BJP: లక్ష్మణ్ కే సీటు ఎందుకిచ్చారు..? ‘మిషన్ తెలంగాణ’లో మరో పావు కదిపినట్లేనా..
01 June 2022, 16:40 IST
రాజ్యసభ సీట్లలో తెలంగాణ నుంచి సీనియర్ నేతకు అవకాశం ఇచ్చింది కమలదళం. ఈ స్థానంపై చాలా మంది కన్నేసినప్పటికీ లక్ష్మణ్ కు మాత్రమే ఛాన్స్ దక్కింది. అయితే దీనికి చాలా లెక్కలే ఉన్నాయనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా జరుగుతుంది.ఏంటా చర్చలు.. ఏంటా లెక్కలు...?
బీజేపీ మిషన్ తెలంగాణ
రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే పలు పార్టీ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక జాతీయ పార్టీలు లెక్కలు వేసుకుంటూ మరీ డిక్లేర్ చేసే పనిలో పడ్డాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణపై ఇప్పటికే ఫోకస్ పెట్టిన బీజేపీ.. మరో స్టెప్ వేసింది. ఓ సీనియర్ నేతకు యూపీ నుంచి సీటు కన్ఫర్మ్ చేసింది. సరిగ్గా ఈ పరిణామామే.. తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ గా మారింది.
రేసులో చాలా మంది…
ఏపీ, తెలంగాణకు చెందిన బీజేపీ నేతలకు గుడ్ న్యూస్ రాబోతుందంటూ కొద్దిరోజులుగా చర్చ నడించింది. యూపీ కోటాలో రాజ్యసభ స్థానాలకు అవకాశం ఇస్తారని జోరుగా వార్తలు వచ్చాయి. చాలా మంది పేర్లు కూడా వినిపించాయి. ఇందులో గరికపాటి, కే లక్ష్మణ్, మురళీధర్ రావు, విజయశాంతితో పాటు ఏపీ నుంచి టీజీ వెంకటేశ్, పురందేశ్వరి, సుజానా చౌదరి, సత్య కుమార్ పేర్ల ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. అయితే వీటిలో లక్ష్మణ్ పేరునే ఖరారు చేసింది కమల నాయకత్వం. ఆయన ఎంపికపై అన్ని కోణాల్లో ఆలోచించే ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సామాజికవర్గం...!
ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడుగా ఉన్న లక్ష్మణ్... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పని చేశారు. పార్టీలోనూ సీనియర్ లీడర్ కావటంతో పాటు... బలమైన బీసీ సామాజికివర్గానికి చెందిన వారు కావటం కూడా రాజ్యసభ ఎంపికలో ఆయనకు కలిసివచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కూడా బీసీ వర్గానికి చెందినవారే..! ఈ క్రమంలో బీసీ ఓటు బ్యాంక్ ను తమవైపు ఆకర్షించే పనిలో భాగంగానే ఆయనకు ఛాన్స్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. రాబోయే ఏడాది ఎన్నికలు రానున్న దృష్ట్యా... రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణకు అవకాశం ఇవ్వటం ఓ వ్యూహంగా కనిపిస్తోంది. లక్ష్మణ్ ఎంపిక ద్వారా కేడర్ తో పాటు రాష్ట్ర ప్రజానీకానికి ఓ పాజిటివ్ మేసేజ్ ను పంపే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. తద్వారా తెలంగాణపై మరింత పట్టు సాధించవచ్చనే లెక్కలు వేసుకుంటుందంట కమల నాయకత్వం.
టీఆర్ఎస్, వైసీపీ...
మరోవైపు రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో టీఆర్ఎస్... బీసీ సామాజికవర్గానికి చెందిన రవిచంద్రకు అవకాశం ఇచ్చింది. పక్క రాష్ట్రమైన ఏపీలో ఆర్. కృష్ణయ్యతో పాటు బీద మస్తాన్ రావులను అభ్యర్థులగా ప్రకటించింది వైసీపీ. ఈ క్రమంలో ఆయా పార్టీలు సామాజిక న్యాయం పాటించిన నేపథ్యంలో... బీజేపీ కూడా ఈ తరహాలో నిర్ణయం తీసుకుందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
నిజానికి 2019 తరువాత నుంచి తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు రావటంతో... ఇక్కడ స్కోప్ ఉందని భావించిన అధినాయకత్వం...క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కసరత్తు మొదలుపెట్టింది. బండి సంజయ్ కి అధ్యక్షత పదవి కట్టబెట్టింది. అనంతరం జరిగిన దుబ్బాక, హైదరాబాద్ మేయర్ ఎన్నికలు, హుజురాబాద్ బై పోల్ లో సత్తా చాటి.. అధికార టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. ఓ దశలో తామే ప్రత్యామ్నాయం అనే స్థాయిలో దూకుడు పెంచిన విషయం తెలిసిందే.
ఇక వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తున్ననేపథ్యంలో... మిషన్ తెలంగాణపై మరింత దృష్టి పెట్టింది. ఈ మధ్యే నడ్డా, అమిత్ షాతో మోదీ కూడా రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన నేతకు.. యూపీ కోటా నుంచి రాజ్యసభకు పంపటంతో సీన్ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. మరోవైపు వచ్చే నెలలో మరోసారి ప్రధాని మోదీతో పాటు అమిత్ షా కూడా తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
టాపిక్