Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు ఎందుకు వచ్చింది?
11 December 2022, 15:08 IST
- Kavitha Name In Delhi Liquor Scam : దిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో అందరి దృష్టి ఈ కేసుపైనే ఉంది. కవిత నివాసంలో సీబీఐ విచారణ జరుగుతుండటంతో అందరూ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఉన్నారు.
ఎమ్మెల్సీ కవిత(ఫైల్ ఫొటో)
గతేడాది ప్రవేశపెట్టిన దిల్లీ లిక్కర్ పాలసీ(Delhi Liquor)లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారదత్తం చేస్తూ.. దిల్లీ ప్రభుత్వం పాలసీని మార్చింది. దిల్లీ కొత్త చీఫ్ సెక్రెటరీ రాకతో ఈ స్కామ్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించి.. సమగ్రంగా నివేదిక రూపొందించి.. సీఎస్ నరేష్ కుమార్.. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు అందజేశారు. జూలైలో ఈ కేసును.. సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించారు. అయితే అదే సమయంలో కొత్త పాలసీతో ఆదాయం పెరగడం లేదని.. రద్దు చేసింది దిల్లీ ప్రభుత్వం.
మద్యం దుకాణాల కేటాయింపుల్లో నిబంధనలక విరుద్ధంగా గుత్తాధిపత్యం కనిపించింది. మరోవైపు కరోనా(Corona) పేరుతో దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్లు నష్టం చేశారు. ఎల్ 1 కేటాగిరి లైసెన్సులు జారీలో లంచాలు తీసుకోని పరిష్మన్లు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. మనిష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఓ మద్యం వ్యాపారి.. కోటి రూపాయలు తరలించినట్టుగా వార్తలు వచ్చాయి.
రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీ చేసి.. లంచాలు ఇచ్చినట్టుగా గుర్తించారు అధికారులు. ఈ కుంభకోణంలో సిసోడియా అనుచరలు.. దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు ముఖ్యంగా కీలక పాత్ర పోషించినట్టుగా తెలుసుకున్నారు. ఇక అక్కడ నుంచి ఈ కేసుకు సంబంధించి.. కొత్త కొత్త మలుపులు తీసుకుంటోంది. మద్యం పాలసీ రూపకల్పనలో ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అరెస్టు అయిన అమిత్ అరోరా.. రిమాండ్ రిపోర్టు(Remand Report)లోనే మూడుసార్లు ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించింది సీబీఐ.
వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్(South Group) చెల్లించింది. సౌత్ గ్రూప్ ను నియంత్రించింది శరత్ రెడ్డి, కవిత, వైసీపీ ఎంపీ మాగుంట అని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్లను విజయ్ నాయర్ కు చేర్చినట్టుగా ఈడీ(ED) వెల్లడించింది. దర్యాప్తులో ఇచ్చిన వాంగ్మూలంలో అరోరా ధృవీకరించారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది ఈడీ. 36 మంది రూ.1.38 కోట్ల విలువైన 170 మెుబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపింది. వీటిలో కవిత రెండు నెంబర్లు, పది మెుబైల్ ఫోన్ల్(Mobile Phones) వాటినట్టుగా పేర్కొంది. కవిత వాడిన పది ఫోన్లు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది.
వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చినట్టుగా ఈడీ తెలుసుకుంది. ఇదే విషయాన్ని అరోరా కూడా అంగీకరించారని తెలిపింది. వైసీపీ ఎంపీ(YSRCP MP) మాగుంట శ్రీనివాసులరెడ్డి సమన్వయపరిచారని పేర్కొంది. ఇందు కోసం.. ప్రత్యేకంగా ఫోన్స్ ఉపయోగించారని, వాటిని మార్చారని, ధ్వంసం చేశారని ఈడీ చెబుతోంది.
ఈ లిక్కర్ కుంభకోణంలో.. అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించారని ఈడీ నుంచి వినిపిస్తున్న సమచారం. గురుగావ్ కు చెందిన అమిత్ అరోరా, దినేష్ అరోరా, అర్జున్ పాండేతో కలిసి పాలసీని రూపొందించడంలో కీలకంగా పనిచేసినట్టుగా తెలుస్తోంది. సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు చెల్లించిన వారిలో.. అరబిందో శరత్ రెడ్డి(Sarath Reddy)తో పాటు కవిత పేరును ఈడీ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. అరబిందో డైరక్టర్ శరత్ రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ విజయ్ నాయర్ ఎవంటే.. ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ మాజీ సీఈఓ. మనీష్ సిసోడియా సన్నిహితుడు.
మెుదటి నుంచి కవితపై బీజేపీ నేతలు(BJP Leaders) దిల్లీ లిక్కర్ స్కామ్ గురించి విమర్శలు చేస్తున్నారు. తనపై ఆరోపణల చేయడంపై కవిత మండిపడ్డారు. ఆధారాలు లేకుండా.. ఆరోపిస్తున్నారని కోర్టుకు వెళ్లారు. తనపై విమర్శలు చేయకుండా.. కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు.