Mrigasira Karthi 2023: మృగశిర కార్తె వచ్చేసింది... ఇవాళ చేపలు ఎందుకు తింటారంటే?
08 June 2023, 13:25 IST
- Mrigasira Karthi 2023: ఇవాళ్టితో మృగశిర కార్తె వచ్చేసింది. రోహిణి కార్తె ఎండలతో అల్లాడిపోయే జీవకోటికి మృగశిర కార్తె ప్రవేశం ద్వారా కాస్త ఉపశమనం కలుగుతుంది. తొలుకరి చినుకులకు సూచనగా భావించే ఈ కార్తెలోనే రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఇక ఇవాళ ఎక్కడ చూసిన ఫిష్ మార్కెట్లన్నీ రద్దీగా మారిపోయాయి.
మృగశిర కార్తె వచ్చేసింది
Mrigasira karthi: మృగశిర.... ఈ కార్తె వస్తే చాలు రైతులు ఏరువాకకు సిద్ధమవుతుంటారు. అందుకే ఈ కార్తెను ఏరువాక సాగే కాలం అంటుంటారు. ఏరువాక అంటే నాగేటి చాలు. ఈ సమయం వచ్చిందంటే... నైరుతి ప్రవేశంతో తొలకరి జల్లులు కురుస్తుంటాయి. దీంతో పొలాలు దున్ని పంటలు వేయటం ప్రారంభిస్తుంటారు. మృగశిర కార్తె ఆరంభమైన రోజును వివిధ ప్రాంతాల్లో పలు పేర్లతో పండగ జరుపుకుంటారు. ఇక మృగశిర కార్తె అనగానే చేపలు గుర్తొస్తాయి. తొలిరోజు రోజు చేపలకు పుల్ గిరాకీ ఉంటుంది. ఏ మార్కెట్ చూసినా... రద్దీగా కనిపిస్తుంటాయి. ప్రతి పల్లెలోని చెరువుల వద్ద సందడి కనిపించే దృశ్యాలు దర్శనమిస్తుంటాయి.
చేపలు తింటారు…
ఇవాళ్టి నుంచి ప్రారంభమైన మృగశిర కార్తె... 15 రోజుల పాటు ఉంటుంది. తొలిరోజు ప్రజలు చేపలు తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ పద్ధతి ఆనాదిగా వస్తోంది. చేపలు తింటే.. వ్యాధులు దూరమవుతాయనేది ప్రజల బలమైన నమ్మకం. దీనికి ఓ కారణం ఉందడోయ్..! ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుందని చెబుతుంటారు.
మరోవైపు కార్తె రాకతో వర్షాలు పడుతుంటాయి. ఫలితంగా కొన్ని సీజనల్ వ్యాధలు ప్రబలే అవకాశం ఉంటుంది. తద్వారా కాస్త ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చేపలు తింటుటారానే వాదన ఉంది. మొత్తంగా కార్తె తొలిరోజు రోజున ఏ ఇంట చూసినా వంట గదిలో చేపల పులుసు, వేపుడు వాసన గుమగుమలు కమ్మగా వస్తుంటాయి.
ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కొర్రమీను, రోహు, కట్ల, తిలాపియా, సీర్, సోల్మన్, రవ్వ, కింగ్‌ఫిష్, చందమామ, బండగ, తున, రెడ్ స్నాప్పర్, బెంగాల్ క్రాప్, పింక్ పెర్చ్, బ్లూ కర్బ్స్ వంటివన్నీ మార్కెట్లలో దొరుకుతుంటాయి. వీటన్నింటిలో కొర్రమీనును మరింత ఇష్టపడుతుంటారు చేపల ప్రియులు..!
హైదరాబాద్ లో చేప ప్రసాదం...
Battini Fish Medicine: అస్త్మా, ఉబ్బసం రోగుల ఇబ్బందుల నుంచి ఊరటనిస్తుందని విశ్వసించే బత్తిని బ్రదర్స్ చేపమందు పంపిణీకి సర్వం సిద్ధమైంది. మృగశిరకార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా శుక్రవారం(జూన్ 9) ఉదయం 8 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.కరోనా వ్యాప్తి కారణంగా మూడేళ్ల తర్వాత బత్తిని కుటుంబం ఈ సంవత్సరం చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, కలెక్టర్ అమోయ్ కుమార్‌ల పర్యవేక్షణలో బత్తిని హరినాథ్‌గౌడ్ నేతృత్వంలో ప్రభుత్వ విభాగాలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 34 కౌంటర్లు, 32 క్యూలైన్లు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సరిపడా టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు, కౌంటర్లు ఉన్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో రెండు రోజుల పంపిణీ తర్వాత పాతబస్తీలోని దూద్‌బౌలిలోని తమ నివాసంలో బత్తిని కుటుంబం వారం రోజులపాటు చేప ప్రసాదం అందించనుంది. ఆస్తమాతో పాటు ఉబ్బసం వంటి సమస్యలు ఉన్నవారితో పాటు చాలా మంది ఈ ప్రసాదాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా క్యూ కడుతారు. హైదరాబాద్‌లో ప్రతి ఏటా చేప ప్రసాదం పంపిణీ జరుగుతుంది. కరోనా వల్ల గత మూడేళ్లుగా పంపిణీకి బ్రేక్ పడింది. మళ్లీ ఈ ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.