తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Smartphone Vision Syndrome స్మార్ట్ ఫోన్‌తో హైదరాబాద్‌ మహిళకు పాక్షిక అంధత్వం….

smartphone vision syndrome స్మార్ట్ ఫోన్‌తో హైదరాబాద్‌ మహిళకు పాక్షిక అంధత్వం….

HT Telugu Desk HT Telugu

09 February 2023, 12:03 IST

google News
    • smartphone vision syndrome చీకట్లో గంటల తరబడి మొబైల్ ఫోన్ చూడటంతో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ చూపును కోల్పోయింది. స్మార్ట్‌ ఫోన్ విజన్‌ సిండ్రోమ్‌కు బాధితురాలు గురైనట్లు వైద్యులు వెల్లడించారు.  దాదాపు ఏడాదిన్నరగా పాక్షిక అంధత్వానికి గురైన  మహిళ చివరకు వైద్యుడి సాయంతో సమస్య నుంచి బయట పడింది. 
స్మార్ట్‌ ఫోన్‌తో అంధత్వానికి గురైన హైదరాబాద్ మహిళ
స్మార్ట్‌ ఫోన్‌తో అంధత్వానికి గురైన హైదరాబాద్ మహిళ

స్మార్ట్‌ ఫోన్‌తో అంధత్వానికి గురైన హైదరాబాద్ మహిళ

smartphone vision syndrome ఏకబిగిన గంటల తరబడి స్మార్ట్ ఫోన్‌ వినియోగించడంతో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ చూపును కోల్పోయింది. మొబైల్ ఫోన్‌ మితిమీరి వినియోగించడంతో తీవ్రమైన కంటి సమస్యలకు బాధిత మహిళ గురైనట్లు హైదరాబాద్‌ వైద్యుడు గుర్తించారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా స్మార్ట్‌ ఫోన్‌ గంటల తరబడి వినియోగించినట్లు గుర్తించారు. చీకట్లో స్మార్ట్ ఫోన్‌ వెలుగును విపరీతంగా చూడటంతో అంధత్వానికి గురైనట్లు గుర్తించారు. బాధితురాలు వస్తువులను గుర్తించలేకపోవడం, చూపు నిలపలేకపోవడం వంటి సమస్యలకు గురైనట్లు వైద్యుడు చెబుతున్నారు.

స్మార్ట్ వాడకంతో మహిళ చూపును కోల్పోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైద్యుడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. బాధిత మహిళ దాదాపు ఏడాదిన్నరకు పైగా కంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాటిని అశ్రద్ధ చేసింది. ఈ సమయంలో బాధితురాలి చూపు గజిబిజిగా మారడం, ఎక్కువ వెలుగును చూడలేకపోవడం, చూపు తగ్గిపోవడం, వస్తువులను గుర్తించలేకపోవడం, మెరుపులు కనిపించడం వంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు అపోలో ఆస్పత్రికి చెందిన న్యూరాలజీ వైద్యుడు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంధత్వానికి దారి తీసిన పరిస్థితులను స్మార్ట్‌ ఫోన్ విజన్ సిండ్రోమ్‌‌గా డాక్టర్ సుధీర్‌ కుమార్ పేర్కొన్నారు.

కంటి చూపును కోల్పోయిన బాధితురాలు బ్యూటీషియన్‌గా పనిచేసేది. దివ్యాంగుడైన తన కుమారుడిని చూసుకోడానికి ఆమె ఉద్యోగం మానేసినట్లు వైద్యుడు వివరించారు. ఈ క్రమంలో ఇంటి దగ్గరే ఉంటున్న మహిళ స్మార్ట్‌ ఫోన్‌కు బానిసగా మారింది. పగలు, రాత్రి తేడా లేకుండా స్మార్ట్‌ వాడుతూ వచ్చింది. రాత్రి పూట చీకట్లో కూడా రెండు గంటలకు పైగా సమయాన్ని బ్రౌజింగ్‌కు చేసినట్లు వైద్యులకు వివరించింది.

స్మార్ట్‌ ఫోన్ విజన్ సిండ్రోమ్‌ ప్రభావానికి బాధతురాలు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ వినియోగించడంతో ఆమె అంధత్వానికి గురైనట్లు వెల్లడించారు. ఎక్కువ సేపు స్మార్ట్‌ ఫోన్లు, కంప్యూటర్లపై పని చేసే వారు ఈ సమస్యకు గురవుతారని చెప్పారు. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్, డిజిటల్ విజన్ సిండ్రోమ్‌గా కూడా ఈ సమస్యను పరిగణిస్తారన్నారు.

తీవ్ర ఆందోళనతో ఉన్న బాధితురాలకి మరిన్ని పరీక్షలు నిర్వహించలేదని వెల్లడించారు. ఈ సమస్యకు వైద్య చికిత్సలో మందులు కూడా లేనందున ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు చెప్పారు. పాక్షిక అంధత్వానికి దారి తీసిన పరిస్థితులను బాధిత మహిళకు వివరించినట్లు న్యూరాలిజిస్ట్‌ డాక్టర్ సుధీర్ కుమార్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

వైద్యుడి కౌన్సిలింగ్‌తో పాటు స్మార్ట్‌ ఫోన్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని సూచించినట్లు చెప్పారు. దాంతో మహిళ అవసరమైతేనే ఫోన్ వినియోగిస్తానని చెప్పిందని పేర్కొన్నారు. నెలరోజుల తర్వాత ఫోన్ వాడకాన్ని ఆపేయడంతో చూపుకు సంబందించిన సమస్యల నుంచి ఎలాంటి మందులు వాడకుండానే ఆమె కోలుకున్నట్లు చెప్పారు.

దాదాపు 18నెలలుగా బాధితురాలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించిందని చెప్పారు. ప్రస్తుతం ఆ మహిళకు ఎలాంటి ఇబ్బందులు లేవని కళ్లలో మెరుపులు, మసకబారడం, చారలు కనిపించడం, రాత్రి పూట కనిపించకపోవడం వంటి సమస్యలు పరిష్కారమైనట్లు చెప్పారు.

మితిమీరిన వాడకంతో ప్రమాదమే…..

కంటి చూపును కాపాడుకోడానికి డిజిటల్ స్క్రీన్‌లను ఎక్కువ సేపు చూడొద్దని సూచించారు. ప్రతి 20నిమిషాలకు ఓసారి కనీసం 20సెకన్ల పాటు విరామం ఇవ్వాలని చెబుతున్నారు. విరామం ఇచ్చిన సమయంలో కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూడటం వల్ల కళ్లకు దూరంగా ఉన్న వస్తువులు గుర్తించే సామర్థ్యం మెరుగవుతుందని చెప్పారు. 20-20-20 రూల్‌గా దీనిని గుర్తు పెట్టుకోవాలని కంప్యూటర్లు వాడే సమయంలో దీనిని తప్పక పాటించాలని సూచించారు.

పనిచేసే గదిలో తగిన వెలుతురు ఉండేలా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు. తరచూ కంటి పరీక్షలు జరుపుకోవడంతో కూడా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. కంప్యూటర్ స్క్రీన్ నుచి వెలువడే నీలి కాంతుల్ని తగ్గించడానికి ప్రత్యేకమైన కంటి అద్దాలను వినియోగించాలని సూచించారు.

తదుపరి వ్యాసం