Congress In Munugode : మునుగోడులో డిపాజిట్ గల్లంతు.. ఈ కాంగ్రెస్ కు ఏమైంది?
06 November 2022, 17:49 IST
- Munugode By poll Result : మునుగోడు కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం. మెుదటి నుంచి పోరులో లేనట్టుగానే కనిపించింది. గెలుస్తుందా? అనడం కంటే.. గెలిపిస్తుందా? అనే అంశంపైనే ఎక్కువగా చర్చ నడిచింది? కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది.
కాంగ్రెస్ పార్టీ
రేవంత్ రెడ్డి చేతికి కాంగ్రెస్(Congress) పగ్గాలు వచ్చాక.. ఊపు పెరిగింది. కానీ మునుగోడు రిజల్ట్ చూసి.. మళ్లీ ప్రశ్నలు మెుదలు అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. నల్గొండ జిల్లాలో కీలక నేతలున్న కాంగ్రెస్ పార్టీ.. మునుగోడును లైట్ గా తీసుకున్నట్టుగా ఉంది. సరైన పోల్ మేనేజ్ మెంట్ కూడా లేక.. డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. మునుగోడు కాంగ్రెస్ అడ్డా అని చెప్పుకొన్న పార్టీ ఇప్పుడు ఏం చేస్తుంది? మునుగోడు(Munugode)లో మూడో స్థానానికి పరిమితం చేశారు ప్రజలు.
టీఆర్ఎస్(TRS) హవా ఎక్కువగా ఉన్న సమయంలోనూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్, మునుగోడులాంటి స్థానాలను గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వా త జరిగిన ఉపఎన్నికలో హుజూర్ నగర్(Huzurnagar) స్థానాన్ని కారు తీసుకెళ్లింది. ఇప్పుడు ఉన్న ఒక్క సీటు మునుగోడు కాస్త.. మళ్లీ అదే కారులోకి వెళ్లింది. నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి అడ్డగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కస్థానం కూడా లేకుండా అయిపోయింది. కోమటిరెడ్డి బ్రదర్స్(Komatireddy Brothers).. తమ కనుసన్నల్లోనే జిల్లా రాజకీయాలను శాసించేవారు. రాజగోపాల్ రెడ్డి సైడ్ అయిపోవడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
పాల్వాయి స్రవంతి(Palvai Sravanthi)ని ఉపపోరులో బరిలోకి దింపిన హస్తం పార్టీ.. గోవర్దన్ రెడ్డి, మహిళా సెంటిమెంట్ కలిసి వస్తుందని ఆశలు పెట్టుకుంది. కానీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. క్యాడర్ ఉందనే ధీమాతో ఉన్నా.. వెళ్లేవారు రాజగోపాల్ రెడ్డితో వెళ్లారు. మిగిలిన వారిని సమన్వయం చేసే నేతలే కరవయ్యారు. ఇదే కాంగ్రెస్ పార్టీకి కనీసం రెండో స్థానం కూడా రాకుండా చేసింది. పోల్ మేనేజ్ మెంట్(Poll Management) సరిగా జరగలేదు. పార్టీ నుంచి క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగింది. దీంతో పాల్వాయి స్రవంతి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) బ్రదర్.. వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారాని దూరంగా ఉన్నారు. ఎన్నికకు ముందు కొంతమంది నేతలతో ఫోన్లో టచ్ లో ఉన్న ఆడియోలు బయటకు వచ్చాయి. ఇలాంటి విషయాలు కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారాయి. రేవంత్ రెడ్డి(Revanth Reddy) లాంటి నేతలు మునుగోడులో మకాం వేసినా.. సమన్వయ లోపం కనిపించింది. ఎవరి పనుల్లో వారే ఉన్నట్టుగా అగుపించింది. దామెదర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు ఉన్నా.. ఇదే సమస్య ప్రధానంగా ఉంది. ఆడ బిడ్డ సెంటి మెంట్ వర్కవుట్ అవ్వలేదు
కాంగ్రెస్ పార్టీ(Congress Party) మునుగోడులో ప్రధానంగా పోల్ మేనేజ్ మెంట్ చేయడంలో విఫలమైంది. అభ్యర్థి ఎంపిక కూడా ఆలస్యం కావడం కూడా ఓ కారణంగా కనిపిస్తుంది. ముందు నుంచి.. పోటీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ(TRS Vs BJP) అనే ప్రచారాన్ని సరిగా తిప్పికొట్టడంలో హస్తం పార్టీ విఫలమైంది. ముక్కోణపు పోరు అనే పాయింట్ ను కూడా జనాల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోయింది. మరోవైపు పాల్వాయి స్రవంతి ఒంటరి పోరు చేసినట్టుగానే కనిపించింది. ప్రచారం చివరి రోజు మహిళలతో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగంతో కొంత కలిసి వస్తుందని అంచనా వేసినా… ఓట్ల రూపంలో మారడం విఫలమైంది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి వెళ్లింది.
కాంగ్రెస్ పార్టీకి మునుగోడు(Munugode)లో కార్యకర్తలు ఉన్నా.. సరిగా నేతలు వారిని సమన్వయం చేయలేకపోయారని అర్థమవుతోంది. పాల్వాయి స్రవంతి స్వతంత్ర అభ్యర్థిగా పోటిలో దిగినప్పుడు వచ్చిన ఓట్లతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువగా వచ్చాయి. భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్(Cross Voting) జరిగింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ఈ ఓట్లు వెళ్లాయి. కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగానూ మునుగోడులో పెద్దగా ప్రభావం చూపలేదు. మరోవైపు రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఉండటంతో కీలక నేతలంతా ఆయన దగ్గరే ఉన్నారు. ఇక్కడ సమన్వయం చేసేవారు కనిపించలేదు.
కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. సరిగా ట్రై చేస్తే.. రెండో స్థానంలో వచ్చే అవకాశం ఉన్న సిట్టింగ్ స్థానం అది. కానీ పోల్ మెనేజ్ మెంట్ సరిగా చేసుకోకుండా పోయింది. మునుగోడు ఓటమితో ఉమ్మడి నల్గొండ(Nalgonda) జిల్లాలో ఉన్న ఒక్క సీటు కూడా టీఆర్ఎస్(TRS) పార్టీలోకి వెళ్లింది. అంతకుముందు హుజూర్ నగర్, ఆ తర్వాత నాగర్జున సాగర్, ఇప్పుడు మునుగోడు గులాబీ పార్టీ గుప్పెట్లోకి వెళ్లాయి. ఈ మూడు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువే ఉంది. కానీ నేతల సమన్వయ లోపం, ఇతర కారణాలతో ఓటమి పాలైంది.
1962 నుంచి 1985 వరకు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. 1985 నుంచి 99 వరకు కమ్యూనిష్టు పార్టీ నుంచి నారాయణ రావు ఎంపికయ్యారు. 1999–2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2004-09లో కమ్యూనిష్టు పార్టీ నుంచి పల్లా వెంకట్‌రెడ్డి గెలుపొందారు. 2009-2014లో అదే పార్టీ నుంచి యాదగిరి రావు గెలిచారు. 2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ కూసుకుంట్ల ప్రభాకర్‌రావు గెలుపొందారు. 2018-2022 వరకు కాంగ్రెస్ నుంచి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించారు. తాజాగా ఉపఎన్నికలో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ మూడోస్థానానికి వెళ్లింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.