Yadadri Crime News : మా ఇద్దరిని ఒకే చోట సమాధి చేయండి-కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థినుల సూసైడ్ నోట్
04 February 2024, 15:17 IST
- Yadadri Crime News : 'చేయని తప్పుకు మమ్మల్ని నిందించారు, మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక వెళ్లిపోతున్నాం' అంటూ సూసైడ్ నోట్ రాసి ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భువనగిరి జిల్లాలో చేటుచేసుకుంది.
కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థినుల సూసైడ్ నోట్
Yadadri Crime News : యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ కు చెందిన కోడి భావ్య ( 15), హబ్సిగుడాకు చెందిన వైష్ణవి (15) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. భువనగిరి జిల్లాలోని రెడ్డివాడ బాలిక ఉన్నత పాఠశాలలో భావ్య, వైష్ణవి పదో తరగతి చదువుతున్నారు. ప్రతిరోజు మాదిరిగానే శనివారం కూడా పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రానికి తిరిగి హాస్టల్ కి వచ్చారు. ఆపై వసతి గృహంలో నిర్వహించే ట్యూషన్ కు వీరిద్దరూ హాజరు కాలేదు. దీంతో ట్యూషన్ టీచర్ వారి గురించి అడగగా..... భోజనం చేశాక వస్తామని ఇతర విద్యార్థినులతో చెప్పారన్నారు. కాగా భోజనం సమయంలో కూడా ఇద్దరూ కనిపించకపోవడంతో ఒక విద్యార్థిని వారి గదికి వెళ్లి చూడగా ఇద్దరు ఫ్యాన్లకు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆ విద్యార్థిని హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా 108ను రప్పించి ఇద్దరిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినిలను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే విద్యార్థినుల ఆత్మహత్య చేసుకున్న రూంలో సూసైడ్ నోట్ లభించింది. చేయని తప్పుకు అందరూ తమను మాటలు అనడం తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాశారు.
చెయ్యని తప్పుకు నిందించారు
"మేం వెళ్లిపోతున్నందుకు అందరు మమ్మల్ని క్షమించండి. మేము తప్పు చేయకపోయినా అందరు మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని మా శైలజ మేడం తప్ప ఎవ్వరు నమ్మలేదు. మా బాధ ఎవరికి చెప్పుకోలేక ఇలా వెళ్లిపోతున్నాం. మా ఇద్దరిని ఒకే చోట సమాధి చేయండి" అని సూసైడ్ నోట్ లో రాసి ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు విద్యార్థులు మృతి చెందినట్లు పోలీసులు, పాఠశాల యాజమాన్యం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమకు విషయం వెల్లడించకుండా హాస్పిటల్ కు మృతదేహాలను ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు విద్యార్థినులు ఈ ఘాతుకానికి పాల్పడుతుంటే హాస్టల్ సిబ్బంది ఎక్కడికి వెళ్లారని మృతుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. హాస్టల్ వార్డెన్ శైలజ తో పాటు ట్యూషన్ టీచర్ ను భువనగిరి పోలీసులు విచారిస్తున్నారు. కాగా హాస్టల్లో జరిగిన గొడవ కారణంగానే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని డీఈవో తెలిపారు. భావ్య, వైష్ణవి తమను దూషించి చేయి చేసుకున్నారని నలుగురు విద్యార్థినులు పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పడంతో వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. తమ తప్పేమీ లేకపోయిన తమపై ఫిర్యాదు చేయడాన్ని అవమానంగా భావించిన విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఉరేసుకొని వృద్ధురాలు ఆత్మహత్య
జడ్చర్ల మండల పరిధిలోని బూరెటిపల్లి చివరలో శ్లోక పాఠశాల సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ మెట్లకు శనివారం చీర కొంగుతో వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలి ఆత్మహత్య చేసుకున్న పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం వృద్ధురాలి మృతదేహాన్ని జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ మార్చురీకి తరలించారు. వృద్ధురాలు వివరాలు తెలియాల్సి ఉందని సీఐ ఆదిరెడ్డి వెల్లడించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా