తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly Elections 2023 : పోటీకి సై అంటున్న రెబల్స్.. రసవత్తరంగా 'రామగుండం' రాజకీయం!

TS Assembly Elections 2023 : పోటీకి సై అంటున్న రెబల్స్.. రసవత్తరంగా 'రామగుండం' రాజకీయం!

HT Telugu Desk HT Telugu

06 September 2023, 15:03 IST

google News
    • Ramagundam Assembly Constituency: రామగుండం నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పార్టీలో రెబెల్స్ బెడద ఎక్కువగా ఉండగా… కాంగ్రెస్, బీజేపీలో ఆ పరిస్థితి పెద్దగా కనిపించటం లేదు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
రసవత్తరంగా రామగుండం రాజకీయాలు
రసవత్తరంగా రామగుండం రాజకీయాలు

రసవత్తరంగా రామగుండం రాజకీయాలు

Ramagundam Assembly Constituency: సిరులవేణిగా పేరుగాంచిన సింగరేణి ఒకవైపు...భారతదేశానికే వెలుగులు విరజిమ్ముతున్న ఎన్టీపీసీ మరోవైపు...అన్నదాతల కష్టాలను కడతేర్చి యూరియాను అందించే ఆర్ఎఫ్ సీ ఎల్ ఇంకోవైపు.....ఇలా కార్మిక క్షేత్రంగా పేరుగాంచిన రామగుండం నియోజకవర్గంలో ఈ సారి రాజకీయాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సోమారపు సత్యనారాయణ పై టీఆర్ఎస్ రెబెల్ గా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీచేసిన కోరుకంటి చందర్ సుమారు 26 వేల ఓట్లతో గెలుపొందారు. అయితే కొద్దిరోజులకే బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ముఖ్యమంత్రి ముందస్తుగా ప్రకటించారు. ఈ తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గా కోరుకంటి చందర్ పేరును సీఎం ప్రకటించారు. అయితే ఇతర పార్టీ నుంచి గెలుపొంది బీఆర్ఎస్ పార్టీలో చేరిన కోరుకంటి చందర్ కు రెబెల్స్ బాధ మాత్రం తప్పడంలేదు.

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రెబెల్ గా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలుపొందిన కోరుకంటి చందర్ ను వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే రెబెల్స్ గండం తప్పడంలేదు. బీఆర్ఎస్ పార్టీ అనుబంధమైన తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మిర్యాల రాజిరెడ్డి,పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి తో పాటు పలువురు బాహాటంగానే కోరుకంటి పై తిరుగుబావుటా ప్రకటించారు. పార్టీ అభివృద్దికి తాము ఎనలేని కృషి చేస్తే చందర్ ను అభ్యర్థిగా ప్రకటించడంతో రెబెల్స్ గా రంగంలోకి దిగడానికి సిద్దమవుతున్నారు.

ఎవరెవరు బరిలో..?

ఈ సారి రామగుండం నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఠాకూర్ మక్కాన్ సింగ్ బరిలో దిగే ఛాన్స్ ఉంది. గతంలో ఇక్కడి ఓటర్ల నాడి తెలిసినవాడుగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గతంలో ఓడిపోయిన సానభూతితో పాటు కోరుకంటి వ్యూహ ప్రతివ్యూహాలను తిప్పికొట్టే నేతగా మక్కాన్ సింగ్ ను చెప్పవచ్చు. ఇక భారతీయ జనతాపార్టీ నుంచి సోమారపు సత్యనారాయణ ఈ సారి టికెట్ ఆశిస్తుండగా....దాదాపు ఖరారైందనే పార్టీవర్గాలు చెబుతూ వస్తున్నాయి. ఎంపీ అభ్యర్థి అయిన వివేక్ వెంకటస్వామితో రాజకీయ చెలిమి బాగా ఉండడంతో పాటు గతంలో మున్సిపల్ మేయర్ గా,ఎమ్మెల్యేగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఓటర్ల నాడి తెలిసిన నేతగా బీజేపీ నుండి బరిలో నిలుస్తాడని స్థానికులు అంచనాలు వేస్తున్నారు.

అయితే గతంలో పీఆర్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కౌశికహరి,బీఆర్ఎస్ జడ్పీటీసీ కందుల సంధ్యారాణి తెలంగాణ బొగ్గు గని కార్మికసంఘం నాయకులు,మిర్యాల రాజిరెడ్డితో పాటు మరికొందరు అభ్యర్థులు ఈ సారి పోటీలో నిల్చునే అవకాశం ఉంది. ఫలితంగా రామగుండం రాజకీయం రసవత్తరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో… ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

రిపోర్టింగ్ : గోపీకృష్ణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా

తదుపరి వ్యాసం