తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rahul Gandhi Tour | రాహుల్ గాంధీని ఓయూకు అనుమతించకుంటే ఎవరికి లాభం?

Rahul Gandhi Tour | రాహుల్ గాంధీని ఓయూకు అనుమతించకుంటే ఎవరికి లాభం?

Anand Sai HT Telugu

04 May 2022, 16:25 IST

google News
    • తెలంగాణలో కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ పర్యటన గురించే చర్చ అంతా. ఆయనను ఓయూ విద్యార్థులతో సమావేశానికి అనుమతించకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ ఈ విషయాన్ని హైప్ చేసింది. పర్మిషన్ కోసం.. టీపీసీసీ ఎక్కడా తగ్గట్లేదు. మళ్లీ కోర్టు మెట్లు ఎక్కింది.
రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

మే 6వ తేదీన రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో.. టీపీసీసీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఓయూలో విద్యార్థులతో మే 7న సమావేశం కావాలని నిర్ణయించింది. దీనికోసం.. ఓయూ వీసీని కలిసి పర్మిషన్ కూడా అడిగింది. అయితే ఓయూలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వమని.. గతంలోనే నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. పట్టుకున్నారు. అనుమతిస్తే.. సీఎం కేసీఆర్ కు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నిస్తున్నారు. పర్మిషన్ కోసం.. హైకోర్టుకు వెళ్లగా.. పర్మిషన్ పై పరిశీలించాలని ఓయూను ఆదేశించింది న్యాయస్థానం. అయినా.. వీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

రాజకీయాలకు అతీతంగా జరిగే సభ అని.. ఎలాంటి కండువాలు వేసుకోమని కాంగ్రెస్ చెబుతోంది. విద్యార్థుల సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతామని పేర్కొంటోంది. ఈ విషయాన్ని వీసీ రవీందర్ యాదవ్ పరిగణనలోకి తీసుకోలేదు. అనుమతికి నిరాకరించారు. దీంతో మరోసారి.. కోర్టు మెట్లు ఎక్కింది తెలంగాణ కాంగ్రెస్. ఎలాగైనా సభకు అనుమతి తెచ్చుకోవాలని భావిస్తోంది. అందుకే.. హైకోర్టులో హౌజ్‌మోషన్ పిటిషన్ వేసింది. హైకోర్టు ఆదేశాలను ఓయూ వీసీ పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్ లో తెలిపింది.

ఇప్పటికే ఎన్ఎస్ యూఐ నేతలు.. మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గరలో నిరసన తెలపడంతో.. అరెస్టు అయ్యారు. ఈ విషయం కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చినట్టైంది. ఒకవేళ ఓయూలో అనుమతి లేకుంటే.. చంచల్ గూడా జైలులో అయినా.. విద్యార్థులను రాహుల్ కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి రాహుల్ గాంధీ ఓయూకి వచ్చి విద్యార్థులతో సమావేశం పెట్టి మాట్లాడితే వచ్చే ప్రచారం కంటే ఎక్కువగా ఈ పరిణామాలతో కాంగ్రెస్ కు వచ్చింది. అనుమతించకుండా కట్టడి చేస్తున్న ప్రభుత్వ తీరుపై కొంత విమర్శలు వస్తున్నాయి. ఇక ఇవన్నీ కాకుండా.. రాహుల్ గాంధీ నేరుగా చంచల్ గూడా జైలుకెళ్లి.. విద్యార్థులతో ములాఖత్ అయితే.. కావాల్సినదానికంటే.. ఎక్కువగా ప్రచారం వచ్చే అవకాశం ఉంది. చంచల్ గూడా జైలుకు అనుమతించకపోవచ్చు. కానీ.. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగితే కాంగ్రెస్ కు ప్లస్ అవుతుంది. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలతో బండి సంజయ్.. పాదయాత్రకు మైలెజ్ తగ్గినట్టుగా కనిపిస్తోంది.

రాహుల్ గాంధీ సభ రోజు.. ఎలాంటి విషయాలు జరుగుతాయో వేచి చూడాలి. గతంలో బీజేపీ ఎంపీ తెజస్వి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ సమయంలోనే.. ఆర్ట్స్ కాలేజీ భవనంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడానికి.. విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించారు. ఆయనపై ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ ఫిర్యాదు ఆధారంగా ఆయనపై క్రిమినల్ అతిక్రమణ ఆరోపణలపై కేసు నమోదైంది.

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ కార్యకలాపాలకు ఓయూ వేదికైంది. అయితే తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఉద్యోగాలు, ఇతర హామీలు నెరవేర్చలేదంటూ.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. క్యాంపస్‌లో పలుమార్లు నిరసనలు కూడా వెల్లువెత్తాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతించకపోవడాన్ని.. కాంగ్రెస్ నేతలు హైలెట్ చేస్తున్నారు.

తదుపరి వ్యాసం