింఛన్ రాదని చెప్పి ఒట్టి పై ఉన్న బంగారు నగలు తీసి, ఫోటో తీసుకొస్తానని ఆభరణాలతో ఉడాయించాడు.‌ ఈ ఘరానా మోసం జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది.

బాగున్నావా అవ్వా అంటూ….!

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు మెడిసిన్ కోసం కోరుట్ల కు వెళ్ళింది. మందులు తీసుకుని ఇంటికి వెళ్ళేందుకు కోరుట్ల నంది విగ్రహం వద్ద గల బస్టాఫ్ కు చేరింది. ఒంటరిగా వచ్చిన వృద్ధురాలను గమనించిన మోసగాడు, ఆ ముసలమ్మ తో మాటలు కలిపాడు. అవ్వా బాగున్నావా అని పలుకరించాడు. నన్ను గుర్తు పడుతున్నావా అని అడిగాడు. ఏమో నాకు కళ్ళు నదరిస్తాలేవు అని చెప్పింది ముసలమ్మ... నేను మీ వార్డు మెంబర్ ను అంటూ పింఛన్ తీసుకున్నావా అని ఆప్యాయంగా మాటలు కలిపాడు. నాలుగు లక్షలు  నీ ఖాతాలో జమ అయిందని చెప్పాడు. ఎవరికి చెప్పకు, నీ ఒక్కదానికి ఆ డబ్బులు ఇప్పిస్తా, ఒక ఫోటో ఇస్తే సరిపోతుంది అన్నాడు.

ఆప్యాయంగా నిత్యం చూసిన వ్యక్తిలా పలుకరించడంతో తెలిసిన వ్యక్తేనని ముసలమ్మ ఆ యువకుడిని నమ్మింది. బస్టాప్ నుంచి కొద్ది దూరంలోని సంధిలోకి తీసుకెళ్లాడు. పొటో తీయాలి, నీ ఒంటిపై బంగారు నగలు ఉంటే ఫొటోలో అవి కనిపిస్తే పింఛన్ రాదని నమ్మబలికాడు. దీంతో నిజమే కావచ్చని భావించిన వృద్దురాలు మెడలోని రెండున్నర తులాల బంగారు చైన్, చెవి కమ్మలు తీసి ఇచ్చింది. మరో మహిళా లక్ష్మి అక్కడుంది, ఆమెకు ఈ నగలు ఇచ్చి ఫోటో తీసుకొద్దాం పదా అని చెప్పి నగలతో ఉడాయించాడు.

 పోలీసులను ఆశ్రయించిన వృద్ధురాలు...

యువకుడు చెప్పినట్లు వ్యవహరించిన వృద్ధురాలు మోసపోయి లాబోదిబో అంటు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వెంటనే రంగంలో దిగి బస్ స్టాప్ వద్ద సీసీ కెమెరాలను పరిశీలించారు. బస్ స్టాప్ నుంచి బంగారం నగలతో యువకుడు పారిపోయే వరకు సిసి కెమెరాలో స్పష్టంగా యువకుడి తతంగం రికార్డు అయింది. సిసి పుటెజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గుర్తుతెలియ వ్యక్తులు మాయ మాటలు చెప్పితే నమ్మి మోసపోవద్దని పోలీసులు కోరుతున్నారు.

రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం